కరీంనగర్లో అరుదైన ఘటన జరిగింది. శ్రీనివాస్ అనే పేరు గల వారంతా ఒక్కచోటికి వచ్చి సమావేశం కావడం ఈ విషయం తెలిసిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. కాళేశ్వరానికి చెందిన ఆచార్య శ్రీనివాస దైవజ్ఞ ఆలోచనతో కరీంనగర్లోని వెంకటేశ్వర ఆలయంలో ఈ ‘శ్రీనివాసులు’ అందరూ కలుసుకున్నారు. ‘శ్రీనివాసుల సమూహం’ పేరుతో వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి గత ఏడాది కాలంగా సభ్యులను అడ్మిన్ ఒక్కటి చేశాడు. శ్రీనివాసుల మహాసభను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఈ టీం నిర్ణయించారు. శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న 560 మందితో తెలంగాణ రక్తదాతల గ్రూపు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ALSO READ | కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే టార్గెట్: విప్ ఆది శ్రీనివాస్
తలసేమియాతో బాధపడుతున్న పిల్లల కోసం ఏడాదిలో మూడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించారు. ట్రైన్లో ఒకేసారి బోగీలు బుక్ చేసుకుని ఏడాదికోసారి తిరుపతి వెళ్లాలని తీర్మానించారు. ఇప్పటివరకు ఒక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మూడు గ్రూపుల్లో కలిపి 2,360 మంది శ్రీనివాసులను చేర్చినట్లు వెల్లడించారు. ‘శ్రీనివాస సేవా సంస్థను ట్రస్టుగా ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెలలో ఒక శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈ టీం తెలిపింది.