కుక్క కరిస్తే కొత్తగూడెం వెళ్లాల్సిందే!

అశ్వారావుపేట, వెలుగు: ఓ చిన్నారిపై కుక్క దాడి చేసింది. మండలంలోని వినాయకపురం కాలనీకి చెందిన పూలేటి లాలస అనే చిన్నారిని సోమవారం సాయంత్రం వీధి కుక్క తీవ్రంగా గాయపరిచింది. చుట్టుపక్కల వారు చిన్నారిని రక్షించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చిన్నారిని కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్​సీకి తీసుకువెళ్లారు. అప్పటికే హాస్పిటల్ మూసివేయడంతో అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తెచ్చారు. కుక్క కాటుకు వ్యాక్సిన్ వేశారు. మరో ఇంజిక్షన్ ఇవ్వాలని అది తమ వద్ద లేదని, కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు. కానీ సిబ్బంది చిన్నారికైన గాయాలను శుభ్రం చేయకుండా తనతోనే కడిగించారని చిన్నారి తండ్రి చిలకారావు ఆరోపించారు. ఇదే విషయమై మెడికల్ ఆఫీసర్ పూర్ణచంద్ ను వివరణ కోరగా కుక్క కాటుకు వ్యాక్సిన్ వేశామని, మరో వ్యాక్సిన్ కోసం కొత్తగూడెం పంపించామన్నారు. బాధితుల ఆరోపణపై విచారించి చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తానని డాక్టర్ తెలిపారు.