కథ..వ్యూహం : నల్లపాటి సురేంద్ర

కథ..వ్యూహం : నల్లపాటి సురేంద్ర

‘‘అయ్య గారు ! ఈసారి సర్పంచ్ ఎన్నికలలో మనం ఓడిపోయేలా ఉన్నాం”  ఆ మాట వినగానే ఊగుతూ ఉన్న కుర్చీని ఒక్కసారిగా తన ఒంటి చేత్తో ఆపాడు సిద్ధయ్య.
‘‘అవును అయ్యా.. ఈసారి మన ఓటమి ఖాయం. జనం మనతో అలసిపోయారు. ఇప్పుడు మనకు పోటీగా కొత్త నీరు వచ్చేస్తోంది’’ అన్నాడు సిద్ధయ్య అనుచరుడు గంగులు.అంటే నా ఇరవై ఏళ్ల కుర్చీకి బీటలు పడ్డాయా?” అంటూ తన కుర్చీని తేరిపార చూసుకుంటూ నిట్టూర్చాడు సిద్ధయ్య.

అప్పటిలా లేరయ్య జనాలు. ఏదయినా ప్లాన్ వేసి గెలవాలి తప్ప, ప్రచారం చేసినా కూడా మనకు ఇప్పుడు ఫలితం పెద్దగా ఉండదు’’ అన్నాడు అక్కడే ఉన్న ఒక అనుచరుడు. ఇంతలో మరో అనుచరుడు పరిగెత్తుకుంటూ వచ్చి మరో దావానలం లాంటి వార్తను సిద్ధయ్య చెవిన పడేసాడు.అయ్యా.. మన అమ్మాయి గారు ఊరి పంపు సెట్టు దగ్గర కనిపించారు. రిక్షా తొక్కే రామయ్య కొడుకు ఉన్నాడు కదా.. ఆ కుర్రాడి బండి ఎక్కడం చూసా. వాళ్లిద్దరూ నవ్వుకుంటూ ఒకే మోటార్ సైకిల్ మీద మసీదు వీధిలో తిరుగుతున్నారు” అని చెప్పాడు..


ఇదే మాట ఎలక్షన్ ముందు విని ఉంటే రక్తం పొంగి పోయేది సిద్ధయ్యకి. కానీ ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి.. ఆచి తూచి అడుగులు వేయాలి అనుకున్నాడు.
ఇంతలో కూతురు ఐశ్వర్య ఇంటికి వచ్చింది.ఏమ్మా.. దారిలో బండి ఆగిపోయిందా !” అని అడిగాడు.అవును నాన్న. నా బండి ఖరాబ్ అయితే..  దారిలో ఓ మెకానిక్ కనబడి సాయం చేసాడు. నా బండిని తనే రిపేర్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఎంతకీ రిపేర్ కాలేదు. దీంతో మన బండిని గ్యారేజ్ దాకా తోసుకుంటూ వెళ్లాం. చివరికి నాకు లేట్ అవుతుందని అతని బండి మీద ఇంట్లో దిగ బెట్టాడు. రేపు బండిని ఇంటికే తెచ్చి ఇస్తాడు” అంటూ జరిగిన విషయాన్ని చెప్పింది ఐశ్వర్య.
‘‘సరే అమ్మా.. నువు నీ గదిలోకి వెళ్ళు” అంటూ తన కూతురిని పంపేశాడు సిద్ధయ్య.

తర్వాత తన వాళ్ళ వైపు తిరిగి ‘‘చూసారా.. నా ఐశ్వర్యకి ఆ మెకానిక్ ఎవరో కూడా తెలియదు. అతడు రిక్షా తొక్కే రామయ్య కొడుకని కూడా తెలియదు. కానీ మెకానిక్ పని చేసే రామయ్య కొడుకు సత్యంకి తెలుసు ఆమె సర్పంచ్ కూతురు అని. అందుకే నా మీద గౌరవంతో, భయభక్తులతో నా బిడ్డకు సాయం చేసాడు. ఇలాంటి భయ భక్తులే మన ప్రజలకు మరో అయిదేళ్ళు ఉండాలి. అంటే.. మనం ఏం చేయాలో? ఎలా చేయాలో?  మీకు చెప్తాను. అది ఫాలో అయిపోండి చాలు’’ అంటూ తన అనుచర గణానికి చెప్పాడు సిద్ధయ్య.

