“ఒక కుటుంబంలో... ఆనందంగా జీవిస్తున్న ఒక కుటుంబంలో ఆ ఆనందం ఆవిరై పోవడానికి, వారి ఆశల రెక్కలు విరిగిపోవడానికి కారణమేమిటో చెప్పగలరా ...?”
“ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానాలు ఎన్నైనా చెప్పొచ్చు.”
“ఇది ఊహల్లో ఉద్భవించింది కాదు. నా కుటుంబంలో సంభవించింది. దీనికి సమాధానం మీరు ఊహించక్కర్లేదు... నేనే చెప్తాను. ‘నిర్లక్ష్యం’... అవును కేవలం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి హేతువు ఒక వ్యక్తి కావచ్చు లేక ఓ వ్యవస్థ కావొచ్చు. కానీ, దానికి మూల్యం చెల్లించేది...???”
అతనితో పరిచయమై కొద్దిసేపే అయ్యింది. కొద్ది పరిచయంలోనే ఈ సంభాషణ జరిగేంత చనువు మీ మధ్య ఏర్పడిందా అనే అనుమానం రావచ్చు. ఆ విచిత్రమైన పరిచయం జరిగిందిలా...!
* * *
కదిలే రైల్లోకి కంగారుగా ఎక్కాను. అదృష్టం కొద్దీ నేనెక్కిన బోగీలొనే నా రిజర్వ్డ్ సీట్. నెంబర్ వెతుక్కుని సీట్లోకూర్చుని పక్కనున్న బ్యాగ్‌ని సీటు కింద పెడుతుంటే... “అది... చెందూది...” ఆ సీట్ చివర కూర్చున్న ఓ పాప అంది. అయిదేళ్లుంటాయేమో, బొద్దుగా ముద్దుగా ఉంది.
“చందూ ఎవరు?” అడిగాను.
“నాన్న...!’’ నలిగిన బట్టలు, పెరిగిన గెడ్డం. నా ఎదురుగా కిటికీ దగ్గర దిగులుగా కూర్చున్న అతన్ని చూపించింది. ఇంతలో “అని...అని... తొరగా విసురు.!” ఎదురు సీట్లో ఉన్న పిల్లాడు అరిచాడు. ఇంచుమించు ఆ అమ్మాయి వయసే ఉంటుందేమో! ఇద్దరికీ దగ్గర పోలికలున్నాయి. ఆ పాప చేతిలో పేపర్ని ఉండలా చుట్టిన బాల్.
“నీ పేరు అనా!” అడిగాను.
“కాదు అస్విని. వాడు తమ్ముడు బరని. ఇద్దరం ఒకసారే పుత్తాం. కానీ, నేనే ముందు.” నేనడగకుండానే చెప్పింది ముద్దు ముద్దుగా. అశ్విని, భరణి. మెరుస్తున్న నక్షత్రాల్లా చక్కని పిల్లలు. కానీ, వాళ్ళ నాన్నే ఏం పట్టనట్టు కిటికీలోంచి శూన్యంలోకి చూస్తున్నాడు. రైలు బయల్దేరి అరగంట అయింది. రైలెక్కిన దగ్గర్నుంచి అతన్నీ, పిల్లల్నీ గమనిస్తున్నా. ఆ పిల్లలిద్దరూ వాళ్ళ ఆటలేవో వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ, ఆ తండ్రిని అదే చందూని చూస్తూంటే ఆ పిల్లలపై ధ్యాసే లేనట్టు నిర్లిప్తంగా ఎందుకున్నాడో నాకర్థం కావడంలేదు.
