వృద్ధురాలిని చంపి పీక్కుతిన్న కుక్కలు

వృద్ధురాలిని చంపి పీక్కుతిన్న కుక్కలు
  •     అర్ధరాత్రి గుంపుగా  ఇంట్లోకి చొరబడి దాడి 
  •     గుర్తు పట్టరాకుండా  మారిన తల, మొండెం
  •     రాజన్నసిరిసిల్ల జిల్లా సేవాలాల్​ తండాలో దారుణం

ముస్తాబాద్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌‌ మండలం సేవాలాల్​తండాలో బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు ఓ వృద్ధురాలి ఇంట్లోకి వెళ్లి ఆమెపై దాడి చేసి దారుణంగా చంపేశాయి. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..తండాలో పిట్ల రాజలక్ష్మి(80) ఒంటరిగా ఉంటోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు. బుధవారం రాత్రి ఇంటి తలుపులు తెరిచి పడుకుంది. దీంతో అర్ధరాత్రి వేళ వీధికుక్కలు గుంపుగా చొరబడ్డాయి.

అన్నీ కలిసి నిద్రిస్తున్న రాజలక్ష్మి గొంతును చీల్చడంతో అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత రాజలక్ష్మి శరీర భాగాలను పీక్కు తిన్నాయి. ఉదయం ఆమె కొడుకులు, స్థానికులు వచ్చి చూడగా రాజలక్ష్మి చనిపోయి ఉంది. ఆమె తల, మొండెం గుర్తుపట్టకుండా మారిపోయాయి.  

రాయికల్​లో కుక్కల దాడి 

రాయికల్​: జగిత్యాల జిల్లా రాయికల్​ఒకటో వార్డుతో పాటు 8వ వార్డులో పలువురిపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో ఆకుల వెంకటమ్మ (65), పద్మ (42) ఆజారా(8)తో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. ఒకటో వార్డుకు చెందిన చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ కుక్క దాడికి యత్నించగా చిన్నారి అరిచింది. దీంతో స్థానికులు కుక్కను వెళ్లగొట్టి పాపను కాపాడారు. 8వ వార్డులో తోకల లక్ష్మీనర్సయ్య(52), లక్ష్మి(55), బద్దం రాజుబాయి (65) లను కుక్కలు కరిచాయి.   

బాలానగర్​లో  15 మంది చిన్నారులపై దాడి.. 

కూకట్​పల్లి/జీడిమెట్ల : కూకట్​పల్లి సర్కిల్​బాలానగర్​ డివిజన్ ​పరిధిలో గురువారం సాయంత్రం పిచ్చికుక్క రెచ్చిపోయింది. వరుసగా పదిహేను మంది పిల్లలపై దాడి చేసి గాయపరిచింది. మరికొందరు పెద్దలను కూడా కరిచినట్టు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించడం లేదు. బాలానగర్​ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం రవళిక(5), చైతన్య(8), మధు(9), గణేశ్​​(7)తో పాటు పదకొండు మంది పిల్లలు కుక్క కాటుకు గురై చికిత్స తీసుకున్నట్టు తెలిసింది.

మరికొందరిని నారాయణగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు తెలిసింది. గురువారం సాయంత్రం 5 గంటలకు బాలానగర్ ​పరిధిలోని వినాయకనగర్, రాజుకాలనీ, నవజీవన్​నగర్​ పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్న పిలల్లపై ఇదే కుక్క దాడి చేసి గాయపరిచింది. పిల్లలపై దాడి చేసిన కుక్కని పట్టుకోవటానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.