సరళాసాగర్, శంకర్ సముద్రం, రామన్ పాడు గేట్లు ఓపెన్
కొత్తకోట, ఆత్మకూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు
తాళ్లపల్లి వద్ద కొనసాగుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్
రెండు చోట్ల వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తులను కాపాడిన స్థానికులు
నాగర్ కర్నూల్, వనపర్తి, వెలుగు: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి పారుతుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. మదనాపురం మండల పరిధిలోని సరళా సాగర్ ఆటోమేటిక్ సైఫన్లు ఓపెన్ కావడంతో పాటు శంకర్ సముద్రం గేట్లు ఎత్తడంతో ఊక చెట్టు వాగు ఉధృతంగా పారుతోంది. మదనాపురం, ఆత్మకూరు ప్రధాన రహదారిపై రైల్వే గేట్ సమీపంలోని బ్రిడ్జి పైనుంచి ప్రవహిస్తుండడతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నీరంతా రామన్ పాడు ప్రాజెక్టు చేరుకోవడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్రిడ్జి నుంచి పారుతున్న వాగును బైక్‌తో దాటేందుకు ప్రయత్నించిన గోపన్‌పేటకు చెందిన దంపుతులు జారి పడ్డారు. అక్కడున్న వాళ్లు వారిని కొట్టుకుపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఉధృతంగా దుందుభి
దుందుభి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అచ్చంపేట, ఉప్పు నుంతల, వంగూరు, రఘుపతిపేట, ఊర్కొండ, తాడూరు, తెల్కపల్లిలో దుందుభి, వెల్దండ, కోడేరు,పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్మండలాల్లో వాగులు ఉప్పొంగి పారుతుండంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. ఎమర్జెన్స అయితే ప్రజలు తెప్పలు, ట్రాక్టర్లపై వాగు దాటుతున్నారు. తెల్కపల్లి మండలం కార్వంగ–తాళ్లపల్లి వద్ద గల్లంతైన రాఘవేందర్ఆచూకీ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి దగ్గర బైక్‌పై పెద్దవాగు దాటడానికి ప్రయత్నించిన యువకులు ప్రవాహానికి కొట్టుకుపోగా.. అక్కడే వ్యక్తులు వారిని బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. వెల్డండ మండలం రాచూరు, కల్వకుర్తి మండలం మొకురాల, రఘుపతిపేట, కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం, మొలచింతలపల్లితో పాటు పలు గ్రామాల్లో పల్లి విత్తనాలు కొట్టుకుపోయాయని రైతులు వాపోయారు. నక్కలగండి ప్రాజెక్టు నిండి మన్నెవారిపల్లి-, అక్కారం మధ్యలో ఉన్న కాజ్‌వే పైనుంచి పారుతుండడంతో అక్కారం, బక్కలింగాయ పల్లికి సంబంధాలు కట్ అయ్యాయి. నక్కల గండి ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌తో మార్ల పాడుతండా సమీపంలో వరి, ప్రత్తి పంటలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను అచ్చంపేట తహసీల్దార్ కృష్ణయ్య పరిశీలించారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు సహా అన్ని సంక్షేమ పథకాలు పేదలకు ఉచితంగానే అందిస్తామని, దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ కోరారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కమలా గార్జెన్స్లో 19, 20, 40, 41వ వార్డుల పరిధిలోని 263 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి అవినీతికి పాల్పడాలని చూస్తే ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని, చట్ట ప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు.
ఒక్క రూపాయి లంచం అడిగినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న దళారులు, అక్రమార్కులపై అధికారులు కూడా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు సేవ చేద్దాం
నెట్‌వర్క్, వెలుగు: ఇన్నాళ్లు కుటుంబ కోసం కష్టపడి జీవిత చరమాంక దశకు చేరుకున్న వృద్ధులకు సేవ చేద్దామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవ చేసిన వృద్ధులకు అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సన్మానం చేశారు.మహబూబ్ నగర్‌లో మంత్రి మాట్లాడుతూ రెండెకరాల స్థలంలో వృద్ధాశ్రమం నిర్మించనున్నట్లు ప్రకటించారు. వనపర్తిలో రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ ఉమాదేవి మాట్లాడుతూ వృద్ధులను పిల్లలు పట్టించుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పేటలో వృద్ధులకు ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చారు.