మెకానిక్ సత్యం తెల్లారి నిద్ర లేచి పని చేసుకోవడానికి తన గ్యారేజీలోకి వెళ్ళాడు. కానీ, అక్కడే ఊహించని సంఘటన ఎదురైంది. గ్యారేజీ బయట పార్క్ చేసి ఉంచిన ఐశ్వర్య బండి మంటల్లో కాలిపోతూ కనిపించింది. ‘‘ఈ పని ఎవరు చేసారో’’ అతడికి ఏ మాత్రం అర్థం కాక భయభ్రాంతులకి గురయ్యాడు.

ఈ విషయం సర్పంచ్ సిద్ధయ్యకి తెలిసి వెంటనే గ్యారేజీకి కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. సర్పంచ్ సిద్ధయ్యను చూడగానే మెకానిక్ సత్యం బదులిచ్చాడు ‘‘సార్. ఈ ఘోరం ఎలా జరిగిందో ఏమిటో అసలు అర్థం కావడం లేదు. ఎవరో కావాలనే ఈ పని చేసారు’’ అన్నాడు.
‘‘ఇది మీ కుట్ర అని మాకు బాగా తెలుసు. మీ బండికి మీరే నిప్పు పెట్టుకొని, ఆ నేరాన్ని ప్రతిపక్ష నాయకుల మీద తోసేయాలనే కదా మీ ప్లాన్” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చాడు చాముండి. సిద్ధయ్యకి ఆ ఊరిలో ప్రత్యర్థి ఎవరైనా ఉన్నాడంటే అది చాముండి ఒక్కడే. అతడి పూర్తి పేరు చాముండేశ్వర రావు.
‘‘ఇలాంటప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడానికి సిగ్గుగా లేదటయ్యా చాముండీ. అసలు నాకు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నా కూతురికి మరో బండి కొనివ్వగలను. అయినా మీకు సంబంధం లేని సమస్య ఇది. మా తిప్పలేవో మేము పడతాం. మీరు మీ ఇంటికి వెళ్ళండి” అంటూ చాముండి పై తన అసహనాన్ని వెళ్లగక్కాడు సిద్ధయ్య.  

అవును.. నిజమే చెప్పావు. నువ్వు రావాల్సిన పనే లేదు. బండి ఏం ఖర్మ. రేపు పొద్దున్న ఊళ్లో మనుషులకు నిప్పు పెట్టినా కూడా నువ్వు రావు. ఈ ఊళ్లో ఇప్పటికి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు వచ్చావా నువ్వు? ఈ రోజు నీ కూతురి బండికి నిప్పు అంటుకుందని ఎగేసుకుంటూ వచ్చావు. ఎవడి నొప్పి వాడిది ? నీకున్న నొప్పులే ఊళ్లో వాళ్లకి కూడా ఉంటాయి. ముందు ఆ విషయం తెలుసుకో’’ అంటూ రెచ్చిపోయాడు చాముండి.
‘‘చాముండి.. ఇది రాజకీయ వేదిక కాదు” అంటూ బదులిచ్చాడు సిద్ధయ్య.

అయితే ఎందుకు వచ్చావు? నీ బండికి గ్యారేజీలో నిప్పు అంటుకుంది. కాబట్టి.. మెకానిక్ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి వచ్చావా? ఆ బండి ఖరీదు ఎంతో చెప్పు. మేము ఇస్తాం. అంతే గానీ మా సత్యం జోలికి మాత్రం రాకు”అంటూ ఎదురుతిరిగారు చాముండి అనుచరులు.
‘‘ఏమయ్యా.. అసలు మతి ఉండే మాట్లాడుతున్నారా. నిప్పుల్లో కాలిపోయింది మా బండి. ఆ బండికి మేము ఇన్సూరెన్స్ ఎప్పుడో చేయించాం. కనుక మెకానిక్ సత్యం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీ బుద్ది ఎప్పటికీ మారదు. మీకు ఎప్పుడూ రాజకీయాలు మాత్రమే కావాలి. ఆ రాజకీయాలతో తిమ్మిని బొమ్మిని చేసి, మమ్మల్ని ఇరుకున పెట్టాలని చూస్తారు. ఏమన్నారు? డబ్బులిస్తారా? మీ డబ్బు ఎవరికి కావాలి?

