తైవాన్ జామతో మంచి లాభాలు వస్తాయని భావించిన రైతులకు అవస్థలు తప్పడం లేదు. తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడి వస్తుందనుకున్న అన్నదాతల ఆశలు నెరవేరడం లేదు. ముందు మురిపించి తర్వాత కోలుకోలేని దెబ్బ తింటున్నారు రైతులు. తోట వేసిన రెండేళ్ళకే వింత వైరస్ సోకడంతో నల్లగొండ జిల్లా తైవాన్ జామ రైతులకు నష్టాలు తప్పడం లేదు.
నల్లగొండ జిల్లాలో తైవాన్ జామ తోటలు వేసిన రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. పండు ఈగ, వేరు నులి పురుగు, పక్షికన్ను తెగులు ప్రభావంతో తోటలు నాశనమవుతున్నాయి. చేతికి వచ్చే సమయంలో కాయలు రాలిపోతున్నాయి. తైవాన్ జామ తోటల తెగుళ్లను తట్టుకోలేక రైతులు తోటలను కొట్టేస్తున్నారు. నల్లగొండలో 400 ఎకరాలు, సూర్యాపేటలో 228 ఎకరాలు, యాదాద్రిలో 350 ఎకరాల్లో జామ తోటలు సాగవుతున్నాయి. మొత్తమ్మీద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దాదాపు 3 వేల ఎకరాల్లో తైవాన్ జామ సాగవుతోంది. ప్రస్తుతం ఎటాక్ అయిన వైరస్ తో ఇప్పటికే 300 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నాయి. రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ తెగుళ్ళు వస్తున్నట్లు తెలుస్తోంది. తైవాన్ జామ మొక్కలు నాణ్యమైనవి నాటడం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన నర్సరీల నుంచి కాకుండా బయట తెచ్చినవి నాటడంతో రక రకాల వైరస్ ల బారిన పడుతున్నాయి.
తెగుళ్లను తట్టుకోలేక తోటలు పాడవుతున్నాయి. దాంతో రైతులు తోటలను తొలగించాల్సి వస్తోంది. తాము పెట్టిన పెట్టుబడి కూడా రాలేదంటున్నారు రైతులు. జామ తోటల్లో పండు ఈగ దాడితో కాయలు పుచ్చిపోతాయి. అవి రాలిపడటంతో నేలలో నులి పురుగులు బాగా పెరిగిపోతున్నాయి. వీటితో తోటలు బాగా నష్టపోతున్నాయి. ఈ పండు ఈగ ప్రభావం చుట్టూ 10 కిలో మీటర్ల దాకా ఉంటోంది. దాంతో చుట్టుపక్కల తోటలు కూడా పాడవుతున్నాయి.
ఐదారు మండలాలకు కలిపి ఓ ఉద్యానశాఖాధికారి మాత్రమే ఉండటంతో రైతులకు అవగాహన కల్పించలేకపోతున్నారు. మొక్కలు తెచ్చేటప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య ఉండేది కాదంటున్నారు అధికారులు. తైవాన్ జామలో వచ్చే వైరస్ లను ముందే గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట దక్కించుకోవచ్చంటున్నారు అధికారులు. తోట నాటేటప్పుడే సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నాణ్యమైన మొక్కలను ప్రభుత్వ గుర్తింపు ఉన్న నర్సరీల నుంచే తెచ్చుకోవాలని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వార్తల కోసం