ఆపరేషన్,అబార్షన్ల జోలికి పోకండి
ఆర్‌ఎంపీ, పీఎంపీలకు మంత్రి హరీశ్ రావు సూచన
నాగర్‌కర్నూల్, వెలుగు: ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఆపరేషన్, అబార్షన్లకు జోలికి పోవద్దని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. శుక్రవారం సాయంత్రం అచ్చంపేట టౌన్లో మీటింగ్ పెట్టుకున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు ఎమ్మెల్యే, విప్ గువ్వల బాలరాజును ఆహ్వనించారు. టాస్క్‌ఫోర్స్ టీమ్‌ల తనిఖీలు ఎక్కువయ్యాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. స్పందించిన మంత్రి రాష్ట్రంలో 98 శాతం ఆర్‌ఎంసీ, పీఎంపీ, ఎంబీబీఎస్ డాక్టర్లు మంచొళ్లేనని, అక్కడక్కడ ఒకరిద్దరు అనుమతులు లేకుండా క్లినిక్‌లు నడుపుతున్నారన్నారు.
ఎంబీబీఎస్ డాక్టర్లు ఎండీ, సర్జన్ల బోర్డులు పెట్టుకుని ఆపరేషన్లు చేస్తున్నారని, ఆయుర్వేద డాక్టర్లు ఇంగ్లీష్ మందులు రాస్తున్నారని మండిపడ్డారు. ఆర్‌ఎంపీ, పీఎంసీలు డాక్టర్లు అని బోర్డు పెట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నారని, సూదులు, మందుగోలీలకు పరిమితం కావాలని సూచించారు. ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్లు ఇద్దామంటే.. యూనియన్లు కలిసి రావడం లేదని, త్వరలోనే ఈ పని పూర్తిస్తామని హామీ ఇచ్చారు.
భూత్పూర్ మున్సిపాలిటీకి కేంద్ర విశిష్ట అవార్డు
భూత్పూర్, వెలుగు: భూత్పూర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ విశిష్ట అవార్డు లభించింది. శనివారం డిల్లీలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ సత్తూరు బస్వరాజ్ గౌడ్, కమిషనర్ నూరుల్ నజిబ్, మేనేజర్ అశోక్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
కాత్యాయని దేవీగా జోగులాంబ
అలంపూర్, వెలుగు: ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారు శనివారం కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి సహస్రనామార్చన, చండీహోమం నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన సత్యసాయి నృత్య అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారుల ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ఆకట్టుకుంది. చిన్నారులకు అలంపూర్ కోర్టు జడ్జి కమలాపురం కవిత, ఆలయ ఈవో ఫురేందర్ కుమార్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మలు ప్రశంసా పత్రాలు.
జ్ణాపికలు అందజేశారు.
ప్రపంచ దృష్టి భారత్ వైపు
బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంత కుమార్ చెప్పారు. శనివారం నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి పాలనలో దేశంలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందన్నారు. రక్షణ రంగంలో ప్రపంచంలోని అగ్ర దేశాల సరసన నిలిపిన ఘతన మోడీదేనన్నారు.
ప్రాంతీయ పార్టీలు వల్ల దేశానికి ఒరిగేదేమీ లేదని, జాతీయ భావంతో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. దేశం మరింత ముందుకు వెళ్లాలంటే మేధావులు సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు, నియోజకవర్గ ఇన్‌చార్జి దిలీప్ ఆచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి శివుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి, నేతలు కృష్ణ గౌడ్, సుధాకర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్ రావు పాల్గొన్నారు.
ఆలయాలపై రాజకీయాలు వద్దు
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
అలంపూర్, వెలుగు: దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శనివారం జోగులాంబ ఆలయాలను జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు వీరికి ఆలయ ఈవో, చైర్మన్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం జోగులంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెంపుల్‌లో కల్పిస్తున్న సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రసాద్ స్కీం ద్వారా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచాలని సూచించారు.
ఎమ్మెల్యే అబ్రహం గెలిచిన తర్వాత ఆయన అభ్యర్థన మేరకు ఏటా స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు. ఆదివారం మంచిరోజు ఉందని, అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనం ఇవ్వనున్నందున దేవాదాయ శాఖ ద్వారా ఈ కార్యాన్ని నిర్వహిస్తామన్నారు. భద్రాచలం, వేములవాడ, యాదగిరిగుట్ట, బాసరకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వదని, ఆలయానికి వచ్చే ఆదాయంతోనే పట్టు వస్త్రాలను సమర్పిస్తామని చెప్పారు. దీనిని ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు. ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు దేవదాయ శాఖ ద్వారా రూ. 1 .66 లక్షల వేతన రూపంలో ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో పురేందర్ కుమార్, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రమణ పాల్గొన్నారు.
