తుపానులు, వరదలు, భారీవర్షాలు, కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కలిగే నష్టం గురించి మాటల్లో చెప్పలేం. ప్రకృతి వైపరీత్యం అంటే 1. అతివృష్టి, 2. అనావృష్టి. ఇవి రైతులతోపాటు సమాజానికీ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. గతంలో సునామీ, భూకంపాలు, ఇతర విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడానికి సరైన వ్యవస్థ లేక అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక విపత్తులను ముందే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైతే వేరే ప్రాంతాలకు తరలించడం వీలవుతోంది. ఇటీవల తరచూ తుపానులతో భారీగా ఆస్తి నష్టం కలుగుతోంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడటానికి, నష్ట ప్రభావం తగ్గించడానికి, పర్యావరణ వ్యవస్థను కాపాడుకోవడానికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఆరేండ్ల క్రితం అక్టోబర్‌లోనే కోస్తా తీరంపై “హుద్ హుద్” తుపాను విరుచుకుపడింది. గత పదేండ్లలో విధ్వంసకరమైన మహా తుపానుగా దీనిని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. పంటలను పూర్తిగా దెబ్బతీసింది. ఈ నెల 13న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురవడంతో నగర, పల్లె జీవనం అస్తవ్యస్థమైంది. వ్యవసాయ, ఆహార పంటలు పూర్తిగా నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ సమతుల్యత లేకపోవడం వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. వీటివల్ల తలెత్తే విపత్తులను మానవాళి ఎదుర్కోవడం అసాధ్యం. అయితే ముందస్తు ఏర్పాట్లతో నష్ట ప్రభావాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
200 ఏండ్లలో 320 తుపానులు
మనదేశంలో 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. తీరానికి 50 కిలోమీటర్లలోపు 25 కోట్ల జనాభా ఉంది. తీర ప్రాంతాల్లో విస్తరించిన మడ అడవులు, ఉప్పునీటి కయ్యలు, చిత్తడి నేలలతోపాటు అనేక రకాల ఇసుక నేలల్లో విశిష్టమైన జీవవైవిధ్య సంపద ఉంది. జనాభా పెరుగుదలతో అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలు, పరిశ్రమలు, ఓడరేవుల ఏర్పాటు వల్ల జీవ వైవిధ్యంపై ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల ఎన్నో విపత్తులను ఎదుర్కోవలసి వస్తోంది. 1800 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం మధ్య కాలంలో దేశంలో 320 తుపానులు ఏర్పడగా వాటిలో 110 వరకు తీవ్ర నష్టం కలిగించాయి. కోస్తా తీరంలో 1977లో దివిసీమ, 1997లో కోనసీమ, 1999లో ఒడిశా తుపానులతోపాటు, హుద్ హుద్, తిత్లి వంటి తుపాన్లు తీర ప్రాంతంలో తీవ్ర నష్టాన్ని కలిగించాయి. 2004 నాటి సునామీ ఎంత అపార నష్టం కలిగించిందో మనకు తెలియనిది కాదు. ప్రపంచంలో అత్యంత ఘోరమైన 10 తుపానుల్లో 1839లో కాకినాడ తీరంలో ఏర్పడిన తుపాను కూడా ఒకటిగా చెబుతారు. దాని కారణంగా మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.
ప్రణాళికాబద్ధమైన విధానాలు ఉండాలి
భూతాపం, భూ వినియోగ తీరులో మార్పులు, కాలుష్యం, భూసార క్షీణత వంటి కారణాల వల్ల జీవవైవిధ్యం దెబ్బతింటోందని లివింగ్ ప్లానెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 120 దేశాల శాస్త్రవేత్తలు, నిపుణులు రూపొందించిన ఈ రిపోర్ట్‌లో పలు కీలక సూచనలు చేశారు. 2030 కల్లా జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి చర్యలు మొదలుపెట్టాలి. జీవవైవిధ్యానికి భంగం కలిగించని రీతిలో ఆహారోత్పత్తి, వాణిజ్యం సాగించాలి. ప్రకృతికి హాని కలిగించకుండా పారిశ్రామికవేత్తలు నిబద్ధత పాటించాలి. దీనికి ప్రణాళికాబద్ధమైన విధానాలను ప్రభుత్వం రూపొందించాలి.
పర్యావరణంపై పెరుగుతున్న ఒత్తిడి
ప్రపంచ భూభాగంలో 58% అడవుల నరికివేత వంటి వాటి వల్ల పర్యావరణంపై ఒత్తిడి పెరుగుతోంది. అటవీ భూములను పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలకు వాడటం ఆగడంలేదు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో మనదేశం వ్యవసాయ విస్తరణ, కాలుష్యం, పట్టణీకరణ వల్ల మూడో వంతు చిత్తడి నేలలు కోల్పోయింది. వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగినా సముద్రంలో 99% పగడపు దిబ్బలు అంతరించి పోతాయని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలో 20 నదుల పరీవాహక ప్రాంతాల్లో 14 ప్రాంతాల ప్రజలు 2050 నాటికి తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటారని ఎల్పీఆర్ హెచ్చరించింది. పర్యావరణ విధ్వంసం వ్యవసాయ, ఇతరత్రా రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి
గత 25 ఏండ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన దాదాపు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణాలు వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 13న కురిసిన కుంభవృష్టికి హైదరాబాద్ జలదిగ్బంధంలో కూరుకుపోయింది. రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం పూర్తిగా నష్టపోయింది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారిస్తున్నాయి. 60 శాతం జనాభా తీర ప్రాంతంలో నివసిస్తున్న అమెరికా 1972 నుంచి తీరప్రాంత నిర్వహణ కోసం ప్రత్యేక చట్టాలను అమలులోకి తెచ్చింది. మన దేశంలోనూ విపత్తులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తే తుపానుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చు.
రైతులను ఆదుకోవాలి
ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు రైతులను నిండా ముంచాయి. వర్షాలు, వరదలకు 25 లక్షల ఎకరాల్లో నష్టం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో పత్తి, మిర్చి, ఇతర కూరగాయల పంటలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కోతకొచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. లక్షల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు అందించాలి.
రక్కిరెడ్డి ఆదిరెడ్డి
డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం ఫ్యాకల్టీ, కాకతీయ విశ్వవిద్యాలయం