- ఫ్లై ఓవర్లపై సగానికిపైగా చీకట్లే..
- డార్క్ స్పాట్లను పట్టించుకోని జీహెచ్ఎంసీ
- ఏజెన్సీ నిర్లక్ష్యంతో జనాలకు ఇబ్బందులు
- ఫైన్లతోపాటు పేమెంట్స్ కట్చేస్తున్నామంటున్న అధికారులు
- డబ్బులు టైమ్‌కు ఇవ్వకపోవడంతోనే సమస్య వస్తోందంటున్న ఏజెన్సీ
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో స్ట్రీట్ లైట్ల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతున్నది. మొత్తం లైట్లలో సుమారు 20 నుంచి 30 శాతం వరకు వెలగడం లేదు. దీంతో సాయంత్రం ఆరు దాటితే చాలా మెయిన్రోడ్లతోపాటు కాలనీలు, బస్తీలు అంధకారమవుతున్నాయి. చాలా చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరోవైపు టైమర్లు పనిచేయక కొన్నిచోట్ల లైట్లు 24 గంటలూ వెలుగుతూనే ఉన్నాయి. ఏడేండ్ల కింద స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను ఈఎస్ఎల్ అనే సంస్థకు బల్దియా అప్పగించింది. నిర్వహణ కోసం ఏజెన్సీకి నెలకి రూ.8 కోట్లు చెల్లిస్తోంది.
అయితే ఈ ఏడాది ఏప్రిల్ తో ఏజెన్సీ గడువు ముగియనున్న నేపథ్యంలో మెయింటనెన్స్పట్టించుకోవడం లేదు. నిర్వహణ సరిగ్గా లేదనే కారణంతో ఏడాది కింద బల్దియా సదరు సంస్థకు రూ.6.50 కోట్ల ఫైన్వేసింది. అలాగే, కొన్ని నెలల బిల్లులు కూడా నిలిపేసింది. అయినా ఎలాంటి మార్పు రాలేదు. నాలుగైదు నెలలుగా సమస్య తీవ్రమైంది.
లక్షన్నరకు పైగా లైట్లు వెలగట్లే
గ్రేటర్ లో 9,103 కిలోమీటర్ల రోడ్లుండగా రూ.217.12 కోట్లతో జీహెచ్ఎంసీ 5,45, 484 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 4 లక్షలకు పైగా మెయిన్‌రోడ్లు, వీధుల్లో ఉండగా.. 54 వేలకుపైగా లైట్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటితో పాటు 6,531 హైమాస్ట్ లైట్లు ఉన్నాయి. వీటిని మెయింటనెన్స్‌ను ఈఎస్ఎల్ అనే సంస్థ చూడాలి. దీని కోసం బల్దియా నెలకు రూ. 8 కోట్లు చెల్లిస్తోంది. అయితే, లైట్లు వెలగని చోట సదరు సంస్థ కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. జీహెచ్ఎంసీకి జనంనుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 30 శాతం వరకు స్ట్రీట్ లైట్లకు సంబంధించినవే ఉంటున్నాయి.
డార్క్స్పాట్లలో కూడా లైట్లు వెలగకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల హైమాస్ట్ లైట్లు కూడా వెలగడం లేదు. లైట్లు వెలగడం లేదని ట్రాఫిక్ పోలీసులు బల్దియాకు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను పట్టించుకోవడంలేదు. ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లోపు పరిష్కరించాల్సి ఉన్నా వారమైనా చేయడం లేదు. అగ్రిమెంట్ ప్రకారం ఏజెన్సీ 26,398 ఎల్ఈడీ లైట్ల స్టాక్ మెయింటెయిన్ చేయాల్సి ఉన్నా లైట్తీసుకుంటోంది.
చాలా చోట్ల పోల్స్ ఉన్నా ఎల్ఈడీ లైట్లు లేక ఇన్ స్టాల్చేయడం లేదు. ఫీల్డ్లెవెల్లో సమస్య ఇలా ఉంటే బల్దియా అధికారులు మాత్రం 2 నుంచి 5 శాతం వరకు మాత్రమే పని చేయడం లేదని బుకాయిస్తున్నారు. కాగా గ్రేటర్‌వ్యాప్తంగా లక్షన్నరకు పైగా స్ట్రీట్‌లైట్లు వెలగడం లేదు.
ఎక్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
నాగోలులోని ఇంద్రప్రస్తా కాలనీలో గత నెల 21 నుంచి ఐదు స్ట్రీట్‌లైట్లు పనిచేయడం లేదని అజయ్ కుమార్ అనే వ్యక్తి 8 రోజుల కింద ఎక్స్ లో ఫిర్యాదు చేశాడు. కేపీహెచ్ బీ రోడ్ నెంబర్ ఒకటిలో మూడు నెలలుగా స్ట్రీట్ లైట్ల సమస్య ఉందని లక్ష్మణరావు కంప్లయింట్చేశాడు. ఫలక్ నుమాలో రోడ్డుపై స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని ప్రభు అనే వ్యక్తి ఆరు రోజుల కింద బల్దియా అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు.
హైటెక్ సిటీలోని చాలాచోట్ల వీధి లైట్ల సమస్య ఉందని హైటెక్ సిటీ ఎంప్లాయీస్అనే ఎక్స్ ఖాతా నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయినా ఎక్కడా సమస్యను పరిష్కరించడం లేదు.
ఫ్లైఓవర్లపై సగం చీకట్లు
సిటీలోని ఫ్లై ఓవర్లపై సగానికి సగం లైట్లు పనిచేయడంలేదు. మూడు నెలలుగా చాలా ఫ్లై ఓవర్లపై ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది ఇదే సీజన్ లో లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ పై నుంచి ఓ ఆర్మీ జవాన్వస్తూ అడ్డుగా ఉన్న మాంజా కనిపించకపోవడంతో తీవ్రంగా గాయపడి చనిపోయాడు.
లైట్లు పనిచేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు. ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్‌పై అదే పరిస్థితి ఉంది. స్ట్రీట్ లైట్ల సమస్యపై రెండు రోజుల కింద పలువురు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ఆఫీసుల వద్ద ఆందోళనలు చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
అసలు సమస్య ఎక్కడుందంటే..
ఏజెన్సీ టైం పూర్తి కావస్తుండడంతో కావాలనే పనులు చేయడంలేదని, అందుకే గత ఏడాది భారీ జరిమానా విధించామని, పేమెంట్స్కూడా సరిగ్గా రిలీజ్చేయడం లేదని బల్దియా అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ విభాగంలో 40 మంది ఏఈలకు 16 మంది మాత్రమే ఉండడంతో పట్టించుకునేవారు కరువయ్యారు.
అయితే, బల్దియా టైమ్‌కు పేమెంట్ఇవ్వడం లేదని, దీంతో తమకు వర్కవుట్‌కావడం లేదని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. ప్రతి నెలా పేమెంట్సరిగ్గా రిలీజ్చేయకపోవడంతో స్టాఫ్‌ను రిక్రూట్చేసుకోలేకపోతున్నాని చెబుతున్నారు.