ఏడో రోజూ ఆదే జోష్
బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏడో రోజైన శనివారం మహబూబ్‌నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉద్యోగులు, ఆఫీసర్ల సతీమణులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జడ్పీ గ్రౌండ్‌లో వ్యవసాయ శాఖ, రిజిస్ట్రేషన్, స్టాంపులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మలు తయారు చేసి.. పాటలు పాడుతూ ఆటలు ఆడారు. వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సతీమణి శారద, కలెక్టర్ వెంకట్‌రావు సతీమణి రాజేశ్వరి పాల్గొన్నారు. –మహబూబ్‌నగర్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వెలుగు
కాంగ్రెస్ నుంచి సిరాజ్ ఖాద్రి సస్పెన్షన్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వ్యవహారంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత సిరాజ్ ఖాద్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు డీసీసీ ప్రెసిడెంట్ ఉబేదుల్లా కోత్వాల్ తెలిపారు. శనివారం డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఉండి అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ ముదిరాజ్, సీజే బెనహర్, సాయిబాబ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత పాల్గొన్నారు.
మహిళలపై దాడులను అరికట్టాలి
నారాయణపేట, వెలుగు: మహిళలపై జరుగుతున్న దాడులు, వేధింపులను అరికట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర సహయ కార్యదర్శి విజయలక్ష్మి డిమాండ్ చేశారు. అక్టోబర్ 8, 9 తేదీల్లో పేట జిల్లా కేంద్రంలో జరిగే పీవోడబ్ల్యూ రాష్ట్ర 7వ మహాసభల వాల్ పోస్టర్‌ను శనివారం సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నిచోట్లా వివక్ష, అణిచివేత, వేధింపులకు గురవుతున్నారని వాపోయారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బేటి పడావో బేటి బచావో ’ నినాదంగానే మిగిలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ఇలాగే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శారద, ఉపాధ్యక్షురాలు లక్ష్మి, జిల్లా కార్యదర్శి సౌజన్య, సహాయ కార్యదర్శి భాగ్యలక్ష్మి, కోశాధికారి మాధవి, కోటకొండ ఎంపీటీసీ సునీత, లీడర్లు మంజుల, సరళ, చంద్రకళ,లక్ష్మి, సావిత్రమ్మ, లలిత, రాధిక, అనిత తదితరులు పాల్గొన్నారు.
బిజినెస్ స్కిల్స్ తెలుసుకోవాలి
కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రైతు ఉత్పత్తి కంపెనీలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వ్యాపారంలో మెలకువలు తెలుసుకోవాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. శనివారం నాగర్ కర్నూల్ రైతు వేదికలో రైతు ఉత్పత్తి సంఘాలు, నాబార్డ్, బ్యాంకు, వ్యవసాయ అధికారులతో ఈక్విటీ గ్రాంట్, క్రెడిట్ గ్యారెంటీ పథకాలపై మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్కెటింగ్‌తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై అవగాహన ఉండాలన్నారు. వ్యాపారానికి సంబంధించి లాభ నష్టాలపై విషయ జ్ఞానం ఉండాలని, ఉత్పత్తులకు విలువను జోడించి అమ్మితేనే లాభాలు వస్తాయన్నారు. చాలా మంది పెట్టుబడిని మౌలిక సదుపాయాలు, యంత్రాలపై పెడుతున్నారని, తర్వాత ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ఇటు బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించ లేక, అటు వ్యాపారం చేయలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. కనీసం రెండు మూడేళ్ల పాటు నిలదొక్కునేలా ప్లానింగ్ ఉంటే కచ్చితంగా లాభాలు వస్తాయన్నారు.
ఇండ్ల స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరన్నపేటలో నిర్మించిన ఇండ్లకు కేవలం 100 డిప్పులు తీసి మిగతా వాటిని అక్రమార్కులకు అప్పజెప్పారని ఆరోపించారు. వందల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల తాళాలు అక్రమార్కుల చేతులకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మంత్రి పీఏ కొండుకు అక్రమ దందాకు అజ్యం పోశారని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు పడాకుల బారాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి, నేతలు అంజయ్య, బురుజు రాజేందర్ రెడ్డి, నల్లమద్ది సురేందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి, నేతలు సంపత్, బొంగు గన్న, రాచాల శ్రీధర్, నవీన్ రెడ్డి పాల్గొన్నారు.