బెంగళూరు రెస్టారెంట్లో వింత రూల్.. రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చలు జరపొద్దంటూ బోర్డు ఏర్పాటు

బెంగళూరు రెస్టారెంట్లో వింత రూల్.. రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చలు జరపొద్దంటూ బోర్డు ఏర్పాటు

బెంగళూరు: బెంగళూరుకు చెందిన ఓ రెస్టారెంట్ యాజమాన్యం తన కస్టమర్లకు విచిత్రమైన రూల్ పెట్టింది. తమ రెస్టారెంట్​కు వచ్చిన వాళ్లు కేవలం భోజనం మాత్రమే చేయాలని.. ఇక్కడ రియల్ ఎస్టేట్, రాజకీయాలపై చర్చలు పెట్టొద్దని స్పష్టంచేసింది. ఇటీవల పొలిటికల్, రియల్ ఎస్టేట్​కు సంబంధించిన చర్చలు ఎక్కువ అవుతుండడంతో బెంగళూరుకు చెందిన పాకశాల రెస్టారంట్ ఇలా  ఓ నోటీసు బోర్డును ఏర్పాటు చేసింది. 

"ఈ రెస్టారెంట్ కల్పించే సౌకర్యాలు  భోజనం కోసం మాత్రమే. రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చల కోసం కాదు. దయచేసి అర్థం చేసుకుని సహకరించండి. ఇక్కడ రియల్ ఎస్టేట్, రాజకీయ చర్చలు పెట్టకండి" అని బోర్డులో రాసి ఉంది. దీన్ని ఓ వ్యక్తి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కొందరు రెస్టారెంట్ రూల్​ను సమర్థించగా.. మరికొందరు మాత్రం ఇదేం రూల్ ? అంటూ మండిపడుతున్నారు. "చర్చల వల్ల రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతోంది. కానీ, రెస్టారెంట్లకు వ్యాపారమే కావడం లేదు. కొందరు రూ.20 టీ కొనుక్కొని గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు!!" అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. "అవును. రియల్ ఎస్టేట్, రాజకీయాలపై చర్చలు ఎప్పటికీ ముగియవు. రెస్టారెంట్ కు తినడానికి వచ్చేవారి కంటే మాట్లాడుకోవడానికి వచ్చే వారే ఎక్కువ. వాళ్లే ఎక్కువసేపు టేబుల్స్ ని ఆక్రమించుకుంటారు!" అని మరొకరు రాసుకొచ్చారు.