హైదరాబాద్లో ఆటోలను స్క్రాప్​ చేయాలంటే ఫిట్​నెస్​ సర్టిఫికెట్ ​కావాలంటూ ఆర్టీఏ ఆఫీసర్ల వింత రూల్

హైదరాబాద్లో ఆటోలను స్క్రాప్​ చేయాలంటే ఫిట్​నెస్​ సర్టిఫికెట్ ​కావాలంటూ ఆర్టీఏ ఆఫీసర్ల వింత రూల్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఆటోలను స్క్రాప్​ చేయాలంటే ఫిట్​నెస్​ సర్టిఫికెట్ ​కావాలంటూ ఆర్టీఏ ఆఫీసర్లు వింత రూల్ ​అమలు చేస్తున్నారు. తుక్కుగా మార్చడానికి ఫిట్​నెస్​ సర్టిఫికెట్ ​ఎందుకో తెలియడం లేదు. కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రభుత్వం స్ర్కాప్​పాలసీ తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా పాత ఆటోలను స్ర్కాప్ ​చేస్తున్నారు.

అయితే, ఇప్పటికే కాలం తీరిన వాహనాల్లో ముఖ్యంగా ఆటోలను స్ర్కాప్​చేసేందుకు ముందుకు వస్తున్న వారికి ఆర్టీఏ అధికారులు పెడుతున్న నిబంధనలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రత్యేకించి 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలకు ఫిట్​నెస్​ పరీక్షలు నిర్వహించి గ్రీన్​ ట్యాక్స్​ వసూలు చేస్తున్నారు. అయితే, స్ర్కాప్​కు ముందుకు వస్తున్న వారికి అధికారులు పెడుతున్న నిబంధనలు అడ్డంకిగా మారుతున్నట్టు ఆటో యూనియన్లు ఆరోపిస్తున్నాయి. 

స్ర్కాప్​ చేయాలన్నా కూడా సదరు వాహనాలకు ఫిట్​నెస్​ తప్పని సరి అని నిబంధనలు పెడుతున్నారు. దీంతో పాత ఆటోను తీసేసి కొత్త ఆటో కొనాలనుకున్న వారికి అధికారుల నిబంధనలు భారంగా మారుతున్నాయంటున్నారు.  సాధారణంగా కాలం తీరిన వాహనాలకు గ్రీన్​ట్యాక్స్​ కట్టడానికి ముందుకు వచ్చే వారి నుంచి ఫిట్​నెస్​ కోసం ఐదువేల రూపాయలు వసూలు చేస్తున్నారు. కానీ, స్ర్కాప్​ చేస్తామన్నా మళ్లీ ఫిట్​నెస్​ఎందుకని ఆటోవాలాలు ప్రశ్నిస్తున్నారు. 

స్ర్కాప్​ కోసం వచ్చే వారికి తప్పని తిప్పలు..
గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో అన్ని రకాల వాహనాలు కలిపి  దాదాపు 80 లక్షలు  ఉండగా.. అందులో 50 శాతం టూవీలర్స్ ఉన్నాయి. వాటిలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు దాదాపు 18 లక్షల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు.  ఇందులో కాలం తీరిన ఆటోలు దాదాపు 13 వేల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. వీటిని మరో ఐదు సంవత్సరాలకు ఫిట్​నెస్​ చేసుకుని, గ్రీన్​ ట్యాక్స్​కట్టుకునే వెసులుబాటు ఉంది. కానీ, కొందరు ఆటోల వారు పాతది స్ర్కాప్​చేసి అధికారులు ఇచ్చే పర్మిట్​తో కొత్త ఆటో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, పాత ఆటో ఫిట్​నెస్​ చేయించాలంటే మరో 5వేల రూపాయలు ఖర్చవుతుందని వారు చెప్తున్నారు. ఇది తమకు భారమేనని అంటున్నారు.

కొత్త ఆటోనే చాలా మంది డీలర్లు బ్లాక్​లో అమ్ముతూ 50 నుంచి 60 వేల రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు తుక్కు చేసే ఆటోకు మళ్లీ ఐదువేలు కట్టమంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో ఆటోల నిషేధం ఉన్న నేపథ్యంలో చాలా మంది పాత ఆటోలను స్ర్కాప్​చేసి కొత్తవి కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ, అధికారుల నిబంధనలు తమకు భారంగా మారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిబంధనను తొలగించాలని ఆటో యూనియన్ నాయకులు అధికారులను కోరుతున్నారు. 

తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం..
ఆటో స్క్రాప్​చేసేముందు రెగ్యులర్​ఫిట్​నెస్​సర్టిఫికెట్​తో పాటు మీటర్​ఫిట్​నెస్​సర్టిఫికెట్​కూడా సమర్పించాలని సిస్టంలో చూపిస్తోంది. అయితే, ఈ నిబంధనను ఆటో డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. తుక్కు చేయాలనుకున్న ఆటోకు సుమారు రూ.6 వేల వరకు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని, ఈ రూల్​తీసెయ్యాలని ఆటోడ్రైవర్లు అడుగుతున్నారు. దీనిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.
- రమేశ్ కుమార్, జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్