నిజానికి నా కూతురికి కావాల్సింది తల్లి ప్రేమ. అది మీరు తెచ్చి ఇవ్వగలరా? ఇదే బండి మీద వెళ్తూ నా భార్య యాక్సిడెంటులో చనిపోయింది. అప్పుడే ఈ బండిని నేను తగలెట్టేదామనుకున్నా. కానీ నా బిడ్డ ఒప్పుకోలేదు. ఈ బండిని తాను తన తల్లికి గుర్తుగా ఉంచుకోవాలి అనుకుంది. అందుకే ఎన్ని రిపేర్లు వచ్చినా బాగు చేయిస్తూ, ప్రేమగా చూసుకొనేది. తన తల్లి చివరి జ్ఞాపకం అని ఆ బండి మీదే రోజూ కాలేజీకి వెళ్ళేది మా ఐశ్వర్య. ఈ రోజుతో ఆ జ్ఞాపకం కూడా మంటల్లో కలిసిపోయింది’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధయ్య. 

ఐశ్వర్య కూడా మంటల్లో బూడిద అయిపోయిన తన బండిని ఓసారి ప్రేమగా తాకి అక్కడి నుండి వెళ్లి పోయింది. ఊరి జనం ఆమెని అలా చూస్తూ ఉండిపోయారు. ‘‘పాపం.. ఆ బిడ్డ తన తల్లి కోసం ప్రేమగా దాచుకున్న జ్ఞాపకం అది. ఆఖరికి మంటల్లో కలిసిపోయింది” అని మాట్లాడుకున్నారు.
కానీ ఇంతలోనే మరో అవాంతరం వచ్చి పడింది. మెకానిక్ సత్యం ఐశ్వర్యను తన బైక్ మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు ఎవడో వీడియో తీసాడు. ఆ వీడియోని ఇప్పుడు ఆ ఊరి వాట్సాప్ గ్రూపులో వదిలాడు. దీంతో ‘‘సందట్లో సడేమియా” అన్నట్టు ‘‘బండి”టాపిక్ మర్చిపోయి. ఈ ‘‘వీడియో’’ టాపిక్ ఊర్లో ట్రెండ్ అయ్యింది. ఆ వీడియో చూసి ఊర్లో ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

ఒరే సత్యం. మనం ఏమిటో తెలుసుకుని నువ్వు ప్రవర్తించాలి. అంతే తప్ప, నువ్వు సర్పంచ్ గారి అమ్మాయిను ప్రేమించడం ఏమిట్రా?! మన హద్దులలో మనం ఉండాలి” అంటూ సత్యాన్ని కోపగించుకున్నాడు తండ్రి.అలాంటిది ఏమి లేదు నాన్న” అంటూ ఆ మాటలను కొట్టి పారేశాడు సత్యం.
‘‘మొత్తానికి పెద్దింటి అమ్మాయినే లైన్లో పెట్టావ్. నువ్వు సూపర్ మామా” అంటూ మరో వైపు సత్యాన్ని మోసేయసాగారు అతడి స్నేహితులు.
‘‘అదేం లేదు” అని వాళ్లకి అర్ధమయ్యేలా చెప్పేసరికి సత్యానికి తల ప్రాణం తోకకి వచ్చింది.

ఒకరోజు ఎక్కడ నుండో నలుగురు వ్యక్తులు ఊరికి వచ్చారు. వాళ్లు ముసుగు వేసి మరీ సత్యాన్ని కొట్టారు. సత్యం స్నేహితులు వాళ్లని ఆపాలని ట్రై చేశారు. కానీ దుండగులు కత్తులతో బెదిరించడంతో వాళ్లు వెనక్కి తగ్గారు. కొద్ది సేపటి తరువాత ఆ దుండగులు పరార్ అయ్యారు.
ఏదేమైనా ‘‘సత్యం, ఐశ్వర్య’’ ఈ రెండు పేర్లు ఊళ్లో హాట్ టాపిక్ అయ్యాయి. పెద్దగా పరిచయం లేని ‘‘ఓ అమ్మాయి.. అబ్బాయిని” ఆ ఊరి జనాలే తమ ఊహల్లో ప్రేమికులను చేసేసారు. సర్పంచ్ ఈ మొత్తం వ్యవహారంలో అయోమయానికి గురయ్యాడు. అందుకే వీలైనంత త్వరగా కూతుర్ని పట్నం పంపించేయాలని అనుకుంటున్నాడని ఊర్లో వాళ్లు అనుకోసాగారు.