“చెందూ ఆకలేత్తోంది” అని పిల్లలు అడిగిన వెంటనే, బ్యాగ్ లోంచి రెండు పొట్లాలు తీసి ఇచ్చి, మళ్ళీ తన పనిలో మునిగిపోయాడు. రాత్రి ప్రయాణం. టైం పది దాటింది. త్వరగా పడుకునేవాళ్ళు ఆ ప్రయత్నంలో బెర్తులపై వాలుతున్నారు. నేను పుస్తకం చదువుదామని విశ్వప్రయత్నం చేస్తున్నా. ఆ పిల్లలిద్దరు అతని ప్రమేయం లేకుండానే బుద్ధిగా తినేసి, బొమ్మల పుస్తకం ఏదో చూస్తున్నారు. అతను మాత్రం తన గవాక్ష వీక్షణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. రైలు బయల్దేరిన దగ్గర్నుంచి ఒకే విషయం బుర్రలో కదులుతూ విసుగ్గా అనిపిస్తోంది.
“సార్! ఈ బెర్త్ నాది మీరు లేస్తే నేను పడుకుంటా” ఎవరో అడిగేసరికి ఇప్పటివరకు ఆ కింది బెర్తు నాదనుకుంటున్న నేను లేవక తప్పలేదు. జేబులోంచి టిక్కెట్ తీసి చూసా. అతను కూర్చున్న సీట్ నాది. ఇంకా అతను తనదైన ప్రపంచంలోనే ఉన్నాడు. పిల్లలపై అతనికి ఏమాత్రం ధ్యాస లేదనుకుంటా. అసలు ఇలా పిల్లల్ని పట్టించుకోని మొగుడితో వాళ్ళను పంపిన ఆ ఇల్లాలిని అనుకోవాలి. పిల్లల్ని అలా వదిలేసిన అతని తీరుకి నేనాశ్చర్యపోయా. ఇక నేను రెస్ట్ తీసుకోవాలి. వెంటనే,
“చూడండి...” అతనిని ఉద్దేశించి అన్నాను. నావైపు చూడనే లేదు. ఓసారి అతని భుజంపై తట్టి, “మీరు సీట్ ఖాళీచేస్తే నేను పడుకోవాలి.” కొంచెం విసుగ్గా అన్నా. మెల్లగా లేచి మధ్య బెర్తు వేసి పిల్లలిద్దరిని పడుకోమన్నాడు. వాళ్ళ కబుర్లు కింద సీటు నుంచి మధ్య సీటుకి మారాయి. అంతేకాని వాళ్ళు పడుకోలేదు. లైటార్పి కళ్ళు మూసుకున్నా. కిటికీ నుంచి బోగీ తలుపు దగ్గరకు మారింది అతని వీక్షణా ప్రదేశం.
“నాన్నా! అదిగో చందమామ...అదిగో వెన్నెల...ఎంత బాగుందో!” నా సీటు కిటికీలోంచి చూస్తూ అరిచింది అశ్విని. ఆ అరుపుకి నాకు నిద్రాభంగమైంది. ఆ పిల్లపై కోపమొచ్చింది. ఓసారి కళ్ళు తెరిచి నేను కూడా చూసా. కొంచెం కొంచెంగా వెన్నెల పరుచుకుంటోంది బయట. “అవును...చందమామ ఉంది...కానీ వెన్నెల...లేదు”, గొణుక్కుంటూ అతను పిల్లల్ని మధ్యబెర్త్ లో అటొకరిని, ఇటొకరిని పడుకోబెట్టాడు.
“చెందూ! రేపు వెన్నెలను చూపిస్తావా?”అడిగిన కూతురుతో, “అలాగేనమ్మా చూపిస్తా పడుకో.” కాసేపటికి ఇద్దరూ పడుకున్నారనుకుంటా నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా అతను మళ్ళీ బోగీ తలుపు దగ్గరకు చేరాడు. బహుశా అతని తీక్షణా వీక్షణ వెనుక ఏదో పెద్ద గాధ ఉండి ఉంటే నేనో కథ రాయడానికి పనికొస్తుందన్న ఆలోచనతో అతనితో మాట్లాడాలి అనిపించింది. లేచి అతని వైపు కదిలాను. అతను అలాగే బయటకు చూస్తున్నాడు. మెల్లగా అతని పక్కకు చేరి, “మీ పిల్లలు బుద్ధిమంతులే. అసలు అల్లరి చేయటమే లేదు అంతమాత్రాన వారినలా వదిలేసి మీరు అలా శూన్యంలో చూస్తూ కూర్చోటం భావ్యమేనా? తండ్రిగా వారిని చూసుకోవల్సిన బాధ్యత మీకున్నట్టుగా నాకనిపించటం లేదు?” అన్నా.
