రంగాపురం గ్రామంలో ఒక చెరువు ఉండేది. అందులో అనేక కప్పలు, చేపలు, తాబేళ్లు నివసించేవి. ఆ చెరువు ఒడ్డుననే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింది కలుగులో ఒక ఎలుక నివసించేది. అది రోజూ బయటకు వచ్చే ముందు తొంగిచూసేది. అది చూసి చెరువులోని గర్వం గల కప్ప ఒకటి ఎప్పుడూ దానిని హేళన చేస్తూ నవ్వేది.
ఒక రోజు కొందరు పిల్లలు ఒక రబ్బరు పామును తెచ్చి దానితో ఆడుకొని, దానిని అక్కడే వదిలేసి ఇళ్లకి వెళ్లిపోయారు. వారు వెళ్లిపోయాక ఆ కలుగులో నుండి ఎలుక తన తలను బయటకు పెట్టి తొంగి చూసి ‘‘అమ్మో !ఇక్కడ పాము ఉంది. నేను ఇప్పుడు బయటకు వెళ్తే ఆ పాముకు ఆహారం కాక తప్పదు” అనుకుంటుంది. అది
‘‘పాము వెళ్ళిందా! లేదా!’’ అని మాటిమాటికి తొంగి చూడసాగింది . ఈ ఎలుకను చూసిన కప్ప నవ్వి అది చెరువు నీటి నుండి బయటకు వచ్చి ఆ పాము ముందరే అటూ, ఇటూ తిరిగింది. అంతేకాకుండా ఆ పాము పైకి ఎక్కి దూకింది. సరిగ్గా అప్పుడే తొంగిచూసిన ఆ ఎలుక అది నిజమైన పాము కాదని గ్రహించి బయటకు వచ్చింది. దానిని చూసిన కప్ప నవ్వి ‘‘ఓ ఎలుకా! నిన్ను చూస్తే నవ్వొస్తోంది. రబ్బరు పామును చూసి నిజమైన పాము అని భ్రమ పడ్డావు” అని అంది. అప్పుడు ఎలుక దాని మాటలను విని ‘‘అవును కప్పా! నువ్వు చెప్పింది నిజమే! మనకు శత్రువు కనబడితే నిర్లక్ష్యం పనికిరాదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన ప్రాణాలకే ప్రమాదం’’ అని అంది. ఆ మాటలకు కప్ప హేళనగా నవ్వింది. ఇంతలో మళ్లీ ఆ పిల్లలు వచ్చి రబ్బరు పాము పట్టుకొనిపోయారు.
ఆ తర్వాత పాములు పట్టే ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఒక నిజమైన పామును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అది ఎలుక, కప్ప గమనించలేదు. అతడు వెళ్లిన వెంటనే ఎలుక తొంగి చూస్తూ బయటకు రావడానికి భయపడింది. చెరువులోని కప్ప మాత్రం నవ్వుతూ బయటకు వచ్చి ఆ పాము ముందు అటూ, ఇటూ తిరగడం మొదలుపెట్టింది. వెంటనే పాము కప్పను పట్టుకుంది. అది చూసిన ఎలుక ‘‘అయ్యో పాపం! ఈ కప్ప నిర్లక్ష్యమే దాన్ని పాముకి దొరికేలా చేసింది. ఎలాగైనా కాపాడాలి” అనుకుంది .
అది బయటకు వచ్చి ఆ పాముతో ‘‘ఓ సర్పమా! ఆ కప్ప చాలా చిన్నది. దానిని వదిలిపెట్టు. కావాలంటే నన్ను తిను. నేను దాని కంటే పెద్దగా ఉన్నా” అంది ధైర్యంగా. ఆ పాముకు కూడా ఎలుకను తినాలని ఎప్పటినుంచో కోరిక. వెంటనే అది కప్పను వదిలిపెట్టింది. అదే అదనుగా ఆ కప్ప పక్కనే ఉన్న చెరువులోకి దూకింది. ఎలుక కూడా వెంటనే ఆ పాముకు చిక్కకుండా పరిగెత్తి తన కలుగులోనికి దూరి తప్పించుకుంది. ఆ పాము అత్యాశ వల్ల ఎలుక, కప్ప రెండూ తప్పించుకున్నాయి. ఆ తర్వాత ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది .
ఆ తరువాత కప్ప బయటకు వచ్చి ఎలుకతో ‘‘మిత్రమా! నా నిర్లక్ష్యం వల్ల నా ప్రాణాలే పోయేవి. నేను నిన్ను హేళన చేసిన విషయం కూడా మరచిపోయి నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు . నన్ను మన్నించు. ఈ పామును కూడా రబ్బరు పాము అనుకున్నా. నేను కూడా ఇకముందు నీకులాగానే జాగ్రత్తగా ఉంటా. తొందరపాటు, నిర్లక్ష్యం పనికిరాదని నేను నీ ద్వారా తెలుసుకున్నా. నా ప్రాణాలను కాపాడిన దేవతవు నీవు’’ అని ఎలుకతో స్నేహాన్ని కోరింది. అలా ఎలుక, కప్ప ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య