మెహబూబాను సల్లంగ చూడని కాశ్మీరం

మెహబూబాను సల్లంగ చూడని కాశ్మీరం

జమ్మూ కాశ్మీర్​లో 17వ లోక్‌‌‌‌సభ ఎన్నికలు ఆశ్చర్యకర ఫలితాలనిచ్చాయి. దాదాపు మూడున్నర ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ ( పీడీపీ) ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం విశేషం. అలాగే చాలా కాలం పాటు కాశ్మీర్ రాజకీయాలపై  ప్రభావం చూపించిన కాంగ్రెస్ పార్టీ కి కూడా ఒక్కటంటే ఒక్క  నియోజకవర్గం కూడా దక్కలేదు. కేవలం బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ మాత్రమే ఈ రాష్ట్రంలో పట్టు నిరూపించుకున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఆరు లోక్ సభ నియోజకవర్గాల్లో ఈసారి బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ చెరి మూడు సీట్లు గెలుచుకున్నాయి. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ  అనంతనాగ్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ కేండిడేట్ గా బరిలో నిలిచిన హై కోర్టు మాజీ జడ్జి  హస్నన్ మసూది అనంతనాగ్ సెగ్మెంట్ లో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గులాం అహ్మద్ మీర్ ఇక్కడ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. మెహబూబా ఇక్కడ థర్డ్ ప్లేస్ కు పరిమితమయ్యారు. మూడు విడతల్లో ఇక్కడ పోలింగ్ జరగడం విశేషం. ఉధంపూర్, జమ్మూ, లడఖ్ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. 2014  ఎన్నికల్లో కూడా బీజేపీ మూడు సీట్లు సాధించింది. ఈసారి కూడా అదే నెంబర్ ను సాధించి పట్టు నిలుపుకుంది.

ఉధంపూర్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గెలుపు

ఉధంపూర్ లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గెలిచారు. కాంగ్రెస్ కేండిడేట్ గా బరిలో నిలిచిన మహారాజా హరి సింగ్ మనవడు విక్రమాదిత్య సింగ్ పై 3.57 లక్షల మెజారిటీతో జితేంద్ర సింగ్ విజయం సాధించారు. ఇది బీజేపీ సిట్టింగ్ సీటు. 2014 లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై బీజేపీ టికెట్ పై పోటీ చేసి జితేంద్ర సింగ్  నెగ్గారు. ఉధంపూర్ లో ఈసారి 70.20 శాతం పోలింగ్ నమోదైంది.

జమ్మూలో బీజేపీ కేండిడేట్ జుగల్ కిశోర్ గెలుపు

జమ్మూ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి జుగల్ కిశోర్ విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రామన్ భల్లా పై 3,02,875 ఓట్ల మెజారిటీతో జుగల్ కిశోర్  గెలిచారు. జమ్మూలో 72.49 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే  జమ్మూలో 3.31 శాతం పోలింగ్ పెరిగింది.

లడఖ్ లోనూ బీజేపీ గెలుపు

లడఖ్ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఇక్కడ నుంచి బీజేపీ టికెట్ పై పోటీ చేసిన జేటీ నాంగ్యల్, ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన జర్నలిస్టు సజ్జాద్ హుస్సేన్ పై 10,000 మెజారిటీతో విజయం సాధించారు.2014 లో ఇక్కడ 70.78 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 63.7 శాతం మాత్రమే నమోదైంది.

శ్రీనగర్ నుంచి ఫరూఖ్ అబ్దుల్లా విజయం

నేషనల్ కాన్ఫరెన్స్ గెలుచుకున్న మూడు నియోజకవర్గాల్లో శ్రీనగర్ ఒకటి.  నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌‌‌‌ అబ్దుల్లా ఇక్కడి నుంచి 70,050 మెజారిటీతో విజయం సాధించారు.శ్రీనగర్ సెగ్మెంట్ కు ఫరూఖ్ అబ్దుల్లా సిట్టింగ్ ఎంపీ. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పీడీపీ కేండిడేట్ తారిఖ్ హమీద్ గెలిచారు. తర్వాత 2017 లో  జరిగిన బై ఎలక్షన్ లో నేషనల్ కాన్ఫరెన్స్ కేండిడేట్ ఫరూఖ్ అబ్దుల్లా విజయం సాధించారు.

ఎన్సీ ఖాతాలో బారాముల్లా

బారాముల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి  అక్బర్ లోనె విజయం సాధించారు. ఇక్కడ పీడీపీ టికెట్ పై ఖయ్యూమ్ వనీ, పీపుల్స్ కాన్ఫరెన్స్  టికెట్ పై రజా అజాజ్ అలీ పోటీ చేశారు. 2014 లో ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ 39.10 శాతం కాగా ఈసారి అది 34.61కు పడిపోయింది.

ఒంటరయింది

జమ్మూ కాశ్మీర్‌‌కి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి, తండ్రి చనిపోయాక పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్న వారసురాలు, ముస్లిం మెజారిటీగల రాష్ట్రంలో హిందూత్వ పార్టీతో స్నేహం చేసిన లౌకికవాది… ఈ క్వాలిటీస్‌‌ అన్నీ ఇముడ్చుకున్న లీడర్‌‌ మెహబూబా ముఫ్తీ.  పస్తుతం అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ ఎటూ కాకుండా ఉన్నారు. తాజా ఎన్నికల్లో తమ కుటుంబానికి కంచుకోటలాంటి అనంత్‌‌నాగ్‌‌లోనూ ఓడిపోయారు.

మెహబూబా నేపథ్యాన్ని గమనిస్తే… తండ్రి ముఫ్తీ మెహమూద్‌‌ సయీద్‌‌ రాజకీయ జీవితమంతా కాంగ్రెస్‌‌లోనే గడిచింది. ఆ తర్వాత పీపుల్స్‌‌  డెమొక్రటిక్‌‌ పార్టీ (పీడీపీ) స్థాపించుకుని, 2002లో ఒకసారి కాంగ్రెస్‌‌ సాయంతో స్వల్పకాలం  సీఎం అయ్యారు. 2015నాటి ఎన్నికల్లో కాశ్మీర్‌‌ అసెంబ్లీలోని 87 సీట్లలో పీడీపీకి 28, బీజేపీకి 25 రాగా, నేషనల్‌‌ కాన్ఫరెన్స్‌‌కి 15, కాంగ్రెస్‌‌కి 12 వచ్చాయి. హంగ్‌‌ అసెంబ్లీలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. సయీద్‌‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. పదవిలో ఉండగానే 2016లో తండ్రి చనిపోవడంతో మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. రావణకాష్టంలా ఉండే జమ్మూకాశ్మీర్‌‌లో ఆమెకు ఒకపక్క వేర్పాటువాదులు, మరోపక్క జాతీయవాదుల వత్తిడి తీవ్రంగా ఉండేది.  పోయినేడాది రంజాన్‌‌ సీజన్‌‌లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను సాకుగా తీసుకుని, రాష్ట్రంలో లా అండ్‌‌ ఆర్డర్‌‌ దిగజారిపోతోందన్న కారణంతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో పీడీపీ ప్రభుత్వం కుప్పకూలింది.  జమ్మూకాశ్మీర్‌‌లో తమ పార్టీని గ్రాస్‌‌రూట్‌‌ లెవెల్‌‌ నుంచి నిర్మించుకునే పనిలో పడ్డారు..