నా మాటలకు ఉలిక్కిపడి నాకేసి అదోలా చూసాడు అతను. కాసేపు అలాగే బయటకు చూసి, “అవును. వాళ్లను చూసుకోవాలి. బాగా చూసుకోవాలి. చూసుకుంటానని మాటిచ్చాను. కానీ, నాతో పాటే మాటిచ్చిన మనిషి ఇప్పుడా మాటే మర్చిపోయి మాయమైంది. మా బంధాన్ని, ఆ పిల్లల పట్ల తన అనురాగాన్ని తెంచుకుని దూరమైపోయింది. నా గుండెల్లో బాధను ఎవరికీ చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోతున్నా” అని చెప్తున్న అతని గొంతు గద్గదమైంది. దుఃఖం కమ్ముకొచ్చి గుమ్మం దగ్గర కూలబడిపోయాడు. నేను దిగ్భ్రాంతికి గురయ్యి మౌనాన్ని ఆశ్రయించా. అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఇక మౌనంగా ఉండటం నాకు సాధ్యం కాలేదు. అతని భుజంపై మృదువుగా తడుతూ, సౌమ్యంగా అనునయించడానికి ప్రయత్నించా.
అప్పుడు నన్ను అడిగాడు చందు దుఃఖాన్ని దిగమింగి, “ఒక కుటుంబంలో ... ఆనందంగా జీవిస్తున్న ఒక కుటుంబంలో ఆ ఆనందం ఆవిరై పోవడానికి, వారి ఆశల రెక్కలు విరిగిపోవడానికి కారణమేమిటో చెప్పగలరా ...?”
“ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానాలు ఎన్నయినా చెప్పొచ్చు.”
“ఇది ఊహల్లో ఉద్భవించింది కాదు. నా కుటుంబంలో సంభవించింది. దీనికి సమాధానం మీరు ఊహించక్కర్లేదు... నేనే చెప్తాను. ‘నిర్లక్ష్యం’... అవును కేవలం నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి హేతువు ఒక వ్యక్తి కావచ్చు లేక ఓ వ్యవస్థ కావొచ్చు. కానీ, దానికి మూల్యం చెల్లించేది...???”
“మీకు చందమామన్నా, పిల్లలన్నా ఇష్టమా?” అడిగాను. నా ప్రశ్న అసందర్భంగా అనిపించింది కాబోలు, నాకేసి బాధగా చూసి, “చందమామ కాదు, వెన్నెల...వెన్నెలన్నా, పిల్లలన్నా ఎంతో ఇష్టం. అయినా వెన్నెల ఎప్పుడూ చందమామను అంటిపెట్టుకుని ఉండాలిగా. మరి వెన్నెల అలా ఎందుకు చేసింది?”
అతని ప్రశ్నకు నా సమాధానంగా ఒక వెర్రి నవ్వు నవ్వి, “వెన్నెలా...! వెన్నెల ఎవరూ?” ఆసక్తిగా అడిగా.
“నేనెవరో మీకు తెలియదు. కానీ మీరెవరో నాకు తెలుసు. మీరు పేరున్న ఓ గొప్ప రచయిత కదూ! మీరెన్నో కథలు, నవలలు రాసారు. బహుమతులు గెల్చుకున్నారు. మీకు వెన్నెల ఎవరో తెలుసుకోవాలి అనిపిస్తోంది కదూ! నేను వెన్నెల గురించి చెప్తా. మీరు కథ రాస్తారు. ఏదో పత్రికకు పంపుతారు. బహుమతి రావచ్చు, ప్రశంసలు రావచ్చు. కానీ, మా కుటుంబంలో ఆనందం మళ్ళీ చిగురిస్తుందా? తప్పొకరిది...శిక్ష మరొకరికా? నిర్లక్ష్యానికి శిక్ష పడుతుందా?”
