గెరువియ్యని వానలు.. తొవ్వియ్యని వాగులు

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
  • రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్​ జిల్లాల్లో వానలు
  • మత్తళ్లు పోసిన చెరువులు.. తెగిన రోడ్లు


నెట్‌వర్క్‌, వెలుగు: ఉమ్మడి జిల్లాలో మూడ్రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు, వంకలు పొంగుతున్నాయి.  దీని ఫలితంగా వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి​ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం దాకా భారీ వర్షం కురిసింది.  కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 213 మి.మీ. వర్షపాతం నమోదైంది.  గంగాధర మండల కేంద్రంలో 158 మి.మీ, ఇదే మండలం బూర్గుపల్లిలో 143మి.మీ, వేములవాడ మండలంలో 102.4 మి.మీ, వేములవాడలో102.4 మి.మీ., బోయినిపల్లి మండలంలో 100.6 మి.మీ, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో 92మి.మీ వర్షపాతం నమోదైంది.

జగిత్యాల జిల్లాలో.. 

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో భారీ చెట్టు విరిగి పడింది. కొడిమ్యాల మండలం పోతారం చెరువు మత్తడి పోస్తుండడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. సారంగాపూర్ మండలం కోనాపూర్ శివార్లలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి దగ్గర ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు తెగిపోయింది. కోరుట్లలో పూల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.  

రాజన్నసిరిసిల్ల జిల్లాలో.. 

గంభీరావుపేట మండలం ఎగువ మానేరు జలకళ సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 31 ఫీట్లు కాగా శుక్రవారం 26 ఫీట్లకు చేరింది.  వేములవాడలో బుడగ జంగాల, సిరిసిల్లలో శాంతినగర్ కాలనీలు నీటమునిగాయి. రాత్రంతా బుడగ జంగాల కాలనీ వారు నీటిలోనే గడిపారు. ఉదయం  మున్సిపల్ సిబ్బంది బుడగ జంగాలను పునరావాస కాలనీకి తరలించారు. వేములవాడ నుంచి బోయిన్‌పల్లి వెళ్లే రోడ్డులో స్తంభంపల్లి వద్ద  గంజివాగు కల్వర్టు పై నుంచి ప్రవహిస్తుంది. దీంతో బోయినిపల్లిమండలానికి రాకపోకలు 
నిలిచిపోయాయి.

కరీంనగర్‌‌లో...  

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ 96మి.మీ, సిటీలో 95 మి.మీ, కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ 85 మి.మీ, కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు 78మి.మీ, చొప్పదండి మండలం వెదురుగట్టు 75మి.మీ, మానకొండూరు పోచంపల్లి 62 మి.మీ వాన కురిసింది. రామడుగు మండలం  ఔదరిపల్లిలో ఔసులకుంట కట్టకు గండి పడింది. గంగాధర మండలం గట్టుభూత్కూర్​ చెరువు మత్తడి దూకి కొత్తపల్లి పట్టణ శివారులోని రోడ్ డ్యాం మీదుగా పట్టణంలోని చెరువులోకి వరదనీరు భారీగా చేరుతోంది. ఆరు ఫీట్ల మేర వరద వస్తుండడంతో రాకపోకలు 
నిలిచిపోయాయి.

పెద్దపల్లి జిల్లాలో..

పెద్దపల్లి పట్టణంలో నిర్మాణంలోని బ్రిడ్జి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకపోయింది. రామగుండం 23వ డివిజన్‌లోని మోమినగర్ లో ఇండ్లల్లోకి వర్షపు నీరు చేరింది.