గ్రేటర్ హైదరాబాద్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. మనుషులు కనిపిస్తే వెంట పడి కరిచేస్తు్న్నాయి.. పిల్లలు,పెద్దలు అని తేడా లేదు.. రాత్రి, పగలు అని తేడా లేదు.. బయట మనిషి కనిపిస్తే చాలు కరిచిపడేస్తున్నాయి. మొన్నటికి మొన్న నాలుగేళ్ల చిన్నారిని చంపేసిన ఘటన మరిచిపోకముందే.. కుత్బుల్లాపూర్ కొంపల్లిలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేశాయి. నడుచుకుంటూ వెళుతున్న వాళ్లపైనే కాదు.. బండ్లు, సైకిళ్లపై వెళుతున్న వాళ్లను వదలటం లేదు. బైక్స్, కార్ల వెంట పడుతున్నాయి కుక్కలు. కొంతమంది భయంతో బైక్ పై నుంచి కింద పడిపోతున్నారు. మరికొందరు ఎదురుతిరిగి కొట్టేందుకు ప్రయత్నించడంతో పారిపోతున్నాయి.
కుత్బుల్లాపూర్ కొంపల్లిలో ఒకే రోజు ఆరుగురిపై వీధి కుక్కల దాడిలో గాయపడటం కలకలం రేపుతుంది. రోజూ ఏదో ఒక చోట ఒకటీ అరా సంఘటనలు జరుగుతున్నా.. కొంపల్లిలో ఒకేసారి ఆరుగురిపై దాడి చేయటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బయటకు రావాలంటే కుక్కలు ఉన్నాయా లేవా అని చూసుకుని మరీ వస్తున్నారు జనం. వీధి కుక్కల దాడిపై జీహెచ్ఎంసీకి కంప్లయింట్స్ చేస్తున్నా పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇప్పటికే చాలా మందిని కరిచాయని.. అయినా పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు స్థానిక కొంపల్లివాసులు.