అటల్​ జీ… అన్నింటా విజయుడే!

(ఇవాళ భారతరత్న వాజపేయి మొదటి వర్ధంతి)

అటల్​ బిహారీ వాజ్​పేయి… దేశానికి ప్రధానిగా చేశారని, బీజేపీని గొప్పగా నడిపించారని మాత్రమే చెప్పి ఊరుకుంటే సరిపోదు. సాహితీ లోకాన్ని ఒక ఊపు ఊపారని, మైకు అందుకుంటే చాలు మాటలతో కట్టి పడేసేవారని, దేశ భక్తిని అణువణువునా నింపుకున్నారని చెప్పకపోతే ఆయన గురించి పూర్తిగా చెప్పనట్టే.  వ్యవహారాలు నడపడంలో మితవాదే కానీ పాలసీల తయారీలో వాజ్​పేయ్​అతివాది.

వాజ్​పేయి తన సామాజిక, రాజకీయ జీవితాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆరెస్సెస్​) ప్రచారక్​గా ప్రారంభించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియా చరిత్రలో అనేక కీలక మలుపులను, ఎత్తుపల్లాలను చూశారు.  ఆయన  తొలి తరం భారతీయ జన సంఘ్ (బీజేఎస్​) కార్యకర్త. పార్టీ ఫౌండర్​ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి పర్సనల్​ సెక్రెటరీ. ఆరెస్సెస్​​ వ్యవస్థాపకుడు డాక్టర్​ హెడ్గేవార్​తోపాటు ప్రెసిడెంట్​ పండిట్ దీన్​దయాళ్ ఉపాధ్యాయ తదితరులకు తలలో నాలుకలా వ్యవహరించారు. గురూజీ గోల్వాల్కర్​ గైడెన్స్​లో; బైరాన్ సింగ్​ షెకావత్, ఎల్.​కె.అద్వానీ వంటివారి సాహచర్యంలో రాజకీయ జీవితం సాగించారు.

బీజేఎస్​ మొదటి దశలో పార్లమెంటేరియన్​గా ముందుచూపుతో, బ్రాడ్​ మైండ్​ కలిగిన జాతీయ నాయకుడిగా అనుభవం సంపాదించారు. రెండో దశలో జనతా పార్టీలో బీజేఎస్​ని విలీనం చేసి,  పొలిటికల్​ పవర్​, సుపరి పాలన ద్వారా ప్రజలతో మమేకం కావాల్సిన అవసరాన్ని పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు ఆచరించి చూపారు. మూడో దశలో.. బీజేపీని స్థాపించి దేశం మొత్తం విస్తరింపజేశారు. తన లీడర్​షిప్​లోనే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. సంకీర్ణ శకంలోనూ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నాయకత్వ సామర్థ్యం ఆయన సొంతం. మితవాదిగా, అజాత శత్రువుగా  ప్రశంసలూ పొందారు.

వాజ్​పేయి ప్రతిపక్ష నేతగా, ప్రభుత్వ అధినేతగా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నాయకత్వ లక్షణాలతో బీజేపీకి విశ్వసనీయత పెంచారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోకి, అన్ని వర్గాల్లోకి బీజేపీ గుర్తు కమలాన్ని తీసుకెళ్లారు. ఆయన చూపిన రాజ ధర్మం, సంకీర్ణ ధర్మం, దేశభక్తి, కమిట్​మెంట్​​ ప్రజలను ఆకట్టుకున్నాయి.