చాముండి మాత్రం ఈ ‘‘సత్యం – ఐశ్వర్య’’ల వ్యవహారాన్ని తన రాజకీయ లబ్దికి వాడుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అందుకే పక్కా ప్లాన్ వేసాడు.
‘‘ఒక కులం అబ్బాయి.. మరో కులం అమ్మాయిని ప్రేమిస్తే చంపాలని చూస్తారా? మనం ఇలా వదిలేస్తే రేపు ఈ ఊళ్లో ఏ ఒక్క యువకుడూ ప్రాణాలతో ఉండడు. కనుక ఆ సర్పంచ్ దగ్గరకే పోదాం. ఆయన ఇంటి ముందే తాడో పేడో తేల్చుకుందాం’’ అంటూ ఊళ్లోని కుర్రకారుని రెచ్చగొట్టి సర్పంచ్ ఇంటికి బయలుదేరాడు చాముండి.
ఆ ఊరి కుర్రాళ్లలో చాలామందికి అప్పటికే ఆ పల్లెలో చాలా ప్రేమ కథలు ఉన్నాయి. దాంతో చాముండి ప్లాన్ తమకు కూడా బాగా కలిసొస్తుందని అతనితో కలిసి బయలుదేరారు వాళ్లంతా. ఊళ్లోని కుర్రకారు అంతా సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించడంతో .. అక్కడ పెద్ద రభసే జరిగింది.‘‘ప్రేమిస్తే చంపేయాలని చూస్తారా?” అంటూ యువకులు నినాదాలు చేయసాగారు.

ఇది చాముండి ఆడుతున్న నాటకంలా ఉంది. కావాలని ఓ పుకారు పుట్టించాడు. తర్వాత తన మనుషులతో తానే సత్యాన్ని కొట్టించి ఇప్పుడు ఏమీ తెలియనట్లు అందరినీ ఇక్కడకి తీసుకొచ్చాడు” అని తమలో తామే గుసగుసలు ఆడుకోసాగారు సత్యం స్నేహితులు. జనం కూడా ఈ యవ్వారం ఎంతవరకు పోతుందో చూద్దామని ఆసక్తితో ఉన్నారు.

ఇంతలో ఐశ్వర్య అక్కడికి వచ్చింది. చాముండి ఆమె వైపు కోపంగా చూస్తూ ‘‘ఐశ్వర్య..! సత్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసుకొని మీ నాన్న అతన్ని చంపించబోయాడు. దీనికి నీ సంజాయిషీ ఏమిటి?’’ అంటూ గద్దిస్తూ అడిగాడు.  నేను సత్యాన్ని ప్రేమించడం ఏమిటి? నేను అతన్ని చూసిందే రెండు సార్లు. కేవలం ఒక అమ్మాయి.. ఓ అబ్బాయి బైక్ ఎక్కితే వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లేనా? ఇలా ఆలోచించడమేనా మీ పెద్దరికం?” అని ఐశ్వర్య అడిగేసరికి కంగుతిన్నాడు చాముండి.
అప్పుడే అక్కడికి వచ్చిన సర్పంచ్ సిద్ధయ్య కూడా చాముండిని నిలదీశాడు. ‘‘ఉన్నవి, లేనివి చెప్పి ప్రజలకు నా మీద నమ్మకం పోయేలా చేయడమేనా మీ పని. మీలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే నాకు క్షణం చాలు’’ అనడంతో చాముండి నిర్ఘాంతపోయాడు.

అయినా ధైర్యం తెచ్చుకొని చాముండి సిద్ధయ్యతో వాదించడం మొదలుపెట్టాడు. ‘‘ఏం సిద్ధయ్య.. నీ కూతురు సత్యంతో కలిసి మసీదు వీధిలో ఒకే బైక్ మీద తిరగడం నిజం కాదా? ఆ వీడియో ప్రస్తుతం ఊరంతా వైరల్ అవుతోంది. వారిద్దరి మధ్య అంత చనువు లేకపోతే ఎందుకు ఇద్దరూ నవ్వుతూ ఒకే బండి మీద వెళ్తారు? అలాగే ఎవరో రౌడీలు వచ్చి ఎందుకు సత్యాన్ని చితకబాదుతారు? ఆ రౌడీలు ఎవరో కనుక్కోమని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు దొరకనీ.. నీ బండారం బయటపడుతుంది” అన్నాడు.

