
జయశంకర్ భూపాలపల్లి/ నర్సింహులపేట/ నల్లబెల్లి/ నర్సంపేట/ పరకాల/ శాయంపేట, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి వేగంగా వీచిన గాలులతో అకాల వర్షం కురవడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పలువురి ఇండ్లపై రేకులు కొట్టుకుపోయాయి. చెట్లు కూలగా, పోల్స్ విరిగి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న, అరటి పంటలు నేలవాలాయి. ఆరబెట్టిన వడ్లు, మిర్చి, మొక్కజొన్న తడిసిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. అన్నదాతలకు అపారనష్టం వాటిల్లింది. వ్యవసాయ, హార్టికల్చర్ ఆఫీసర్లు ప్రాథమికంగా పంటనష్టం అంచనా వేస్తున్నారు.
భారీగా నష్టం...
ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లుగా ఆఫీసర్లు తెలిపారు. జిల్లాలో సుమారు రూ.20 కోట్ల నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు. మొగుళ్లపల్లి శివారులో, పర్లపెల్లి ములకలపల్లి గ్రామాల మధ్య ప్రధాన రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిట్యాల మండలంలోని కైలాపూర్ శివారులోని రామచంద్రాపూర్ లో అరటి తోటలు నేల వాలాయి. భూపాలపల్లి డివిజన్ ఉద్యాన శాఖ అధికారి ఏ.సునీల్ కుమార్, చిట్యాల ఏవో శ్రీనివాస్ రెడ్డిలో కలిసి నష్టపోయిన అరటి తోటలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
మొగుళ్లపల్లి, చిట్యాల, రేగొండ మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కూలగా, కరెంట్ వైర్లపై చెట్లు పడి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట, గూడూరు మండలాల్లో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. నర్సింహులపేట మండలం జయపురంలో వీరబోయిన అశోక్ కు చెందిన రెండు ఆవులను రేకుల షెడ్డులో కట్టేశాడు. గాలివానకు పైకప్పు ఎగిరి పడడంతో, రేకులకు అమర్చిన కరెంటు వైర్లు తెగి కింద ఉన్న ఆవులపై పడడడంతో మృతి చెందాయి. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయ్యాయి.
గూడూరు మండలంలోని పలు గ్రామాల్లో పంట నష్టం జరుగడంతో పరిశీలించి ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు ఏవో అబ్దుల్ మాలిక్ తెలిపారు. నష్టపోయిన పంటలను ఆయన ఏఈవోలతో కలిసి పరిశీలించారు. కాగా, వరంగల్ జిల్లాలో నల్లెబెల్లి, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లో కురిసిన వర్షానికి తీవ్రంగా పంట నష్టం జరిగింది. హనుమకొండ జిల్లాలోని పరకాల, శాయంపేట మండలాల్లో కురిసిన అకాల వర్షానికి పంటలు, ఆస్తి నష్టం జరిగింది. పరకాల మండలంలోని వెల్లంపల్లి, సీతారాంపురం, పోచారం గ్రామాల్లో వరి 130 ఎకరాల్లో నేలకొరగగా, 30 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది
. నడికూడ మండలంలో రెండెకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లగా నర్సక్కపల్లి, కంఠాత్మకూరు, రాయపర్తి గ్రామాల్లో మొక్కజొన్న 10 ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. శాయంపేట మండలంలో 30 ఎకరాల్లో అరటి, 352 ఎకరాల్లో వరి, 55 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినగా అగ్రికల్చర్ఆఫీసర్ మధులిక ఫీల్డ్ కు వచ్చి పంటలను పరిశీలించారు.