అతని ప్రశ్నకు సమాధానం అంత సులభంగా దొరుకుతుందా? నన్ను సందేహంలో పడేసాడు. గుమ్మం దగ్గర అతని పక్కనే చతికలపడ్డా వెన్నెల గురించి తెలుసుకోవాలని. రైలు వేగంగా పోతోంది. పొంగుతున్న దుఃఖాన్ని అదిమిపెట్టి బయట గాఢంగా కురుస్తున్న వెన్నెలను మౌనంగా చూస్తున్నాడు. కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ “నా వెన్నెల ఆ చందమామ కన్నా అందంగా ఉండేది...” ఆకాశం కేసి చూపిస్తూ మెల్లగా మాట్లాడుతున్నాడు.
* * *
“ఒక్కేసి పువ్వేసి చందమామ...ఒక్క జాము ఆయే చందమామ.”
రంగారెడ్డి జిల్లాలో అదొక చిన్న ఊరు. అక్కడో గుడి. దసరా పండుగ రోజులు. మునిమాపువేళ చీకటి తెరలు తెరలుగా పరుచుకుంటోంది. ఆ గుడి దగ్గర విశాలమైన ప్రదేశం. అప్పుడే వికసించిన వెన్నెల దాని చుట్టూ పందిరిలా అల్లుకుంది. ఊళ్ళోని ఆడవాళ్లంతా అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మలతో అక్కడ చేరి పాడుతూ ఆడుతున్నారు. గౌరమ్మను కొలుస్తున్నారు. రంగు రంగు చీరలు కట్టుకున్న స్త్రీలు, రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో ఆ ప్రాంతం ఒక ఉద్యానవనంలా ఉంది.
“వెన్నెలా...వెన్నెలా! త్వరగా రావే...” దూరంగా వస్తున్న అమ్మాయిని ఎవరో ఒకావిడ పిలుస్తోంది.
“ఆ వస్తున్నా... వచ్చేసానత్తా...!” అంటూ అందంగా అలంకరించిన బతుకమ్మతో, చందమామ నుంచి ఎకాఎకి భూమికి జారిపడ్డ వెన్నెలే సాక్షాత్తు అమ్మాయిగా రూపు దాల్చినట్టుగా, ఓ వనదేవత పాలరాతి బొమ్మలా మారి మెరుస్తున్నట్టుగా కళ్ళముందు ప్రత్యక్షమైంది. ఎంత అందంగా ఉందో ఈ ‘వెన్నెల’...! ఇంత అందాన్ని మొట్ట మొదటసారి నా ముందుంచిన ఆ దేవుడుకి కృతజ్ఞతాపూర్వక వందనాలర్పించా.
‘వందనాలు..వందనాలు..వలపుల హరిచందనాలు’ కన్నార్పకుండా ఆమెను అలా చూస్తూనే ఉన్నా. ఆ వెన్నెల వెలుగులలో వలపుల జలకాలాడా. స్నేహితుడు దామోదర్ ఆహ్వానంపై ఆ ఊరొచ్చిన నేను నా ఊసులను, ఊహలను ఆ సుందరితో పంచుకోవాలని ఉవ్విళ్ళూరా. నా జీవితంలో వెన్నెల కురిపించమని అడగాలని అనుకున్నా. నా ప్రేమను మనసులోనే దాచుకోకుండా దామోదర్‌కి చెప్పా. నన్ను, వెన్నెలను ఒక్కటిగా చేయమని వేడుకున్నా. దామోదర్ ఒక కెమికల్ ప్లాంట్‌లో నా సహాధ్యాయి. దామోదర్, రేణుకా దంపతులు నన్నో ఆత్మబంధువుగా ఆదరించారు.
“చందూ! వెన్నెల మా బాబాయి కూతురు. ఆమె చిన్నప్పుడే మా బాబాయి, పిన్ని చనిపోయారు. ఆమెను మేనత్త సాకుతోంది. వాళ్లకు ఆస్తిపాస్తులేం లేవు. కానీ, వెన్నెల మనసు మాత్రం బంగారం” అని చెప్పాడు దామోదర్.
