- ఏండ్లుగా పెండింగ్లోనే బ్రిడ్జిల నిర్మాణం
- కాగితాలకే పరిమితమైన టెండర్లు
- ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలు, జీవాలు
నాగర్ కర్నూల్, వెలుగు: నాలుగు చినుకులు గట్టిగా పడి, చిన్నపాటి వరద వస్తే చాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లోని వాగులు దాటేందుకు జనం తిప్పలు పడుతున్నారు. ఇలా రెండేండ్లలో నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాజ్వేల మీదుగా ప్రవహించే వరద భీభత్సం సృష్టిస్తుంటే.. వరద తగ్గిన తరువాత పాకురు పట్టిన కాజ్వేల మీద బైకులు జారి పడి కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయి. పదేండ్లుగా బ్రిడ్జిలు, కాజ్వేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు తీసుకున్న గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆర్అండ్బీ, పంచాయితీరాజ్ రోడ్ల నిర్మాణాలు, నిర్వహణ, రిపేర్లకు ఫండ్స్ ఇవ్వలేదు.
ప్రాణాలు పోయినా పట్టించుకోలే..
జిల్లాలోని తెల్కపల్లి, తాడూరు, బిజినేపల్లి మండలాల్లో వాగులు దాటుతూ ఆరుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన అప్పటి ప్రజాప్రతినిధులు, ఆ తరువాత ఆ కుటుంబాలను పట్టించుకోలేదు. కాజ్వేలు, బ్రిడ్జిల నిర్మాణాలను కూడా పట్టించుకోకపోవడంతో ఎప్పటి మాదిరిగానే తిప్పలు తప్పడం లేదు. తాడూరు మండలం ఐతోలు, శిరసవాడ గ్రామాల మధ్యలో బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం, బొందలపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది.
శ్రీపురం, తూడుకుర్తి గ్రామాల మధ్య దాదాపు ఇదే దుస్థితి. తెలకపల్లి మండలం కార్వంగ, జమిస్తాపూర్ మధ్య బ్రిడ్జి పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. తెలకపల్లి మండలం నడిగడ్డ నుంచి రఘుపతిపేట దుందుభి వాగుపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం 2023లో రూ.46 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. తెలకపల్లి మండలం కార్వంగ-, పులిజాల బ్రిడ్జికి రూ.3.50 కోట్లు మంజూరైనా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. నాగర్ కర్నూల్ మండలం పులిజాల, తాళ్లపల్లికి మధ్య రూ.3.50 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినా, లింక్ రోడ్డు పూర్తి చేయలేదు.
కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ముక్కిడిగుండం పెద్ద వాగు కాజ్ వేపై 20 ఏండ్లుగా ప్రజలు తిప్పలు పడుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరైనా, పనులు ప్రారంభించలేదు. పెంట్లవెళ్లి మండలం కొండూరు, సంపత్ రావుపల్లి గ్రామాల మధ్య నిర్మల్ వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఉప్పునుంతల మండలం ఉల్పర వద్ద దుందుభి వాగుపై రూ.30 కోట్లతో టెండర్లు పిలిచారు. అచ్చంపేట మండలం బొమ్మనపల్లి, సిద్ధాపూర్ ప్రధాన రహదారిపై రెండు కల్వర్టులకు రూ. 60 లక్షలు మంజూరు చేసినా టెండర్లు పిలవలేదు.
ఆమనగల్లు మండలం మేడిగడ్డ,- శంకర్ కొండ మధ్య కత్వ వాగుపై బ్రిడ్జి పనులను ఏడాది కింద ప్రారంభించి మధ్యలో వదిలేశారు. పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ముద్విన్, గౌరారం గ్రామాల మధ్య బ్రిడ్జి లేకపోవడంతో వాగు దాటలేని పరిస్థితి ఉంది. మంగళపల్లి, చెన్నారం గ్రామాల మధ్య వర్షాకాలం రాకపోకలు నిలిచిపోతున్నాయి. మాడుగుల మండలం సుద్దపల్లి,- ఆర్కపల్లి గ్రామాల మధ్య, తలకొండపల్లి మండలం చీపునుంతల- సాలార్పూర్ గ్రామాల మధ్య ఇదే పరిస్థితి.