![రోడ్లపైనే వీధి వ్యాపారాలు .. నిర్మాణం పూర్తయినా సౌకర్యాలు కల్పించలే](https://static.v6velugu.com/uploads/2025/02/street-vendors-are-doing-business-on-roads-as-construction-of-100-sheds-has-been-completed-but-not-allocated_8vqtmkBNId.jpg)
- నాలుగేండ్ల కింద 100 షెడ్ల నిర్మాణం పూర్తయినా కేటాయించలే
- నిర్వహణ లేక పాడవుతున్న షెడ్లు
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోడ్లపై వీధి వ్యాపారుల ఉండొద్దని, వారికి ప్రత్యేకంగా షెడ్లు నిర్మించినా ఇప్పటిదాకా వాటిని కేటాయించలేదు. దీంతో వీధివ్యాపారులు రోడ్లపైనే వ్యాపారాలు చేసుకుంటున్నారు. బల్దియా పరిధిలోని గోదావరిఖని కూరగాయల మార్కెట్, ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డు, గౌతమీనగర్, గోదావరి ఒడ్డున సమ్మక్క జాతర గద్దెల వద్ద 2019లో 50 షెడ్లు, 2021లో 50 షెడ్లు నిర్మించారు. ఈ రూమ్‌లు నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ కేటాయించలేదు. నిర్మాణం పూర్తయిన షెడ్లకు కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వలేదు.
షెడ్ల నిర్మాణానికి కౌన్సిల్ఆమోదం
వీధి వ్యాపారుల అభివృద్ధి కోసం షెడ్లు నిర్మించాలని 2010లోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అమలు చేయడంలో అప్పటి పాలకులు, ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల అమలుకు నోచుకోలేదు. చివరకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో 2019 నుంచి రామగుండం బల్దియాలో వీధి వ్యాపారుల అభివృద్ధిపై దృష్టి పెట్టి సర్వే చేపట్టారు. కార్పొరేషన్పరిధిలో 13,395 మంది వీధివ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. వీరికి రూ.10 వేల పీఎం స్వనిధి లోన్ ఇప్పించడంతో పాటు రోడ్లపై కాకుండా నిర్ధిష్ట స్థలంలో బిజినెస్ చేసుకునేలాగా షెడ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
2019 సెప్టెంబర్‌లో రూ.30 లక్షలతో 50 షెడ్లు, 2021 జనవరిలో రూ.40 లక్షలతో మరో 50 షెడ్ల నిర్మాణానికి కౌన్సిల్మీటింగ్లో ఆమోదం తెలిపారు. పట్టణ ప్రగతి నిధులతో 2021 డిసెంబర్లో ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్డులో 18, గోదావరి ఒడ్డున సమ్మక్క జాతర స్థలంలో 10 షెడ్డులు, గౌతమీనగర్ మార్కెట్ వద్ద 6, గోదావరిఖని కూరగాయల మార్కెట్ వద్ద 6 షెడ్డుల నిర్మాణాలను పూర్తి చేశారు. కానీ ఇప్పటి వరకు వాటిని ఎవరికి కేటాయించలేదు. దీనికితోడు ఈ షెడ్లలో కరెంట్ సౌకర్యాన్ని కల్పించలేదు. ఈ షెడ్లను ఎవరికీ కేటాయించకపోవడంతో అవి పాడైపోతున్నాయి. వర్షాకాలంలో పైకప్పు నుంచి నీళ్లు కారుతుండడంతో చుట్టుపక్కల ఏర్పాటు చేసిన షీట్లు ఉబ్బిపోయి పెచ్చులు తేలుతున్నాయి.
షెడ్డు కేటాయిస్తలేరు...
ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు బస్టాప్పక్కన పంచర్షాపు నిర్వహించుకునేవాడిని. షెడ్డు నిర్మిస్తామని చెప్పి రోడ్డు పక్క ఉన్న నా టేలాను తొలగించారు. షెడ్డు నిర్మించి చాలా ఏళ్లవుతున్నా కేటాయించలేదు. షెడ్ల ముందు తడకల పందిరి వేసుకుని పంచర్ షాపు నడుపుకుంటున్నా. ఆఫీసర్లు వెంటనే షెడ్డు కేటాయించాలే.
ఎన్.పోచం, పంచర్ షాప్