తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం

  • నేలకొరిగిన చెట్లు, కరెంట్ స్తంభాలు
  • ఎగిరిపోయిన ఇండ్ల పైకప్పులు
  • ఆసిఫాబాద్​లో గుండివాగుపై తెగిన వంతెన
  • వాంకిడిలో పిడుగు పడటంతో మహిళకు గాయాలు
  • కరీంనగర్ జిల్లాలో రెండు ఆవులు మృత్యువాత
  • వరంగల్–హైదరాబాద్ హైవేపై విరిగిన చెట్టు

వెలుగు, నెట్​వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయం త్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.

ఆసిఫాబాద్ మండలం జెండగూడ గ్రామంలో చెట్లు విరిగి కరెంట్ వైర్లపై పడ్డాయి. ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వస్తువులు, సరుకులు తడిసిపోయాయి. గుండి వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన దుర్గం విక్రుబాయి పిడుగుపాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికులు హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

ఆ తర్వాత మెరుగైన ట్రీట్​మెంట్ కోసం మంచిర్యాలకు తరలించినట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు. బెజ్జూరు విక్లీ సంతలో చిరు వ్యాపారులు, కూరగాయల దుకాణాల కవర్లు ఈదురుగాలులకు చిరిగిపోయాయి. కుశ్నపల్లి, బెజ్జూర్ తదితర గ్రామాల్లో కరెంట్ పోల్స్ మీద చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దహెగాం, గిరవెల్లి గ్రామాల్లోని పలు ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇంట్లో ఉన్న కరెంట్ సామాగ్రి మొత్తం తడిసిపోయింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. శివ్వంపేటలో పలుచోట్ల చెట్లు విరిగి ఇండ్ల మీద పడ్డాయి. కరెంట్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గూడురు గ్రామంలో పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. గ్రామంలోని దర్గా దగ్గర పార్క్ చేసిన కారుపై ఓ చెట్టు విరిగిపడటంతో డ్యామేజ్ అయింది.

సంగారెడ్డి జిల్లాలోని హత్నూర, గుమ్మడిదల, జహీరాబాద్ మండలాల్లో, సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, కోహెడ, కొండపాక మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడటంతో సింగరేణి హైస్కూల్ గ్రౌండ్​లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం మేనేజ్​మెంట్  ఏర్పాటు చేసిన స్టాల్స్ కు సంబంధించిన టెంట్లు కూలిపోయాయి.

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు

ఈదురు గాలుల బీభత్సానికి మడికొండలోని వరంగల్–హైదరాబాద్ హైవేపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో కేబుల్ వైర్లు చెల్లాచెదురుగా పడిపోయి.. కిలో మీటర్​కుపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్, నెల్లికుదురు, నర్సింహులపేట మండలాల్లో భారీ వర్షం పడింది.

కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఉరుములు‌‌, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ఉప్పు రామయ్యకు చెందిన రెండు ఆవులు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.