ఎక్కడ చూసినా చీకట్లే! గ్రేటర్​ రోడ్లపై వెలగని స్ట్రీట్​ లైట్లు..

ఎక్కడ చూసినా చీకట్లే! గ్రేటర్​ రోడ్లపై వెలగని స్ట్రీట్​ లైట్లు..
  • ఫ్లై ఓవర్లు, జంక్షన్లతో పాటు కాలనీలు, బస్తీల్లోనూ అంతే
  • బిల్లులు చెల్లించని బల్దియా 
  •  నిర్వహణ పట్టించుకోని ఈఈఎస్ఎల్ సంస్థ
  •  సొంతంగా 15,500 స్ట్రీట్ లైట్లు కొన్న జీహెచ్​ఎంసీ 
  • డివిజన్ కు వంద ఇవ్వడంతో   సరిపోని పరిస్థితి

హైదరాబాద్ సిటీ, వెలుగు:జీహెచ్​ఎంసీ పరిధిలో స్ట్రీట్ ​లైట్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఉన్నవాటిలో 30 శాతానికిపైగా వెలగట్లేదు.  దీంతో రాత్రుల్లు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. టైమర్లు పనిచేయక కొన్నిచోట్ల 24 గంటలు వెలుగుతుండగా, ఇంకొన్ని చోట్ల చీకటి పడ్డాక మొత్తానికే వెలగడంలేదు. సాయంత్రం ఆరు దాటితే అంధకారం నెలకొంటోంది. 

ప్రధాన రహదారులు మొదలుకొని కాలనీలు, బస్తీలు అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉంటోంది. ఏడేండ్లపాటు స్ట్రీట్ ​లైట్ల నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్)సంస్థకు అప్పగించింది. నెలకు రూ.8 కోట్లను చెల్లిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్​తో ఈ ఏజెన్సీ గడువు ముగియనుంది. 

లైట్ల మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం లేదని ఏడాది కిందట జీహెచ్​ఎంసీ ఈ సంస్థకు రూ.6.50 కోట్ల జరిమానా విధించింది. తర్వాత  కొన్ని నెలల బిల్లులు నిలిపివేసింది. సంస్థకు దాదాపు రూ.100 కోట్ల వరకు బల్దియా బకాయి పడింది. డబ్బులు ఇవ్వడం లేదనే కారణంతో  గతేడాది డిసెంబర్ నుంచి సంస్థ స్ట్రీట్​లైట్ల నిర్వహణను మొత్తానికే పట్టించుకోవడం లేదు. 

ఫ్లై ఓవర్లపై 50 శాతానికి పైగా..

గ్రేటర్​లోని కొన్ని ఫ్లైఓవర్లపై పూర్తిగా లైట్లు పనిచేయట్లేదు. ఇంకొన్నిచోట్ల 50 శాతం వరకు వెలగట్లేదు. దాదాపు మూడు నెలలుగా చాలా ఇదే దుస్థితి నెలకొంది.  హైటెక్ సిటీ వైపు ఉన్న రైల్వే ట్రాక్​పై ఉన్న ఫ్లై ఓవర్​పై ఒక్క లైటూ వెలగడంలేదు. జూబ్లీహిల్స్ నుంచి డైమండ్ హౌస్ రూట్, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్లే ఫ్లైఓవర్లపై సగం వరకు వెలగడంలేదు. లంగర హౌస్ ఫ్లైఓవర్, పంజాగట్ట, బేగంపేట ఇలా ఎక్కడ చూసినా చీకట్లే కనిపిస్తున్నాయి. దీంతో రోడ్డు డేంజర్ గా ఉన్న ప్రాంతాల్లో వాహనదారులు స్కిడ్ అయి పడిపోతున్నారు. 

ఐదున్నర లక్షల స్ట్రీట్ లైట్లు

గ్రేటర్​లో 9,103 కి.మీల రహదారులు ఉండగా, 5,45,484  స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. వీటిలో 4 లక్షలకు పైగా ప్రధాన రహదారులు, వీధుల్లో ఉండగా, 54 వేలకుపైగా లైట్లు  ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు హైమాస్ట్ లైట్లు 6,531ఉన్నాయి. జీహెచ్ఎంసీకి పబ్లిక్ ​నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో  30 శాతం వరకు స్ట్రీట్ లైట్లకు సంబంధించినవే కావడం గమనార్హం. 

డార్కు స్పాట్లను గుర్తిస్తున్న బల్దియా అధికారులు అక్కడ సైతం లైట్లను ఏర్పాటు చేయడంలేదు. ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా కూడా సమస్యని పరిష్కరించలేకపోతున్నారు. అగ్రిమెంట్ ప్రకారం 26,398 ఎల్ఈడీ లైట్ల స్టాక్ మెయింటెన్ చేయాల్సి ఉండగా, ప్రస్తుతం సంస్థ పట్టించుకోవడంలేదు. చాలా చోట్ల పోల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఎల్ఈడీ లైట్లు లేకపోవడంతో ఇన్ స్టాలేషన్ జరగడం లేదు.    

15 వేల లైట్లు కొనుగోలు చేసిన బల్దియా..

జీహెచ్ఎంసీకి స్ట్రీట్ లైట్లపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. గతేడాది నుంచి ఈ ఏడాది జనవరి 20 వరకు 1.48 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అందులో 10 వేల వరకు ఫిర్యాదులు నేటికీ పెండింగ్​లోనే ఉన్నాయి. ఆ తరువాత 20 రోజుల్లోనే దాదాపుగా 6 వేల వరకు ఫిర్యాదులు వచ్చాయి.  

మరో పక్కన కార్పొరేటర్ల నుంచి డిమాండ్ వస్తుండడం, కౌన్సిల్​లోనూ ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరగడంతో జీహెచ్ఎంసీ ఇటీవల 15,500 లైట్లను కొనుగోలు చేసింది. వీటిని డివిజన్​కు వంద చొప్పున ఇవ్వడంతో.. 5 వేలకు పైగా కాలనీలు ఉన్న గ్రేటర్​లో ఇవి మూలకూ సరిపోవడంలేదు. 

 గ్రేటర్​లో రూ.217.12 కోట్లతో గతంలో ఎల్ఈడీ లైట్లను జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి వీటిని సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్న అధికారులు 98 శాతం వెలుగుతున్నాయని చెబుతున్నారు.  ఫిర్యాదులు వచ్చిన 48 గంటల్లోపు సమస్య పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం నెలలు గడిచినా పట్టించుకోవడంలేదు.