అవినీతిలేని పాలనకు అడ్రస్​

కేవలం ఉత్తరాది (హిందీ రాష్ట్రాల) పార్టీగానే పేరున్న బీజేపీ ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్ వంటి చోట్ల కూడా పవర్​లోకి రాగలిగేలా ఎదగటంలో వాజ్​పేయి కీలక పాత్ర పోషించారు. ‘మిసైల్​ మ్యాన్’​ అబ్దుల్​ కలాంను రాష్ట్రపతి​ని చేసి  సగటు భారతీయుడి అభిమానం సొంతం చేసుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో అవినీతికి ఛాన్స్​ లేని, సుపరిపాలనా కాలం వాజ్​పేయి హయాందేనంటే అతిశయోక్తి కాదు. వాజ్​పేయి 2005 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

తన తర్వాత కూడా బీజేపీని మరింత బలోపేతం చేయటానికి, దేశానికి సేవలందించటానికి కొత్త తరాన్ని, కొత్త నాయకత్వాన్ని అందించారు. నరేంద్ర మోడీకి గుజరాత్ ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. అదే ఈ రోజు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్​డీఏ వరుసగా రెండోసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటానికి బాటలు వేసిందని చెప్పొచ్చు. వాజ్​పేయి బ్రహ్మచారిగా ఉండి తన జీవితం మొత్తాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. విద్యార్థి దశలో, యవ్వనంలో ఆరెస్సెస్​ వేసిన పునాదులపై ఆయన విశ్వనాయకుడిగా ఎదిగారు. ‑  కొట్టె మురళీకృష్ణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ

నెరవేరిన వాజ్​పేయి కల

వాజ్​పేయి మొదటి వర్ధంతి లోపే లోక్​సభలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో మరోసారి అధికారం చేజిక్కించుకుంది. జమ్మూకాశ్మీర్​కు అటానమీ కల్పిస్తున్న ఆర్టికల్​–370ని రద్దు చేసింది. అటల్​జీ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. తన అస్థికలు సైతం ‘భారత్ మాతాకీ జై..’ అంటాయన్న ఆయన కవితా గానాన్ని నిరంతరం మననం చేసుకోవాలి.

ప్రసంగాలకు పెట్టింది పేరు

మోరార్జీ దేశాయ్​ (జనతా పార్టీ) ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో ఇండియా వాయిస్​ని అద్భుతంగా వినిపించారు. అనంతరం అపొజిషన్​ లీడర్​గా ఆయన మాట్లాడిన తీరును నాటి ప్రధాని పి.వి.నరసింహారావు పలు సందర్భాల్లో అభినందించేవారు. వాజ్​పేయి టాకింగ్​ పవర్​ తెలిసిన పీవీ… జెనీవా మానవ హక్కుల సదస్సుకు ప్రభుత్వ ప్రతినిధిగా వాజ్​పేయినే పంపారు. పోఖ్రాన్​ అణు పరీక్ష, లోక్​సభలో విశ్వాస పరీక్ష, కార్గిల్ వార్​లో విజయం తర్వాత వాజ్​పేయి చేసిన ప్రసంగాలు ప్రజలకు చిరకాలం గుర్తుంటాయి.

వాజ్​పేయి విజయాలు

సంకీర్ణ శకంలో చెరగన ముద్ర వేసిన ప్రధాని వాజ్​పేయి. ఆయన మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1996లో మొదటిసారి,  1998లో రెండోసారి, 1999లో మూడోసారి ప్రభుతాన్ని ఏర్పాటు చేశారు. 1998లో అధికారానికి వచ్చిన తొలినాళ్లలోనే పోఖ్రాన్ ఎడారి (రాజస్థాన్​)లో ఐదు అణు పరీక్షలతో ప్రపంచానికి ఇండియా అంటే ఏమిటో చూపించారు వాజ్​పేయి. పాకిస్థాన్‌‌‌‌తో శాంతి ప్రయత్నాల్లో భాగంగా లాహోర్‌‌‌‌కి బస్సు యాత్రను తలపెట్టారు. కేవలం ఆయన చొరవ వల్లనే ఢిల్లీ నుంచి లాహోర్‌‌‌‌కి రెగ్యులర్​ బస్సు సర్వీస్ మొదలైంది. రూరల్​ ఎకానమీని మెరుగుపరచాలన్న దీర్ఘకాల సంకల్పంతో మారుమూల పల్లెలకు  ‘ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన’ మొదలెట్టారు. గ్రామీణ ప్రాంతాలను నేషనల్‌‌‌‌ హైవేకి లింక్ చేశారు.

