పిచ్చి కుక్క దాడి.. 10 మందికి గాయాలు

పిచ్చి కుక్క దాడి.. 10 మందికి గాయాలు
  • నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఘటన

​నందిపేట, వెలుగు: ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.  బాధితులు, స్థానికులు తెలిపిన మేరకు.. నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఉదయం స్థానిక లిటిల్​ప్లవర్ స్కూల్​వద్ద బస్సు దిగిన విద్యార్థి రాంచరణ్ ను పిచ్చికుక్క వెంటపడి దాడిచేసి కరిచింది.  స్థానికులు దాన్ని తరిమేయడంతో రోడ్డుపై వెళ్తున్న సాయిలును కరిచింది.  పక్కనే పిల్లలను స్కూల్​బస్సు ఎక్కించేందుకు రోడ్డు పై నిల్చున్న  నితీష్​కుమార్​పై దాడికి దిగింది. దీంతో అతడు కాలితో కుక్కను తన్నేందుకు ప్రయత్నించగా అతని ఛాతిపై కరిచి పరుగు తీసింది. అలాగే మరో ఇద్దరిని కరిచిన కుక్క.. ఆనంది ఆస్పత్రి లసుంబాయి డ్యూటీకి వెళ్తుండగా ఎదురుగా వెళ్లి దాడి చేసి ఆమె చేయి కొరికింది. కుక్కదాడిలో గాయపడిన తొమ్మిది మందిని స్థానిక పీహెచ్​సీలో చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన లసుంబాయిని మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.  మండల కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని సంబంధిత అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 

ములుగు జిల్లాలో మరో 16 మంది పై దాడి  వృద్ధురాలి పరిస్థితి విషమం 

మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి, గంటల వ్యవధిలోనే 16 మందిపై దాడి చేసింది.  పొదుమూరు, ముస్లింవాడ, గంపోనిగూడెం, బోరు నర్సాపురం గ్రామాల్లో తిరుగుతూ కనిపించిన వారినళ్లా కరిచింది. వెంటనే బాధితులు మంగపేట పీహెచ్ సీకి వెళ్లగా కుక్కకాటు ఇంజక్షన్లు లేకపోవడంతో ఏటూరునాగారం ఆస్పత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ చేయించుకున్నారు. తురకవాడలో  వృద్ధురాలు దాదాని (90), ఎండీ సైదా( 9), మైతున్ బీ (80),  పోదుమూరులో ఎర్రావుల సమ్మయ్య, లాలయ్య తీవ్రంగా గాయపడ్డారు. వృద్ధురాలు దాదాని ముఖంపై కరవడంతో తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.