కుక్కలు బాబోయ్‌‌‌‌.. గ్రేటర్, శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద

కుక్కలు బాబోయ్‌‌‌‌.. గ్రేటర్, శివారు ప్రాంతాల్లో కుక్కల బెడద

హైదరాబాద్, వెలుగు:   గ్రేటర్‌‌‌‌‌‌‌‌తో  పాటు శివారు ప్రాంతాల్లో  వీధి కుక్కల బెడద ఎక్కువవుతుంది.  వరుసగా దాడులు చేస్తుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.  కుక్కల సంఖ్య పెరగకుండా ఉండాలంటే వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు (స్టెరిలైజేషన్స్‌‌‌‌) చేయడం ఒక్కటే మార్గం.  గ్రేటర్ లో దీనిపై కొద్దిగా దృష్టి పెడుతున్నప్పటికీ శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పట్టించుకోవడం లేదు.  రేబిస్‌‌‌‌ రాకుండా ఉండాలంటే వీధి కుక్కలన్నింటికీ వ్యాధి నిరోధక టీకా వేయాలని ప్రజలు కోరుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల డ్యూటీలు అప్పగించారు. వెటర్నరీ అధికారులకు కూడా ఎన్నికల డ్యూటీ ఉందని చెబుతున్నారు.  కుక్కలు ఎక్కువగా ఉన్నాయని జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వస్తున్న కాలనీలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారు. ఫిర్యాదులు రానీ ప్రాంతాల్లో స్టెరిలైజేషన్స్‌‌‌‌ సర్జరీలు పెద్దగా జరగడంలేదు.   నగరంలో 4 లక్షలకు పైగా డాగ్స్​ఉన్నట్లు అధికారికంగా చెబుతున్నప్పటికీ  ఆ సంఖ్యకు డబుల్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది.  శివారులోని  7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో  రెండేళ్ల  క్రితం 2  లక్షల డాగ్స్ ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య రూ. 3 లక్షలు దాటినట్లు పలువరు  వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. 

ఇతర పట్టణాల్లో వందశాతం స్టెరిలైజేషన్..

గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో కుక్కల నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌‌‌‌ఎంసీ చెబుతున్నా రిజల్ట్ కనిపించడం లేదు.  ఢిల్లీ, జైపూర్, బెంగళూర్, చెన్నై, ముంబయి, కోల్‌‌‌‌కతా, నగరాల్లో పకడ్బందీగా స్టెరిలైజేషన్ జరుగుతున్నట్లు వెటర్నరీ డాక్టర్లు, డాగ్ లవర్స్ చెబుతున్నారు.  ఆ సిటీల్లో స్టెరిలైజేషన్ బాధ్యతలు ఎన్​జీవోలకు అప్పగించడంతోనే వందశాతం రిజల్ట్ వస్తున్నట్లు పేర్కొంటున్నారు.  గ్రేటర్ హైదరాబాద్ లో స్టెరిలైజేషన్ బాధ్యతలను ఎన్జీవోలకు అప్పగిస్తే ఫలితం కనిపించే అవకాశం ఉంది.  

వీధి కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు 

మేడ్చల్ జిల్లా మూడు చింతల పల్లి మండలం అద్రాస్ పల్లి గ్రామంలోని కుమ్మరి కాలనీలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి రుష్మితపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారిని ముఖానికి గాయాలయ్యాయి.  స్థానికులు చికిత్స నిమిత్తం నారాయణ గుడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ వీధి కుక్కలు దాడి చేసిన సంఘటనలున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.