హైవేల లింక్​ సూపర్​ హిట్

ఓ 20 ఏళ్ల క్రితం వరకు నేషనల్​ హైవేలన్నీ ఇరుకుగా, సరైన మెయింటెనెన్స్​ లేకుండా గతుకులతో నిండి ఉండేవి. రోజుల తరబడి సరుకుల రవాణా సాగేది.  వాణిజ్యాభివృద్ధి నత్తనడకతో ఉండేది. దేశాన్ని తూర్పు–పశ్చిమానికి, ఉత్తర–దక్షిణాలను కలపడానికి వాజ్​పేయి ప్లాన్‌‌‌‌ చేశారు.  ‘స్వర్ణ చతుర్భుజి’, ‘పీఎం సడక్​ యోజన’ ఆయన బ్రెయిన్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ పథకాలు.

1998లో తన ఆర్థిక మంత్రి యశ్వంత్‌‌‌‌ సిన్హాతో స్వర్ణ చతుర్భుజిపై పాయింట్​ టు పాయింట్​ చర్చించారు. దేశంలోని కార్పొరేట్​ సెక్టార్​ యజమానులకు, వ్యాపార వర్గాలకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత  ఛాంబర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కామర్స్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ (ఫిక్కీ)కి ‘స్వర్ణ చతుర్భుజి’ స్కీమ్​ని తెలియజేశారు. ‘ఈ ఏడాదిలోనే  ఆరంభం కానుంది. దేశవ్యాప్తంగా 20 వేర్వేరు ప్రాంతాల్లో ఈ పథకం అమలు కానుంది. మొత్తంగా 7,000 కి.మీ.ల దూరం దీని ఉద్దేశం’ అని వివరించారు. వాజ్‌‌‌‌పేయి హైవేల లింకేజి గురించి చెబుతుంటే… ఎలా సాధ్యమని అందరూ నవ్వుకున్నారు.

నాటి అనుభవాన్ని యశ్వంత్‌‌‌‌ సిన్హా పంచుకుంటూ… ‘ఇంత భారీ పథకానికి సొమ్ములు ఎక్కణ్ణుంచి పట్టుకొస్తారని మీడియా పదే పదే గుచ్చేది. అసలు ఈ పథకానికి పెట్టుబడిని మించిన పెద్ద అవరోధం భూ సేకరణ. రహదారుల విస్తరణ ఒక్కసారిగా ఎనిమిదింతలు అనేసరికి దేశం ఉలిక్కిపడింది. అప్పటికి కనీసం ఎదురుబొదురుగా వాహనాలు వెళ్లడానికి తగిన రోడ్లు ఎక్కడా లేవు. భారీ వెడల్పుతో చేపట్టిన స్వర్ణ చతుర్భుజి పథకంలో భూ సేకరణే కీలకమైంది. ఈ పథకంకోసం పెట్రోలు, డీజిల్‌‌‌‌ అమ్మకాలపై ఒక రూపాయి సెస్‌‌‌‌ విధించడంద్వారా 54,000 కోట్ల రూ.లను సమకూర్చగలిగాం’ అని తెలిపారు. ‘గతంలో ఏడెనిమిది గంటలపాటు సాగే రోడ్డు ప్రయాణం ఈ రోజున మూడు నాలుగు గంటల సమయానికి తగ్గిపోయింది.  ఈ ప్రాజెక్ట్‌‌‌‌తో నేషనల్ హైవే ల రూపురేఖలే మారిపోయాయి’ అన్నారు యశ్వంత్​ సిన్హా.  పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ప్రోత్సాహం కల్పిస్తూ దీనిని డిజైన్ చేశారు. ఈ కాన్సెప్ట్‌‌‌‌ని ప్రస్తుతం రైల్వేల్లోనూ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అమలైతే  మన రైళ్లు మరింత వేగంతో  పరుగులు తీస్తాయి. ప్రయాణ సమయం కూడా సగానికి సగం తగ్గుతుంది.