
ఆదిలాబాద్టౌన్/బోథ్/నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులకు బోథ్ మండలంలోని మర్లపెల్లి, కంటేగాం, నిగిని, సుర్జాపూర్, నక్కలవాడ, బాబెర గ్రామాల్లోని ఇండ్ల రేకులు, పైకప్పులు ఎగిరిపోయాయి. పలు చోట్లు చెట్లు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోయాయి. నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలో ఆదిలాబాద్–నిర్మల్ రహదారిపై భారీగా చెట్లు విరిగిపడిపోయాయి. దీంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ఏర్పడింది.
రోడ్లపై విరిగిపడిన చెట్లను ఫారెస్ట్ ఆఫీసర్లు జేసీబీ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం పడడంతో కరెంట్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదిలాబాద్జిల్లా కేంద్రంలో దాదాపు 4 గంటలపాటు ఈదురు గాలులతో భారీ వర్షం పడింది.