- ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన రాకపోకలు
- కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఓసీపీల్లో ఆగిన బొగ్గు ఉత్పత్తి
ఖమ్మం నెట్వర్క్, వెలుగు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చర్ల మండలంలో అత్యధికంగా 10 సెం.మీ., భద్రాచలంలో 9.1, ఆళ్లపల్లిలో 7.3, దమ్మపేటలో 6.2, బూర్గంపహాడ్‌లో 6.1, దుమ్ముగూడెంలో 5.5, పినపాకలో 4.7, ఇల్లెందులో 4.5, అశ్వాపురంలో 4.2, మణుగూరులో 4.0, పాల్వంచలో 3.9, చండ్రుగొండలో 3.8, అశ్వారావుపేటలో 3.7, అన్నపురెడ్డిపల్లిలో 3.4 సెం.మీ. వర్షం కురిసింది. గోదావరి నదికి వరద పోటెత్తడంతో గురువారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఏజెన్సీలోని రోడ్లు, లోలెవల్బ్రిడ్జిల మీదుగా వరద ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జూలూరుపాడు మండలం కాకర్లలోని షేక్ అఫ్జల్ సాహెబ్ కు చెందిన రేకుల ఇల్లు కూలిపోయింది. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. దీంతో 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 407 అడుగుల సామర్థం ఉన్న రిజర్వాయర్‌లో ప్రస్తుతం 401.40 అడుగుల మేర నీరు ఉంది. వరద నీరు చేరడంతో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌పడింది.
గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఆదేశించారు. ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి గురువారం సాయంత్రం ఆమె ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. సెక్టోరియల్ ఆఫీసర్లంతా మండలాల్లోనే ఉండాలన్నారు. భద్రాచలంలోని స్నాన ఘాట్ల వద్దకు భక్తులు వెళ్లకుండా నియంత్రించాలన్నారు. కరకట్టపై గస్తీ పెంచాలని చెప్పారు. కాగా గురువారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది.
అత్యధికంగా తిరుమలాయపాలెంలో 38 మిల్లీమీటర్లు వాన పడింది. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మున్నేరు వాగుకు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వరద పోటెత్తడంతో పరవళ్లు తొక్కుతోంది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వి.పి.గౌతమ్ సూచించారు. అత్యవసర సహాయం కోసం 90632 11298, టోల్‌ఫ్రీ నెంబర్ 1077కు కాల్ చేయాలని చెప్పారు. బేతపల్లి మధ్య తరహా జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయి(16 అడుగులు)కి చేరింది. అధికారులు లాకులు ఎత్తి నీటికి కిందికి వదిలారు.