ప్రేమ కోసమై?
టైటిల్: పాపం పసివాడు
డైరెక్షన్ : లలిత్ కుమార్
కాస్ట్ : శ్రీరామ చంద్ర, రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీవిద్య మహర్షి, మ్యాడీ మనేపల్లి, అశోక్ కుమార్, సుజాత, శ్రీనివాస్
లాంగ్వేజ్ : తెలుగు
ప్లాట్ ఫాం : ఆహా
క్రాంతి (శ్రీరామ చంద్ర), డింపీ (గాయత్రి) కొన్నాళ్లు ప్రేమించుకుంటారు. ఓ రోజు క్రాంతి పెండ్లి చేసుకుందామని చెప్పగానే డింపీ ‘నో’ చెప్పి, లవ్ బ్రేకప్ చేసుకుంటుంది. దాంతో చాలా బాధపడతాడు. ఇంటి నుంచి వెళ్లిపోయి ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటాడు. అదే టైంలో ఓ పార్టీకి వెళ్లగా అక్కడ చారు (రాశీ సింగ్)ని చూసి లవ్‌లో పడతాడు. తాగిన మత్తులో తనతోపాటు అపార్ట్‌మెంట్‌కి వెళ్తాడు. కానీ.. ఆమె ప్లాట్ నెంబర్ తెలుసుకోకుండానే బయటికి వచ్చేస్తాడు. తిరిగి ఆ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి వెతికినా లాభం ఉండదు. కానీ.. ఆ కొద్ది టైంలోనే ఆమెతో ప్రేమలో పడతాడు క్రాంతి. అదే టైంలో ఇంట్లో వాళ్లు పెండ్లి చేసుకోవాలని ఫోర్స్ చేయడంతో ఓకే చెప్తాడు.
అలా అనూష (శ్రీవిద్య)తో క్రాంతి నిశ్చితార్థం జరుగుతుండగా ఊహించని విధంగా చారు ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? క్రాంతి తనను ప్రేమిస్తున్నట్టు చారుకు చెప్పాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సినిమాలో లవ్, బ్రేకప్ మరో అమ్మాయిని ప్రేమించడం.. ఇదంతా చూస్తుంటే ట్రాజెడీ స్టోరీలా ఉన్నా ఇది పక్కా కామెడీ స్టోరీ. కథలో ట్విస్ట్‌లు బాగున్నాయి. పెండ్లి సీన్ చాలామందికి కనెక్ట్ అవుతుంది. సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీరామచంద్ర ఇప్పుడు యాక్టర్‌గా కూడా మార్కులు కొట్టేశాడు.
ఇల్లు దక్కిందా?
టైటిల్ : కుమారి శ్రీమతి
డైరెక్షన్ : గోమఠేష్ ఉపాధ్యాయి
కాస్ట్ : నిత్యామెనన్, గౌతమి, తిరువీర్, నిరుపమ్, తాళ్లూరి రామేశ్వరి, ప్రణీత పట్నాయక్, ప్రేమ్ సాగర్, నరేష్, మురళీ మోహన్
లాంగ్వేజ్ : తెలుగు, హిందీ, తమిళం, మలయాళం
ప్లాట్ ఫాం : అమెజాన్ ప్రైమ్ వీడియో
రాజమహేంద్రవరం దగ్గర్లోని రామరాజులంకలో తల్లి దేవకి (గౌతమి), చెల్లి కల్యాణి (ప్రణీత పట్నాయక్), నాయనమ్మ శేషమ్మ (రామేశ్వరి)లతో కలిసి కుమారి ఇటుకలపూడి శ్రీమతి (నిత్యామెనన్) ఉంటుంది. ఆమె హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసి, ఓ రెస్టారెంట్‌లో ఫ్లోరింగ్ మేనేజర్‌గా13వేల రూపాయల జీతానికి పనిచేస్తుంటుంది. వాళ్ల కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన ఓ ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మనని తన తాతకు మాట ఇస్తుంది శ్రీమతి. కానీ.. ఆస్తి గొడవలు వచ్చి బాబాయి కేశవరావు (ప్రేమ్‌సాగర్) ఇంటిని లాగేసుకుంటాడు. దాంతో శ్రీమతి తన కుటుంబంతో కలసి వేరే ఇంట్లో అద్దెకు ఉంటుంది. కానీ.. ఇల్లు కోసం కోర్టులో కేస్ వేస్తుంది.
