హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లోని చాలా ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు, హైమాస్ట్లైట్లు వెలగట్లేదు. సాయంత్రం 6 దాటితే మెయిన్రోడ్లు మొదలు కాలనీలు, బస్తీల్లో చీకట్లు అలముకుంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కేవలం 2 నుంచి 5 శాతం స్ట్రీట్లైట్లు మాత్రమే పని చేయడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ దాదాపు 20 నుంచి 30 శాతం లైట్లు పనిచేయడం లేదు. ప్రధాన జంక్షన్లలోని హైమాస్ట్ లైట్లే కొన్ని నెలలుగా వెలగట్లేదు. రోడ్లు కనిపించక చాలాచోట్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. గతంలో రూ.217.12 కోట్లతో జీహెచ్ఎంసీ ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి లేటెస్ట్ టెక్నాలజీతో వీటిని పరిశీలిస్తున్న అధికారులు 98 శాతం లైట్లు వెలుగుతున్నాయని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనబడటం లేదు. కొన్నిచోట్ల మాత్రం 24 గంటలు వెలుగుతూనే ఉంటున్నాయి. ఇటీవల ఈ విషయంపై మేయర్ సైతం అధికారులను ఆరా తీశారు. పగలు లైట్లు వెలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినా ఎలాంటి మార్పు కనిపించడంలేదు.
20 నుంచి 30 శాతం ఫిర్యాదులు ఇవే..
జీహెచ్ఎంసీ పరిధిలో 9,103 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, 5.70 లక్షల స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. వీటిలో 4 లక్షలు మెయిన్రోడ్లు, వీధుల్లో ఉండగా, 54 వేలకుపైగా ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి.
వీటితో పాటు హైమాస్ట్ లైట్లు 6,531ఉన్నాయి. కాగా ప్రస్తుతం జీహెచ్ఎంసీకి జనం నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో 20 నుంచి 30 శాతం వరకు స్ట్రీట్ లైట్లకు సంబంధించినవే ఉంటున్నాయి. గతేడాది స్ట్రీట్లైట్లకు సంబంధించి 42 వేల ఫిర్యాదులు రాగా, ఈసారీ అదే తరహాలో వచ్చాయి. ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాలను డార్క్ స్పాట్లుగా గుర్తిస్తున్న అధికారులు.. లైట్లు ఏర్పాటు చేయకుండానే చేసినట్లు చూపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయాణించేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. వరుస వర్షాలకు సిటీలోని రోడ్లన్నీ పాడైపోయాయి. ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి కంకర, ఇసుక మేటలు వేసి ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు వెలగకపోవడంతో టూవీలర్ల మీద వెళ్లే వాళ్లు స్కిడ్ అయ్యి కిందపడుతున్నారు.
అక్కడ.. ఇక్కడ అని లేదు
నాగోల్, నానల్ నగర్, రేతిబౌలి, నాంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, మెహిదీపట్నం ఇలా అనేక ప్రాంతాల్లోని మెయిన్రోడ్లు, కాలనీల్లోని స్ట్రీట్ లైట్లు సరిగా పనిచేయడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని మెయిన్రోడ్లపైనా ఇదే పరిస్థితి. అధికార పార్టీ స్టేట్ఆఫీస్ రోడ్డులోని లైట్లు వెలగక చీకట్లు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని బల్దియా అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు వేరుగా ఉన్నాయి. మెయింటెనెన్స్సరిగ్గా లేకపోవడంతో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా చాలాచోట్ల 24 గంటలు లైట్లు వెలుగుతుండగా.. బల్దియాపై కరెంట్ బిల్లుల భారం పడుతోంది.
రాత్రి వేళ జర్నీ ఇబ్బందిగా ఉంటోంది
స్ట్రీట్ లైట్లు వెలగకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య ఉందని తెలిసినా దృష్టి పెట్టడం లేదు. జనం ఎక్కువగా తిరిగే రోడ్లలోనూ చిమ్మచీకట్లు ఉంటున్నాయి. కొన్నిచోట్ల పగలూ రాత్రి అనే తేడా లేకుండా వెలుగుతున్నాయి. రాత్రి వేళ కొన్ని ప్రాంతాల్లో నుంచి ప్రయాణించాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. వానలు పడినప్పుడు రోడ్లపై గుంతలు, నీళ్లు కనిపించక యాక్సిడెంట్లు అవుతున్నాయి.
- ఉప్పరి నరేశ్ సాగర్, నానల్నగర్