- లాభాలు చూస్కుంటుందే కానీ.. కార్మికుల సంక్షేమం పట్టట్లే
- నేటికీ పూర్తిస్థాయిలో భూనిర్వాసితులకు దక్కని ఉద్యోగాలు
- ఎస్టీపీపీలో మెజారిటీ కార్మికులు ఉత్తరాది వాళ్లే..
- ఇయ్యాల బీఎంఎస్ ఆధ్వర్యంలో ప్లాంట్ వద్ద నిరసన దీక్ష
- పాల్గొననున్న పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ప్లాంట్(ఎస్టీపీపీ)లో పనిచేసే కాంట్రాక్ట్కార్మికులు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదేండ్ల సర్వీస్, విద్యార్హతలు ఉన్నవారికి స్కిల్డ్జాబ్స్ ఇవ్వాలని ఉన్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. పవర్జనరేషన్ కు చెమటోడ్చుతున్న కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఏటా వస్తున్న రూ.500 కోట్ల లాభాలను చూసి మురిసిపోతుందే తప్ప, అందుకోసం కష్టపడుతున్న వారి వైపు కన్నెత్తి చూడడం లేదు.
పైగా ఎస్టీపీపీ ఆపరేషన్స్, మెయింటనెన్స్ ను పవర్ మేక్ అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోంది. సింగరేణి తరఫున రిటైర్డ్అధికారులను పర్యవేక్షణకు పెట్టి, పెత్తనమంతా వారికే అప్పజెప్పింది. ఇక వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లు తయారైంది పరిస్థితి.
టార్గెట్ రీచ్ అయితే చాలు
ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో 2005లో ఎస్టీపీపీ నిర్మాణం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2016లో సీఎం కేసీఆర్ ప్లాంట్ను ఓపెన్ చేశారు. ఎస్టీపీపీలో కరెంట్ఉత్పత్తి మొదలు కార్మికులకు జీతాల చెల్లింపు వరకు కాంట్రాక్ట్సంస్థలదే కీలకపాత్ర. సింగరేణి యాజమాన్యం కేవలం పర్యవేక్షణకే పరిమితమైంది. దీంతో కాంట్రాక్ట్ కార్మికుల భద్రత, సంక్షేమం ప్రశ్నార్థకంగా మారాయి. 1,200 మెగావాట్ల ప్లాంట్లో నెలకు నిర్దేశించిన పీఎల్ఎఫ్(పవర్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తే చాలు.. మిగతా విషయాలు అక్కర్లేదన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.
స్థానికులు 20 శాతమే..
ఎస్టీపీపీలో దాదాపు1,600 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో భూనిర్వాసితులు, స్థానికులు కేవలం 400 మందే ఉన్నారు. మిగతా 1200 మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారే. పలు కీలకమైన విభాగాల్లో వారికే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఉత్తరాదికి చెందినవారే కావడంతో లోకల్స్ను చిన్నచూపు చూస్తున్నారు.
ALSO READ : తెరపైకి బీసీ నినాదం.. 53 శాతం మంది బీసీ ఓటర్లే
కనీస వేతనాల చెల్లింపు, పని స్థలాల్లో భద్రత, సంక్షేమం పట్టించుకోవడం లేదు. స్థానిక యువతకు డిగ్రీ, పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్ క్వాలిఫికేషన్స్ఉన్నప్పటికీ అన్స్కిల్డ్జాబ్స్కే పరిమితం చేస్తున్నారు. నియామకాలు, వేతనాల చెల్లింపుల్లో వివక్ష చూపిస్తున్నారు. అన్స్కిల్డ్కార్మికులకు రోజుకు రూ.475, సెమీ స్కిల్డ్కార్మికులకు రూ.520 చొప్పున చెల్లిస్తున్నారు. ఐదేండ్ల సర్వీస్, విద్యార్హతను బట్టి స్కిల్డ్జాబ్స్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
భూనిర్వాసితులకు మొండిచేయి
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో తమ బతుకులు బాగుపడుతాయనే ఆశతో సాగు భూములను త్యాగం చేసిన రైతులకు నిరాశే మిగిలింది. ప్లాంట్కోసం జైపూర్మండలంలోని పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి గ్రామాల పరిధిలో1,883 ఎకరాల వ్యవసాయ భూములను సేకరించారు. రైతులను ఒప్పించేందుకు 825 భూనిర్వాసితుల కుటుంబాల్లో ఇంటికో పర్మినెంట్జాబ్ఇస్తామని అప్పట్లో సింగరేణి అధికారులు హామీ ఇచ్చారు. 80 శాతం కాంట్రాక్ట్ ఉద్యోగాలను స్థానిక యువతకే ఇస్తామన్నారు.
కానీ ఇప్పటివరకు 200 మంది భూనిర్వాసితులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన వారికి కన్నీళ్లు మిగిల్చారు. ఎస్టీపీపీలో త్వరలో 800 మెగావాట్లతో థర్డ్యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే మరో 500లకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయి. వీటిని స్థానికులకే ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్చేస్తున్నారు.
ఎస్టీపీపీ కాంట్రాక్ట్కార్మికుల సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం బీఎంఎస్ ఆధ్వర్యంలో సోమవారం ప్లాంట్ ఎదుట నిరసన దీక్ష తలపెట్టారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ జి.వివేక్వెంకటస్వామి దీక్షలో పాల్గొననున్నారు.