ఆ.. ఎవరి బండారం బయట పడుతుందో చూద్దాం. నేను కూడా నా కూతురి స్కూటీని తగలబెట్టినవాడిని పట్టుకోమని పోలీసులకు కంప్లైంట్ చేశా. ఆ స్కూటీని తగలబెట్టిన వాళ్లే సత్యాన్ని కూడా కొట్టి ఉంటారు. ఈ పని చేసిన వాళ్లు దొరికితే.. అప్పుడు తెలుస్తుంది జనాలకు కూడా నువ్వు ఎంత మోసగాడివో” అని బదులిచ్చాడు సిద్ధయ్య. ఆ తర్వాత వెళ్లి రచ్చబండ దగ్గర కూర్చుఈన్నాడు. కొద్ది నిమిషాలు అయ్యాక.. ఏదో గుర్తుకొచ్చినవాడిలా తల పైకెత్తి జనాల వైపు చూశాడు సిద్ధయ్య. 
‘‘ప్రజలారా.. ఈ రోజు మీ అందరికీ నేను సంజాయిషీ చెప్పుకొనే రోజు వచ్చింది. అలాగే నా కూతురి మీద కూడా ఓ మచ్చ పడింది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కటే. మెకానిక్ సత్యాన్ని నా కూతురికి ఇచ్చి పెళ్ళి చేయడం.

నేను ఇప్పటికీ ఒకటే నమ్ముతా. కులం, మతం.. ఈ రెండూ మనం మన స్వార్థం కోసం పెట్టుకున్నవి. నాకు వాటితో పని లేదు. అలాగే సత్యం కూడా ఏమీ చదువు లేని వ్యక్తి కాదు. అతడి తండ్రి రిక్షా కార్మికుడైనా, కష్టపడి చదువుకొని.. ఆ తర్వాత ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌‌లో పాలిటెక్నిక్ చేసి సొంత ఊళ్లోనే గ్యారేజీ పెట్టుకున్నాడు. అతనిలో కష్టపడి పనిచేసే గుణం ఉంది. కనుక అతడు నిజాయతీపరుడనే నేను అనుకుంటున్నా. కానీ ఇవన్నీ నేను చెప్తే సరిపోదు. నా కూతురికి, సత్యానికి ఇష్టమైతేనే ఈ పెళ్ళి జరుగుతుంది” అన్నాడు. ఆ తర్వాత ‘‘ఏం నీకు సమ్మతమేనా” అన్నట్లు కూతురి వైపు చూశాడు సిద్ధయ్య. ఆమె మౌనంగా తల దించుకుంది. దీంతో ఆమెకు ఇష్టమేనని నిర్ధారించుకున్నాడు.

ఏదేమైనా.. ఎవరూ ఊహించని విధంగా సిద్ధయ్య తీసుకున్న నిర్ణయానికి చాముండి కంగుతిన్నాడు. అలాగే ఊళ్లోని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సిద్ధయ్య తన బండి మీద కూతుర్ని ఎక్కించుకొని సత్యం ఇంటికి వెళ్లాడు. వాళ్లు ఇంటికి వెళ్లేసరికి బయట సత్యం తండ్రి రామయ్య రిక్షా తుడుచుకుంటూ కనిపించాడు. ఆ ఇంటి వసారాలోనే సత్యం మంచం మీద పడుకొని ఉన్నాడు.

సిద్ధయ్య రామయ్యను పలకరిస్తూ ‘‘రామయ్యా.. ఎలా ఉన్నావు? నీ కొడుకుని నా కూతురికి ఇచ్చి పెళ్ళి చేయమని అడగడానికి వచ్చాను. అదీ నీకు అభ్యంతరం లేకపోతేనే?” అనడంతో రామయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తర్వాత సత్యం కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవడంతో.. ఐశ్వర్యతో అతడి వివాహం వారం రోజులలోనే జరిగిపోయింది.