“నా గురించి నీకు తెలియంది ఏముందిరా. ఆ బంగారాన్ని పదిలంగా చూసుకుంటా. పెద్దమనసుతో నువ్వు మా పెళ్లి జరిగేలా చెయ్యరా!” ప్రాధేయపడ్డా. పెద్దలు ఒప్పుకున్నారు. నేనూ, వెన్నెలా ఒక్కటయ్యాం. ‘వెన్నెలకై వేచి వేచి వెచ్చబడ్డ చందమామని’ చల్లని తీగలా అల్లుకుపోయింది. మా సంసారం ఆనందంగా సాగుతోంది.
‘నిర్లక్ష్యం...!’ జీవితాలతో ఆడుకున్న ఆట పెను మార్పులకు నాంది పలికింది. బాయిలర్ టెంపరేచర్ కంట్రోల్ చెయ్యాల్సిన వ్యక్తి ‘నిర్లక్ష్యం’ కారణంగా బాయిలర్ పేలి దామోదర్ చనిపోయాడు. అతని హటాత్ మరణాన్ని తట్టుకోలేక గర్భవతి రేణుక కవలపిల్లల్ని ప్రసవించి చనిపోయింది. తప్పెవరిది...? శిక్ష ఎవరికి? దామోదర్ కుటుంబానికి, రెండు పసి హృదయాలకి. అత్యంత దురదృష్టకరమైన ఆ సమయంలో వెన్నెల తీసుకున్న నిర్ణయం నన్ను విస్మయుడ్ని చేసింది. తనకు పిల్లలు వద్దనుకుంది. నాకు దూరంగా జరిగింది. దామోదర్ రేణుకల పిల్లలకు అమ్మగా దగ్గరైంది. తాత్కాలికంగా దూరమైన ఆనంద క్షణాలు శాశ్వతంగా మాలో ఉండేలా చేసింది ఆ నిర్ణయం. అలా ఇద్దరుగా ఉన్న మేము నలుగురయ్యాం. అశ్విని, భరణిలు మాకొక కొత్త జీవితాన్ని ఇచ్చారు. అలా అయిదేళ్ళు గడిచిపోయాయి.
“రాత్రి మా అత్తమ్మ కల్లోకి వచ్చింది. నన్ను ఓసారి చూడాలనంది. నేను వెళ్ళనా?” ఒకరోజు అడిగింది వెన్నెల.
“మరి పిల్లలు? నీతోబాటు వస్తే వాళ్ళకు స్కూల్ పోతుందిగా?”
“వాళ్ళిద్దరికీ నీ దగ్గర బాగానే అలవాటుగా. రెండురోజులుండి వచ్చేస్తా” అంటే కాదనలేకపోయా. ఆనందంగా వెళ్ళింది.
అదే నాకు ఆమె ఆఖరి చూపవుతుందని కలలో కూడా అనుకోలేదు. రోజూ ఫోను చేసి మాట్లాడేది. ఓ రోజు “చందూ! మనకిక పిల్లలు వద్దనుకున్నాం కదా! ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ క్యాంప్ నడుస్తోంది. నేనక్కడ ఆపరేషన్ చేయించేసుకుంటా. ఏమంటావు?”
“అక్కడెందుకు వెన్నెలా! మన ప్లాంట్ ఆసుపత్రిలో అయితే బాగుంటుంది. పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు.”
“ఇక్కడయితే అత్తమ్మ ఉంటుంది. నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. నీకే ఇబ్బంది ఉండకూడదనే నేనిక్కడ చేయించుకుందాం అనుకుంటున్నా. ఒక్క వారం రోజులు పిల్లల్ని చూసుకో చాలు. వారం తర్వాత వచ్చేస్తా” అన్న ఆమె మాటలే ఆఖరి మాటలవుతాయని ఊహించలేదు. ‘‘శరాఘాతంలాంటి ఆమె మరణవార్త విని ఎలా బతికున్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ అదే ‘నిర్లక్ష్యం’...! ఈసారి నా కుటుంబంలోని ఆనంద క్షణాల్ని హరించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న కొంతమంది ఇన్ఫెక్షన్కి గురై ప్రాణాలు కోల్పోయారు. అన్న పిల్లలకోసం పిల్లల్ని కనొద్దనుకున్న నా వెన్నెలను ఆ ఆపరేషన్ మింగేసింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది ‘నిర్లక్ష్యానికి’ వెన్నెలను కోల్పోయి నేను అమావాస నిశీధిలా మిగిలా.
