
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో కాముని మందు పంపిణీ చేశారు. ఈ కాముని మందు కోసం జనాలు బారులు తీరారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మందు కోసం భారీ సంఖ్యలో ధర్మారం గ్రామానికి వెళ్లి ఆ మందు తీసుకున్నారు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు కామ దహనం చేసిన అనంతరం చెట్ల మందులతో తయారుచేసిన మందును గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తారు. ఈ మందు చర్మ రోగాలతో పాటు సర్వరోగ నివారిణి అని ఇక్కడి ప్రజల నమ్మకం.
హోలీ పండుగను తెలంగాణలోనే పలు రకాలుగా జరుపుకుంటారు. హోలీ అంటే.. కామన్గా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్పల్లిలో మాత్రం హోలీ పండుగొస్తే చాలు.. పిడిగుద్దులాట జరుగుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతున్నది. ఈ క్రమంలో కొంతాన్పల్లిలో పిడిగుద్దులాట ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు.
ALSO READ | హైదరాబాద్లో ఘోరం.. గుడిలో కూర్చుంటే వచ్చాడు.. ‘హ్యాపీ హోలీ’ అని యాసిడ్ పోశాడు !
ఆనవాయితీ ప్రకారం.. చాకలి, మంగలి, కుమ్మరి, బైండ్ల, గౌడ తదితర కుల వృత్తుల వారు గ్రామ పంచాయతీ వద్ద నుంచి డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి కల్లు ఘటం తీసుకొచ్చి గ్రామ కూడలిలో పెట్టారు. ఆ తర్వాత పొడవైన తాడు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా కుల వృత్తుల వారు రెండు గ్రూపులుగా విడిపోయి చెరోవైపు తాడు పట్టుకుని ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
దెబ్బలు తగులుతున్నా.. నొప్పి పెడ్తున్నా.. రక్తం వస్తున్నా.. లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించారు. సుమారు రెండు గంటల పాటు ఈ ఆట జోరుగా సాగింది. దీన్ని చూసేందుకు శివ్వంపేట, తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి మండల పరిధిలోని గ్రామాలతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం.