
ఖర్గోన్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వింత చోరీ జరిగింది. రాత్రిపూట ఒక దుకాణంలో చొరబడ్డ దొంగ.. లాకర్లోని రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. పండుగపూట (శ్రీరామనవమి) ఇటువంటి పనిచేసినందుకు తనను క్షమించాలని కోరుతూ ఓ లేఖ రాసిపెట్టి వెళ్లాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమీదార్ మొహల్లాలో జుజర్ అలీ బోహ్రా ఓ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. వ్యాపారం ముగిసిన తర్వాత ఆయన రూ.2.84 లక్షలను ఒక బ్యాగులో పెట్టి ఇంటికెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి షాపులోకి చొరబడిన దొంగ రూ.2.45 లక్షలను చోరీ చేశాడు.
మిగిలిన రూ.34 వేలను బ్యాగులోనే వదిలి వెళ్లిపోయాడు. శ్రీరామనవమి రోజు చోరీ చేసినందుకు తనను క్షమించాలని కోరుతూ టైప్ చేసిన లెటర్‌ను దొంగ షాపులోనే వదిలివెళ్లాడు. తాను దుకాణానికి సమీపంలోనే నివసిస్తానని తెలిపాడు. అప్పులతో తాను నిరంతరం సతమతం అవుతున్నానని, రుణదాతల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నానని చెప్పాడు. దొంగిలించిన మొత్తాన్ని ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని హామీ ఇచ్చాడు.