ఫిలాసఫీ : జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవటం కాదు.. ప్రతిక్షణం విలువైనదే..!

జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. "నాకు ఇంతే రాసి పెట్టి ఉంది. నా కర్మ ఇంతే' అని నిందించుకోవడం కాదు. జీవితం అంటే... నేర్చుకోవడం.జీవితం విలువ తెలియాలంటే, మీరు ఈ కథ వినాలి... తన ఉపన్యాసాలతో యువకులను నాశనం చేస్తున్నారని సోక్రటీస్కు మరణ శిక్ష ఊదించారు. ఆయనంటే అందరికీ గౌరవం.., పేరుకు మాత్రమే జైల్లో పెట్టారు కానీ, అందరూ వచ్చి ఆయన్ను చూసి పోతున్నారు, అతని శిష్యులైతే అక్కడే ఉండి ఏడుస్తున్నారు.

కానీ, ఆయన మాత్రం ఇదేం పట్టనట్టు నవ్వుతూ... వచ్చినోళ్లతో మాములుగా మాట్లాడుతూ ఉన్నారు. 'అరె.. ఈయనకు చావు అంటే భయం లేదా?' అని అక్కడున్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. మరణశిక్ష అమలు కావడానికి ఇంకా రెండు గంటల సమయం మాత్రమే ఉంది. మరణశిక్షలో భాగంగా విషం ఇస్తే  దాన్ని తాగి ఆయన చనిపోవాలి... అప్పుడు ఆయన అభిమానుల గుండెలు వేగంగా కొట్టుకోవటం మొదలు పెట్టాయి. కానీ, అది ఆయనకు సంబంధించిన విషయమే కాదన్నట్టు ఉన్నాడు సోక్రటీస్.

అందరి ముఖాల్లో దిగులు, ఆందోళన కనిపిస్తోంటే, ఆయన మొఖం మాత్రం ఆనందంతో వెలుగిపోతోంది. ఆయన కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక బిచ్చగాడు కూర్చొని సితార్ వాయిస్తూ పాట పాడుతున్నాడు. ఆ పాట సోక్రటీస్ మనసుని తాకింది... పరవశంతో కళ్లు మూసుకున్నడు, ఎప్పుడూ సంతోషంగా ఉండే అతన్ని ఆ బిచ్చగాడి పాట మరింత సంతోష పరిచింది. సోక్రటీస్ మెల్లగా కళ్లు తెరిచి జైలర్ని పిలవగా,.. అతను 'ఏం కావాలి' అని అడిగాడు. 'అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడ్ని తీసుకొస్తారా?" అని అడిగాడు. 'దానిదేముంది?" అని జైలర్ వెళ్లి బిచ్చగాడ్ని తీసుకొచ్చాడు.

Also Read:తినటానికేనా : ఈ బర్గర్ ధర రూ.4.50 లక్షలు.. ఏం బంగారంతో చేశారా ఏంటీ..!

తనకు పాట నేర్పమని బిచ్చగాడ్ని అడిగాడు సోక్రటీస్. బిచ్చగాడు పాట పడుతుంటే, సోక్రటీస్ సితార్ వాయించాడు. అరగంటలోనే ఆ పాట నేర్చుకొని బిచ్చగాడి సాయం లేకుండనే సితార్ వాయిస్తూ పాట పాడాడు సోక్రటీస్. మరణ శిక్షకు ఇంక గంటే టైం ఉంది. కానీ, సోక్రటీస్ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 'అయ్యా! ఇంక గంటలో మీకు విషమిస్తారు... అది తాగి ఈ లోకాన్ని వదిలిపోతారు తెలుసా?' అని శిష్యులు అడుగగా... అప్పుడు సోక్రటీస్ నవ్వి 'జీవితమంటే నేర్పుకోవడం. చావు గురించి ఆలోచించడం కాదు. నేను, నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం. కానీ, జీవించిన ప్రతిక్షణం విలువైందేనని, ఎప్పటికప్పుడు తెలియనిది తెల్సుకోవడంలోనే ఆనందం ఉందని అన్నాడు. గంట కింద నాకా పాట తెలియదు.. ఇప్పుడు నేర్చుకున్నా.. ఇంకా నా జీవితంలో గంట టైం ఉంది. అంటే ఇప్పటికీ నాకు నేర్చుకోవడానికి టైముందని అన్నడు.ఇక శిష్యులు నోటివెంట మాట రాలేదు.