ఓ వైపు హోటళ్లు , రెస్టారరెంట్లు, ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు.. రకరకాల ఆఫర్ల హోరు..ఇవన్నీ భోజన ప్రియులను నోరూరిస్తున్నా..మరోవైపు స్ట్రీ ట్ సైడ్ మెస్సులకు ఆదరణ పెరుగుతూనే ఉంది. ఇంటి భోజనంలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో తినేందుకు హైదరాబాద్ నగర ప్రజలు ఇంట్రస్ట్ చూపుతున్నారు. రెస్టారెంట్లు , హోటళ్లకు దీటుగా ఇక్కడా రద్దీ ఉంటోంది. కొంతకాలంగా ఈ మెస్సుల హవా పెరుగుతోంది. బస్తీల నుంచి బంజారా హిల్స్, హైటెక్ సిటీ లాంటి పాష్‌ఏరియాల వరకు ఎక్కడ చూసినా మధ్యాహ్నం కాగానే ఈ మెస్సులూ కిటకిటలాడుతున్నాయి. మెనూ మెయింటెన్ చేస్తూ టేస్టీ, క్వాలిటీ ఫుడ్ ను అందిస్తూ ఆకలి తీరుస్తున్నాయి. తక్కువ ధరతోపాటు ఫుడ్ కూడా చాలా రుచిగా ఉండడంతో తినేందుకు ఇష్టపడుతున్నారు.
స్ట్రీట్ మెస్సులు మంచి అడ్డా గా మారిపోయాయి. ఇక్కడే తినేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. రెస్టారెంట్లకు వెళ్లి ఎక్కువ రేట్లు పెట్టి తినలేని వారు తక్కువ ధరలో దొరికే క్వాలిటీ ఫుడ్ వైపే ఇంట్రస్ట్ చూపుతున్నారు. అన్నంతో పాటు చికెన్ ,మటన్, బోటీ, తలకాయ, గుడ్డుకూరతోపాటు, వెజిటేరియన్స్ కోసం పప్పు,సాంబార్, ఫ్రై కర్రీ, పాపడా, పెరుగు అందిస్తారు. ధర రూ. 50- రూ.80లోపే ఉంటుంది.
కాలనీలు, పార్కింగ్ ఏరియాలు, రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలే ఈ మెస్సుల అడ్డా. నగరంలో కనీసం వెయ్యికిపైగా ఇలాంటివి ఉన్నాయి. ఇంట్లో వండి తెచ్చి ఫుడ్ అమ్ముతూ ఉపాధి పొందుతున్న వారు 3 వేల మందికిపైగా ఉంటారు. మధ్యాహ్నం రెండు, మూడు గంటలే కన్పించే ఈ మెస్సులకు రెగ్యులర్ గా వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే. సభలు, సమావేశాలు, ర్యాలీలు ఉంటే అక్కడ గిరాకీ బాగా ఉంటోంది. రెగ్యులర్ గా వచ్చేవారి కోసం పోస్టు, ప్రీ పెయిడ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.