వనపర్తి, వెలుగు: వనపర్తి మున్సిపాలిటీలో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో వందల సంఖ్యలో స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
బిల్లులు చెల్లించట్లే..
వనపర్తి మున్సిపాలిటీలో 8 వేల ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. వీటిని ఏడేండ్ల పాటు మెయింటెనెన్స్ చేసేందుకు ఒకరికి కాంట్రాక్టు ఇచ్చారు. 2017 సెప్టెంబర్‌లో కాంట్రాక్టు ఇవ్వగా, ఏడేండ్ల పాటు కాంట్రాక్ట్ కొనసాగనుంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.9 లక్షల చొప్పున కాంట్రాక్ట్ పీరియడ్ ముగిసేంత వరకు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఇలా రూ.7.56 కోట్లు చెల్లించాలి. ఎల్ఈడీ బల్బులు సక్రమంగా వెలిగేలా చూడాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే. బల్బు కాలిపోయినా, ఏదైనా రిపేరు చేయాల్సి వచ్చినా తానే చూసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు రిపేర్లు చేసి స్ట్రీట్ లైట్స్ వెలిగేలా చూడాలి. కానీ, ఈ మధ్య నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఇలా రూ.2 కోట్లు బకాయి పడడంతో మెయింటెనెన్స్‌ను
పక్కన పెట్టారు.
మిగతా మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి..
వనపర్తి మున్సిపాలిటీతో పాటు కొత్తకోట, పెబ్బేరుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. వనపర్తిలో 8వేల స్ట్రీట్ లైట్స్ ఉండగా, రూ.2 కోట్ల 58 వేలు బకాయి ఉన్నాయి. కొత్తకోట మున్సిపాలిటీలో 2,303 బల్బులు ఉండగా, రూ.20,55,866, పెబ్బేరు మున్సిపాలిటీలో రూ.15.85 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎల్ఈడీ స్ట్రీట్ లైట్స్ పెండింగ్ బిల్లులు పేరుకుపోవడంతో కాంట్రాక్టర్ మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోంది.
త్వరలోనే చెల్లిస్తాం..
స్ట్రీట్ లైట్స్ బిల్లులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తీసుకొని త్వరలోనే చెల్లిస్తాం. పట్టణ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తాం.
– పూర్ణచందర్, కమిషనర్, వనపర్తి