అలా18ఏళ్ల పాటు కోర్టులో కేసు నడిచిన తర్వాత వీలునామా దొరికిందని, దాని ప్రకారం ఇంటిని తనకే ఇవ్వాలని కేశవరావు కోర్టులో ఆధారాలు చూపిస్తాడు. కోర్టు ఇంటి విలువను38 లక్షలు రూపాయలుగా లెక్కగడుతుంది. ఆ డబ్బుని ఆరు నెలల్లో కేశవరావుకు ఇచ్చి ఇంటిని సొంతం చేసుకోవచ్చని శ్రీమతికి అవకాశం ఇస్తారు. దాంతో డబ్బు కోసం శ్రీమతి ఊళ్లో బార్ పెట్టాలి అనుకుంటుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఇంతకీ ఇల్లు దక్కించుకుందా? లేదా? తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాలి. కథలో పెద్దగా కొత్త దనం లేదు. కానీ.. కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి. నిత్యమెనన్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. కథ కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది.
మొదటి పోస్ట్‌మెన్
టైటిల్ : హర్కార
డైరెక్షన్ : రామ్ అరుణ్ క్యాస్ట్రో
కాస్ట్ : రామ్ అరుణ్ క్యాస్ట్రో, కాళీ వెంకట్, గౌతమి చౌద్రి, పిచైక్కారన్ మూర్తి, జయప్రకాష్ రాధాకృష్ణన్, నికోలా ఫుస్టే
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్ ఫాం : ఆహా
ఈసన్‌మలైలోని అందమైన పర్వతం మీద ఒక ఒంటరి గ్రామం ఉంటుంది. అక్కడి పోస్టాఫీసుకు కొత్తగా పోస్ట్‌మ్యాన్ కాళీ(కాళీ వెంకట్) వస్తాడు. అతను లెటర్లు పంచడానికి రోజూ కొండ ఎక్కాల్సి వస్తుంది. అక్కడివాళ్లంతా పోస్టాఫీసులోని బ్యాంక్ సర్వీసులు కూడా వాడుకుంటారు. దాంతో అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు కాళీ. కానీ.. అది సాధ్యం కాదు. ఆ ప్రాంతానికి పోస్ట్‌మెన్‌గా రావడానికి ఎవరూ ఇష్టపడక పోవడంతో తప్పని పరిస్థితుల్లో కాళీ డ్యూటీ చేస్తుంటాడు. అదే టైంలో అతనికి ఒక ఐడియా వస్తుంది. ఊరిలో ఎవరూ చదువుకోలేదని తెలుసుకున్న కాళీ.. వాళ్లు రాసినట్టుగా గవర్నమెంట్‌కు ఒక పిటిషన్ రాస్తాడు.
పోస్టాఫీసును మూసివేయమని, బదులుగా అక్కడ బ్యాంకును తెరవమని అందులో రాస్తాడు. ఆ పిటిషన్‌పై గ్రామస్తుల బొటన వేలి ముద్రలు వేయించుకుంటాడు. అదే టైంలో అతను బ్రిటిష్ కాలంలో అక్కడ పోస్ట్‌మ్యాన్ (హర్కార)గా పనిచేసిన మాధేశ్వరన్(రామ్ అరుణ్ క్యాస్ట్రో) గురించి తెలుసుకుంటాడు. అతన్ని అక్కడివాళ్లు దేవుడిగా భావిస్తుంటారు. అతని కథ తెలుసుకున్న తర్వాత కాళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? తర్వాత ఏం జరిగింది? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథలో కొన్ని లాజిక్‌లు మిస్ అయినట్టు అనిపిస్తుంది. దాదాపు 150 ఏండ్ల క్రితం నుంచి ఇప్పటివరకు ఆ ఊరిలో పరిస్థితులు అలాగే ఉన్నట్టు చూపించారు. కానీ.. అది నమ్మశక్యంగా లేదు. కాళీ వెంకట్ రియలిస్టిక్ పర్ఫార్మ్ చేశాడు. హర్కార పాత్రలో రామ్ అరుణ్ క్యాస్ట్రో ఆకట్టుకున్నాడు.