మంచిర్యాల జిల్లాలో వింత.. బావిలో నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లొస్తున్నయ్..!

మంచిర్యాల జిల్లాలో వింత.. బావిలో నుంచి ఐదు రోజులుగా వేడి నీళ్లొస్తున్నయ్..!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బావిలో నుంచి ఐదు రోజులుగా సెగలు కక్కుతూ వేడి నీళ్లొస్తున్నయ్. ఈ వింతను చూసేందుకు జనాలు ఆ బావి దగ్గరికి క్యూ కడుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మాదాపూర్ గ్రామానికి చెందిన ఆవునూరి మదూకర్ ఇంటి ఆవరణలోని త్రాగునీటి బావిలో నుంచి గత ఐదు రోజుల నుంచి వేడి నీళ్ళు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వింతను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.

దీనిపై గ్రామస్తులు మాట్లాడుతూ బావిలో నుంచి వేడి నీళ్ళు రావడం వింతగా ఉందని.. దీనిని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారని, చుట్టు ప్రక్కల ఇండ్ల వారు ఈ నీటిని తీసుకువెళ్ళి స్నానాలు చేస్తూ నీటి వెచ్చదనాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఇన్నాళ్లు ఆ ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగుపొరుగు దాహార్తి తీర్చిన ఆ బావిలో నుంచి ఉన్నట్టుండి ఇలా వేడి నీళ్లు ఎందుకొస్తున్నాయో భూగర్భ జలాల శాఖ అధికారులు పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించి ఈ నీటిని పరీక్షలకు పంపి ప్రజల్లో భయాందోళనను తగ్గించాలని ఆ ఊరి జనం కోరారు.

ALSO READ | ప్రతి ఒక్కరూ గాంధీజీని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి