- నలుగురు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలకు చెందిన వారే
- కిందటేడాది ఐపీఓలకు ఫుల్ డిమాండ్..భారీగా పెరిగిన షేర్లు
- ఈ ఏడాదీ లైన్‌లో పెద్ద పెద్ద కంపెనీలు
న్యూఢిల్లీ : కిందటేడాది ఐపీఓ మార్కెట్ దూసుకుపోవడంతో ఏడుగురు ఫౌండర్ల సంపద వేల కోట్ల రూపాయిలు పెరిగింది. వీరు బిలియన్ డాలర్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడుగురిలో నలుగురు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వచ్చిన ప్రీమియర్ ఎనర్జీస్‌కు ఇన్వెస్టర్లు నుంచి ఫుల్ డిమాండ్ కనిపించింది.
ఫలితంగా కంపెనీ ఫౌండర్ చిరంజీవ్ సింగ్ సలూజా (51), ఆయన ఫ్యామిలీ సంపద 4.7 బిలియన్ డాలర్ల (రూ.రూ.40 వేల కోట్ల) కు ఎగిసింది. ఇండియాలో అదానీ గ్రూప్ తర్వాత అతిపెద్ద సోలార్ మాడ్యుల్స్ తయారీ కంపెనీగా ఎదిగింది. ప్రభుత్వం సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రీమియర్ ఎనర్జీస్‌పై ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా ఉన్నారు. ఈ కంపెనీ షేర్లు కిందటేడాది సెప్టెంబర్‌లో లిస్టింగ్ కాగా, షేర్ల ధరలు అక్కడి నుంచి మూడు రెట్లకు పైగా పెరిగాయి. కంపెనీ వాల్యుయేషన్ 7 బిలియన్ డాలర్లను టచ్ చేసింది.
మరో ఎనర్జీ కంపెనీ వారీ గ్రూప్ ఫౌండర్ హిటెక్ సీ దోషి కూడా ఐపీఓకి వచ్చి బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఆయనతో పాటు ఈవీల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఫౌండర్ భవిష్ అగర్వాల్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థ ఆక్మే సోలార్ హోల్డింగ్స్ ఫౌండర్ మనోజ్ కే ఉపాధ్యాయ కూడా ఐపీఓ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు. వీరితో పాటు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఫౌండర్ సతీష్ ఆర్ మెహతా, జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ ఫౌండర్ పరాక్రమ సిన్హ్ జడేజా, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ ఫౌండర్ కిషోర్ చాబ్రియా అండ్ ఫ్యామిలీ సంపద కూడా వారి కంపెనీలు ఐపీఓకి వచ్చాక బాగా పెరిగాయి.
ఐపీఓల్లో ఎన్‌ఎస్‌ఈ రికార్డ్..
ఆసియాలోనే ఎక్కువ ఐపీఓలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ద్వారా 2024 లో అందుబాటులోకి వచ్చాయి. గ్లోబల్‌గా 1,145 ఐపీఓలు ఇన్వెస్టర్ల ముందుకు రాగా, వీటిలో 268 ఐపీఓలు ఎన్‌ఎస్‌ఈలో ఓపెన్ అయ్యాయి. ఇందులో 90 మెయిన్ బోర్డ్, 178 ఎస్‌ఎంఈ ఐపీఓలు ఉన్నాయి. ఇవి రూ.1.67 లక్షల కోట్లను సేకరించాయి. దీనిని బట్టి ఇండియా క్యాపిటల్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందని తెలుస్తోంది.
లైన్‌లో మరిన్ని కంపెనీలు..
ఈ ఏడాది కూడా ఐపీఓల జోరు కొనసాగనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ఇన్వెస్టర్ల ముందుకొచ్చి రూ.40 వేల కోట్లు సేకరించాలని చూస్తోంది. అదే జరిగితే ఇండియా ఐపీఓ హిస్టరీలోనే అతిపెద్ద ఇష్యూగా ఇది నిలుస్తుంది. రిలయన్స్ రిటైల్ కూడా ఐపీఓకి రావొచ్చు. వీటితో పాటు నెక్సస్ వెంచర్స్‌కు వాటాలున్న జెప్టో, వాల్‌మార్ట్‌కు వాటాలున్న ఫ్లిప్‌కార్ట్ ఇండియా, ప్రొసస్‌కి చెందిన పేయూ, ఎక్స్‌వీ పార్టనర్స్‌కు వాటాలున్న పైన్ ల్యాబ్స్ ఈ ఏడాది ఐపీఓకి రావాలని ప్లాన్ చేస్తున్నాయి. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, హెక్జావేర్ టెక్నాలజీస్, స్క్లోస్ బెంగళూరు, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ ఐపీఓకి వస్తామని ఇప్పటికే ప్రకటించాయి.
ఐపీఓ ద్వారా బిలియనీర్లయిన వారు వీరే..
కంపెనీ మార్కెట్ వాల్యూ ఫౌండర్ సంపద
(బిలియన్ డాలర్లు) (బిలియన్ డాలర్లు)
వారీ ఎనర్జీస్ 10.6 హిటెక్ సీ దోషి, ఫ్యామిలీ 7.1
ప్రీమియర్ ఎనర్జీస్ 7.3 చిరంజీవ్ సింగ్, ఫ్యామిలీ 4.7
ఓలా ఎలక్ట్రిక్ 5.0 భవిష్ అగర్వాల్ 2.8
ఎంక్యూర్ ఫార్మా 3.1 సతీష్ ఆర్ మెహతా 2.3
ఆక్మే సోలార్ హోల్డింగ్స్ 1.9 మనోజ్ కుమార్, ఫ్యామిలీ 1.6
జ్యోతి సీఎన్‌సీ 3.5 పరాక్రమసిన్హ్ జడేజా 1.6
అలైడ్ బ్లెండర్స్ 1.3 కిషోర్ చాబ్రియా, ఫ్యామిలీ 1.0