రేపు వెన్నెలను చూపిస్తావా?’ అనడిగిన నా కూతురికి ఇకపై మీ ‘ప్రియమైన’ అమ్మని చూడలేరని ఎలా చెప్పాలో తెలియక గుండెను మెలిపెడుతున్న బాధను అక్కడే కప్పెట్టి ఇక్కడ కూర్చుని ఆకాశంలో నా వెన్నెల కోసం వెదుక్కుంటున్నా, ఇప్పుడిప్పుడే జీవితపు వెలుగులను సంతరించుకుంటున్న దిక్కులేని ఆ చుక్కలకు ముఖం చూపించలేక దూరంగా తచ్చాడుతున్నా” అని చెప్పి బావురుమన్నాడు.
నిర్ఘాంతపోయాను. వాళ్ళు వెన్నెల కన్నపిల్లలు కారా? వాళ్ళ అన్న పిల్లలా? అమాయకంగా అని అడిగా. నిద్రపోతున్న ఆ నక్షత్రాలను చూస్తుంటే గుండెల్లో బరువు. అది బాధో మరేదో తెలియడం లేదు. కానీ, ఆ వెన్నెలమ్మ మమకారపు చల్లదనం నా గుండెను తడిమి అనిర్వచనీయమైన అనుభూతి నిచ్చింది. ఆమె త్యాగనిరతికి కొలమానం లేదనిపించింది. వెన్నెల లేక మసక బారిన ఈ చందురుడు, వెన్నెలమ్మ ఒడికి, అనురాగపు తడికి దూరమై కళను కోల్పోతున్న ఆ నక్షత్రాలకు తిరిగి వెలుగుల నివ్వగలడా? నా మస్తిష్కం నిండా ప్రశ్నలు. బయటకు చూసా. ఆకాశం మేఘావృతమైంది. చీకటి చెరను చీల్చుకొస్తున్న సూర్యుడుని నల్లమబ్బులు అడ్డుకుంటున్నాయి. ఇక చందమామకు వెలుగెక్కడ?
గమ్యం చేరిన రైలు ఒక్క కుదుపుతో ఆగింది. ఓ పెద్ద కుదుపుతో జీవితగమనాన్ని కోల్పోయిన అతడు రోదిస్తూనే ఉన్నాడు. విధి నిర్వహణలో ‘నిర్లక్ష్యం’ మరొకరి విధిని ఘోరంగా మారుస్తుందన్న నిజాన్ని పాలకులు, అధికార్లు ఎప్పుడు గ్రహిస్తారోనన్న ప్రశ్న నన్ను కుదిపేస్తుంటే అశక్తుడిలా రైలు దిగి బోగీలోకి చూసా... లోపల మసక చీకటిలో వెన్నెల లేని చంద్రుడు, వెలవెల బోతున్న రెండు నక్షత్రాలు...!!!
నిర్లక్ష్యానికి బలైన నిర్భాగ్యులకు న్యాయం జరుగుతుందా? నా ప్రశ్నలకు సమాధానాలు నా కలం నుంచే రావాలి. పరిష్కారాలు లేని ఎన్నో సామాజిక సమస్యలను నా కథలలో గుప్పించి, పురస్కారాలను పొందిన నేను, ఈ నిర్లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుని కథ రాయాలనే నిశ్చయంతో కదిలా. దోషులెప్పుడూ తప్పించుకోలేరు. నిర్లక్ష్యానికి శిక్ష పడాల్సిందే.
- మోచర్ల అనంత పద్మనాభరావు
ఫోన్ : 98486 07127