
- స్టెరిలైజేషన్ పేరున ఇప్పటికే రూ.2.21 కోట్లకుపైగా ఖర్చు
- అయినా తగ్గని కుక్కల సంఖ్య
- ఆపరేషన్లు చేస్తున్నా కంట్రోల్ కాని వైనం
- ఏటా వేసవిలో పెరుగుతున్న డాగ్ బైట్ కేసులు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ లో కుక్కల సమస్యకు ఫుల్ స్టాప్ పడటం లేదు. కుక్కల నియంత్రణకు బల్దియా రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా, వాటి సంఖ్య మాత్రం కంట్రోల్ కావడం లేదు. ఆపరేషన్లకు ఒకటి మాత్రమే యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) ఉండటం, మరోటి ప్రతిపాదనలకే పరిమితం కావడంతో ఓ వైపు స్టెరిలైజేషన్ చేయిస్తుంటే, మరో వైపు కుక్కల సంతానోత్పత్తి పెరుగుతూనే ఉంది. ఫలితంగా గ్రేటర్ స్ట్రీట్ డాగ్స్ సమస్య పరిష్కారం కావడం లేదు. ఇప్పటికే నగరంలో తరచూ డాగ్ బైట్ కేసులు దడపుట్టిస్తుండగా, ఏటా వేసవిలో వాటి దాడులు ఎక్కువవుతుండటం కలవరానికి గురి చేస్తోంది.
ఐదేండ్లలో రూ.2.21 కోట్లు
వరంగల్ ట్రై సిటీలో కుక్కల సమస్య తీవ్రంగా ఉండటంతో 2018లో గ్రేటర్ పరిధి చింతగట్టు సమీపంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నచోట్ల నుంచి వాటిని పట్టుకెళ్లి, స్టెరిలైజేషన్ చేయడం, వాటికి మూడు రోజులపాటు ఆహారం అందించి వ్యాక్సిన్లు ఇవ్వడం తదితర పనుల బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. కానీ, 2018లో నామమాత్రంగానే స్టెరిలైజేషన్ ప్రక్రియ జరగగా, అప్పట్లో స్టెరిలేజేషన్ ప్రక్రియ పూర్తి చేసినందుకు ఒక్కో కుక్కకు మొదట్లో రూ.750 చొప్పున ఏజెన్సీకి చెల్లించారు.
ఆ తర్వాత ఏజెన్సీ డిమాండ్ మేరకు 2022 నుంచి రూ.850కి పెంచారు. ఇదిలాఉంటే చింతగట్టు సమీపంలో ఏర్పాటు చేసిన ఏబీసీ సెంటర్లో రోజుకు 22 నుంచి 25 కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించే అవకాశం ఉంది. ఇలా ఇప్పటివరకు నగరంలోని 26,916 కుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించారు. మొత్తంగా కుక్కల ఆపరేషన్ల కోసం రూ.2,21,23,800 ఖర్చు చేశారు. ఇంత ఖర్చు చేసినా కుక్కల సంఖ్య మాత్రం కంట్రోల్ కావడం లేదు.
పెరుగుతున్న సంఖ్య
ఓ వైపు స్టెరిలైజేషన్ జరుగుతున్నా, కుక్కల సంఖ్య పెరుగుతూ వస్తుండటం కలవరానికి గురి చేస్తోంది. గతంలో కుక్కల సమస్య నేపథ్యంలో నగర వ్యాప్తంగా వాటి సంఖ్యను లెక్కించగా 28 వేలకు పైగా ఉన్నట్లు తేలింది. దీంతో వాటికి ఆపరేషన్లు నిర్వహిస్తూ వస్తున్నారు. 2023 వరకు 21,036 కుక్కలకు ఆపరేషన్లు పూర్తి చేశారు. 2024లో మరోసారి కుక్కల లెక్కలు తీయగా, స్టెరిలైజేషన్ నిర్వహించాల్సిన కుక్కల సంఖ్య 28,460 ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా కుక్కల్లో 8 నుంచి 10 వారాల్లో సంతానోత్పత్తి ఉంటుందని, దీంతోనే వాటి సంఖ్య పెరుగుతూ వస్తోందని వెటర్నరీ ఆఫీసర్లు చెబుతుండటం గమనార్హం.
జనాలపై ఆగని దాడులు
క్షేత్రస్థాయిలో కుక్కలతో పాటు జనాలపై దాడులు కూడా పెరుగుతున్నాయి. నెలకు సగటున 500కుపైగా డాగ్ బైట్ కేసులు నమోదు అవుతుండగా, ఇక వేసవిలో వాటికి సరిగా నీరు, ఆహారం దొరక్క దాడుల సంఖ్య మరింత పెరుగుతున్నది. రెండేండ్ల కిందట యూపీ నుంచి వలస వచ్చిన ఓ కుటుంబం కాజీపేట రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉండగా, ఆ ఫ్యామిలీలోని ఏడేండ్ల బాలుడిని కుక్కలు కరిచి చంపేశాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు రెండు నెలల కిందట ఓ సిటీ కరెంట్ ఆఫీస్ సమీపంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కుక్కలు వెంబడించడంతో ఆయన కిందపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కుక్కల వల్ల ప్రాణాలు పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో నగరవాసులు కుక్కలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కుక్కల నియంత్రణకు ఒకటే ఏబీసీ సెంటర్ ఉండటం సమస్యగా మారగా, గతంలో ప్రతిపాదించిన మరో ఏబీసీ సెంటర్ కాగితాలకే పరిమితమైంది. అది కూడా అందుబాటులోకి వస్తే కుక్కల జనాభాను సాధ్యమైనంత వేగంగా నియంత్రించే అవకాశం ఉండగా, ఆదిశగా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు చొరవ తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
సమ్మర్ దృష్ట్యా స్పెషల్ ఫోకస్..
సమ్మర్ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ లో కుక్కల బెడదపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ స్పీడప్ చేయిస్తున్నాం. ఎండల దృష్ట్యా వాటికి నీటి సౌకర్యం కల్పించేందుకు ప్రతి డివిజన్ కు నాలుగు చోట్లా వాటర్ టబ్స్ఏర్పాటు చేస్తున్నాం. కుక్కల దాడులు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. - డా.రాజారెడ్డి, సీఎంహెచ్వో, జీడబ్ల్యూఎంసీ