వ్యూహాత్మక దౌత్య అడుగులు : డా. బుర్ర మధుసూదన్​ రెడ్డి

వ్యూహాత్మక దౌత్య అడుగులు : డా. బుర్ర మధుసూదన్​ రెడ్డి

భారత 14వ ప్రధానమంత్రిగా  నరేంద్ర మోడీ  సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా, విలక్షణ రీతిలో దేశ హితం కోరి తనదైన విభిన్నమైన విదేశాంగ విధానాన్ని  ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. భూటాన్‌‌తో మొదలై నేపాల్‌‌, మయన్మార్ లాంటి‌‌ పొరుగు దేశాల్లో పర్యటించి, మిత్రత్వాన్ని  పొంది విమర్శకుల నోళ్లు మూయించారు. తొలి రెండేళ్లలోనే యుఎస్‌‌, రష్యా, చైనా, ఫ్రాన్స్‌‌, జపాన్‌‌, జర్మనీ లాంటి దేశాలతో సంబంధాలను పటిష్ట పరచడంలో కృతకృత్యులయ్యారు. 41 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఇండో– -ఆఫ్రికన్‌‌ సమిట్‌‌ను 2015లో నిర్వహించి తన సత్తా చాటుకున్నారు. బరాక్‌‌ ఒబామా, డొనాల్డ్‌‌ ట్రంప్ లతో చేతులు కలిపి అమెరికాతో సంబంధాలను మరింత మెరుగుపరచి వ్యాపార వాణిజ్యాలు పెంచారు, హిందూ మహాసముద్రంలో చైనా ప్రవేశించకుండా తన చతురతను ప్రదర్శించి పాకిస్థాన్‌‌ను ఏకాకిని చేయడంలో విజయం సాధించారు. పాక్​, చైనాలు దగ్గరయితే జరిగే ప్రమాదాన్ని పసిగట్టిన మోడీ, చైనా తలపెట్టిన బెల్ట్ రోడ్‌‌ను వ్యతిరేకించారు. పాకిస్థాన్‌‌ను చైనాకు, యూఎస్‌‌కు దగ్గర కాకుండా ఏకాకిని చేయడంలో నరేంద్రుడి చాణక్య నీతి అర్థం అవుతుంది. చైనాకు దగ్గర కాకుండా జపాన్‌‌, వియత్నామ్‌‌, తైవాన్‌‌ లాంటి దేశాలు భారత్​ వైపు చూసేలా పథక రచన చేశారు. పాకిస్థానీ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కట్టడి చేయటానికి భారత‌‌ సాయుధ దళాలకు మోదీ ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చింది. యూరీ/పుల్వామా దుర్ఘటనకు ప్రతీకారంగా పాకిస్థానీ బాలాకోట్‌‌ పై సర్జికల్‌‌ ఎయిర్‌‌ స్ట్రైక్‌‌‌‌ నిర్వహించి దాదాపు 200లకు పైగా ఉగ్రవాదులను, స్థావరాలను, ముఖ్య నేతలను మట్టుపెట్టగలిగారు. ఆర్టికిల్‌‌ 370ని రద్దు చేసిన మోడీ ఉగ్రవాదులకు, పాకిస్థాన్‌‌కు గట్టి జవాబు చెప్పగలిగారు.  2017లో డోక్లామ్‌‌ ప్రాంతంలో చైనా సైన్యం నిర్మించ తలపెట్టిన రోడ్డును ప్రతిఘటించి “ఆపరేషన్‌‌ జుపీటర్‌‌”లో భాగంగా చైనాను 
నిలువరించగలిగారు. 