ఐశ్వర్యతో సత్యం పెండ్లయిన ఓ ఆరు నెలల తర్వాత సిద్ధయ్య తన ఫార్మ్ హౌస్‌‌లో ఫ్రెండ్​తో కలిసి మాట్లాడుతున్నప్పుడు ‘‘ఏం.. సిద్ధయ్య ! ఎందుకు ఎవరూ ఊహించని పని చేశావు? నీ కూతురిని ఆ మెకానిక్‌‌కు ఇచ్చి పెండ్లి చేయాలని ఎందుకు అనిపించింది?” అని ఆ ఫ్రెండ్ అడిగాడు.
‘‘మిత్రమా.. అదే చాణక్య నీతి అంటే. ఒక సమస్యను పరిష్కరించాలంటే అప్పుడప్పుడు నాయకుడు అనేవాడు తన జీవితంలోకి నాటకీయతను కూడా చొప్పించగలగాలి. అంతా సవ్యంగానే జరుగుతుందని తన తోటివారిని అదే నాటకీయత ద్వారా నమ్మించగలగాలి. ముఖ్యంగా రాజకీయంలో ఇది చాలా అవసరం. మరీ ముఖ్యంగా ప్రజలను కూడా తన నాటకీయతలో భాగం చేయడం నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య కావాలి. చాణుక్యుడు చేసింది అదే. నేను కూడా అతన్నే అనుసరించాను. 

నీకు మెకానిక్ సత్యం గురించి చాలా తక్కువ తెలుసు. నేను అతన్ని పూర్తిగా చదివా. పేరుకి మెకానిక్ అయినా అతడిలో ఓ గొప్ప టాలెంట్ ఉంది. తక్కువ పెట్రోల్‌‌తో ఎక్కువ మైలేజీ ఇచ్చే మోటార్ బైక్స్ తయారుచేయడంలో అతడు దిట్ట. తను డిజైన్ చేసిన ఓ ప్రాజెక్టుకి ఈ మధ్యే పేటెంట్ కూడా వచ్చింది. మరో నెల రోజుల్లో అతడు100 కోట్ల రూపాయల డీల్ చేయబోతున్నాడు. కానీ ఆ ప్రాజెక్టు మొదలుపెట్టాలంటే మొదట 50 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. ఎన్ని బ్యాంకులు తిరిగినా అతడికి ఆ అప్పు పుట్టలేదు. దీంతో నన్ను కలవడానికి వచ్చాడు.

నేను అతడికి ఒకటే చెప్పాను. నా కూతురిని పెళ్ళి చేసుకుంటేనే నేను ఆర్థిక సాయం చేస్తానన్నా. అతడు విధి లేక ఒప్పుకున్నాడు. అతడు ఒప్పుకున్నాడు కాబట్టి.. అతనికి మరో రెండు పనులు పురమాయించా. అందులో ఒకటి నా కూతురితో పరిచయం పెంచుకోవడం.. ఆమెతో కలిసి ఉన్న వీడియోలు లీక్ చేయడం.. ఆ తర్వాత ఆమె బైక్ తగలబెట్టడం.. అలాగే తన మీద ఊరి ప్రజలకి జాలి కలిగేందుకు రౌడీల చేత దెబ్బలు తిన్నట్టు నటించడం. ఈ పనులన్నీ అతడు దిగ్విజయంగా పూర్తి చేశాడు. తర్వాత నా కూతురికి బ్రెయిన్ వాష్ చేశా. కాబోయే కోటీశ్వరుడే భర్తగా లభిస్తున్నప్పుడు.. కులం, మతం.. ఇలాంటి వాటిని పట్టించుకోనవసరం లేదని ఆమెతో చెప్పా. దీంతో ఆమె కూడా పెళ్లికి ఒప్పుకుంది.

ఈ కథను రాసిందే నేను. ఈ కథను నడిపిందే నేను. ఈ కథలో ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు ఊహించుకుని చాముండి ప్రజలను నా మీద రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దానికి నేను ఒక్కమాటతో అడ్డుకట్ట వేసేశా. నా కులానికి చెందని వ్యక్తిని అల్లుడిగా చేసుకుంటున్నానని ప్రజలను నమ్మిస్తూ.. ఇప్పుడు వారి ఓట్లు మొత్తం కొల్లగొట్టబోతున్నా” అంటూ దర్జాగా మీసం తిప్పాడు సిద్ధయ్య.సిద్ధయ్య.. నువ్వు మామూలోడివి కాదు. ఏం ప్లాన్ చేశావయ్యా” అన్నాడు అతడి మిత్రుడు.

ఫోన్ : 9490792553