మోడీ 2.0  పాలనలో విదేశీ విధానం

రెండవ టర్మ్‌‌ ప్రధానమంత్రిగా పదవి చేపట్టగానే బంగ్లాదేశ్‌‌, అఫ్ఘానిస్థాన్‌‌ దేశాలను పర్యటిస్తూ ఆశ్చర్యకరంగా పాకిస్థాన్‌‌లో కూడా ఆకస్మికంగా‌‌ పర్యటించి అందరి అంచనాలను తలకిందులు చేశారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో తొలిసారి ‘ఇండియా ఫస్ట్‌‌’ అనే భావనకు ప్రాధాన్యం ఇవ్వడంతో జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలతో కూడిన విదేశాంగ విధానానికి చొరవ చూపారు. ఆత్మవిశ్వాసం నిండిన ఇండియాకు పునాదులు వేయడంతో మోడీ విదేశాంగ విధానానికి గట్టి పునాదులు వేశారు. దేశ విదేశాంగ విధానాలతో భారత ఆర్థిక సంబంధాలు మెరుగుపడ్డాయి. క్వాడ్‌‌కూటమితో మొదలు, ఐ2యు2 , జి20, బ్రిక్స్  కూటమి, జి20 కూటమి, షాంగై కోఆపరేషన్‌‌ ఆర్గనైజేషన్  కూటమి వరకు భారత్‌‌ తనదైన ప్రత్యేకతను, ప్రాధాన్యాన్ని పొందడంతో సఫలీకృతం అయ్యింది. నేడు జి20 కూటమి అధ్యక్ష బాధ్యత ఇండియా ప్రధాని మోడీ చేతుల్లోకి రావడం గమనార్హం. యూఎన్​వో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అనేక దేశాలు తమ సమ్మతిని వెల్లడిస్తూనే ఉన్నాయి.  పలు దేశాలు అనేక సందర్భాల్లో మోడీ అభిప్రాయానికి విలువను ఇవ్వడం భారత్‌‌కు శుభ పరిణామం. ఒకనాడు మెతక వైఖరి ప్రకటిస్తూ వచ్చిన భారత్​ నేడు తనదైన నిర్దిష్ట విధానాన్ని ధైర్యంగా ప్రకటించగలుగుతున్నది. 2017లో మోదీ తొలిసారి డోక్లాం లోయలో అడుగు పెట్టిన తరువాత గత్యంతరం లేని పరిస్థితుల్లో చైనా వెనకడుగు వేయడం, గల్వాన్‌‌ లోయ దుర్ఘటన అనంతరం చైనా తన దురాలోచనకు చరమగీతం పాడి దారికి రావడం చూసాం. చైనాను ఎదిరించడంలో సఫలమైన ఇండియాను చూసిన విదేశాలు భారత్​తో  మర్యాదను పాటిస్తున్నాయి. కొవిడ్‌‌ విపత్తు కల్లోలంలో ప్రపంచ దేశాలకు  65 మిలియన్ల కొవిడ్‌‌ టీకా డోసులను 100కు పైగా దేశాలకు అందించిన మోడీ, అంతర్జాతీయ స్థాయిలో మానవతా మూర్తిగా అవతరించడం “ఫార్మసీ ఆఫ్‌‌ ది వరల్డ్‌‌”గా పేరు 
తెచ్చుకోవడం భారతీయులకు గర్వకారణం.

ఉక్రెయిన్ - రష్యా యుద్ధ కాలంలోనూ..

ఉక్రెయిన్‌‌పై రష్యా యుద్ధ  కాలంలో ఇండియా  రష్యాపై ఎలాంటి ఆంక్షలు విధించకుండా వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూనే, యుద్ధాన్ని ఆపాలని నిర్మొహమాటంగా  చెప్పడం మోడీ సామర్థ్యాన్ని తెలియజేసింది. గత ఇండియా వలె అంతర్జాతీయ నియమాలను పాటించే ‘రూల్‌‌ ఫాలోయింగ్‌‌’ దేశంగా కాకుండా నేటి ఇండియా నియమాలను నిర్ణయించే ‘రూల్‌‌ మేకింగ్‌‌’ స్థాయికి ఎదగడంలో మోడీ పాత్ర అనన్య సామాన్యం, అద్వితీయం. మోడీ పాలన ఇలాగే కొనసాగితే ఐరాసలో భారత్​ శాశ్వత సభ్యత్వం పొందడానికి ఎంతో కాలం పట్టదు.

- డా. బుర్ర మధుసూదన్​ రెడ్డి
సోషల్​ ఎనలిస్ట్​