తృణధాన్యాలైన చిట్టి రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్ తో పాటు శరీరానికి కావల్సిన పోషకాలన్నీ వీటిలో ఉంటాయి. రాగులను నిత్యం తింటే దాంతో మధుమేహం, బీపీ సమస్యల నుంచి బయట పడవచ్చు. అందుకే రాగులను మన మెనూలో చేర్చడం ఎన్నో లాభాలు పొందొచ్చు..
వంద గ్రాముల రాగుల్లో
అత్యంత పోషకాలు ఉన్న చిరుధాన్యం రాగులు గుర్తిస్తారు. కాల్షియం 344 మిల్లీగ్రాములు,ఐరన్ 3.9 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఐరన్ ఇతర తృణధాన్యాలన్నింటి కన్నా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా క్యాలరీలు 336, కార్బోహైడ్రేట్లు 80 శాతం, తేమ 12 శాతం ఉంటుంది. రాగి పిండిలో అత్యావశ్యకమైన అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే ఇంగ్లీష్ లో ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ (ఈఏఏ) అంటారు.
రాగిదోశె తయారీకి కావాల్సినవి:
- రాగిపిండి: ఒక కప్పు
- మినప్పప్పు: పావు కప్పు కన్నా కొంచెం తక్కువ
- పెసరపప్పు, కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- జీలకర్ర : ఒక స్పూన్
- మిరియాలు :ఒక స్పూన్
- పుల్లని పెరుగు
- ఉప్పు :తగినంత
- ఆయిల్ : పావుకప్పు
తయారీ విధానం: మినపప్పు.. పెసరపప్పు.. కందిపప్పు కలిపి కొన్ని గంటలు నాన బెట్టిన తరువాత రుబ్బాలి. ఇందులో రాగిపిండితో పాటు మిగిలిన పదార్థాలన్నీ కలపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ దోశల పిండిలా చేయాలి. ఈ పిండిని వేడి పెనం మీద వేసి.. దోశలా కాల్చుకుంటే కరకరలా దాగి దోశ రెడీ.
రాగిపిండి బూరెలు తయారీకి కావాల్సినవి:
- రాగిపిండి: 250 గ్రామలు
- గోధుమపిండి: 250 గ్రాములు.
- బెల్లం: 300 గ్రాములు
- యాలకుల పొడి: అర టీ స్పూన్
- పచ్చి కొబ్బరి తురుము: 125 గ్రాములు
- నెయ్యి : మూడు టేబుల్ స్పూన్లు
- నూనె: వేగించడానికి సరిపడినంత
తయారీ విధానం: ఒక గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి, పచ్చి కొబ్బరి తురుముతో పాటు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మరో గిన్నెలో బెల్లాన్ని పాకంలా చేసి.. అందులో పైన సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుకొని, అందులో నెయ్యి వేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని.. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బూరెలుగా చేయాలి. తర్వాత మరో గిన్నెలో నూనె పోసి వేగించాలి. రెడీ అయిన బూరెలను ఒక పేపర్ పై వేసి నూనె పీల్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది.
రాగి స్వీట్ తయారీకి కావల్సినవి
- రాగులు :కప్పు
- పాలు : అరకప్పు
- నూనె: రెండు టీస్పూన్లు
- గసగసాలు: టీస్పూన్
- చక్కెర: సరిపడా
తయారీ విధానం : రాగులను ముందురోజు రాత్రి నీటిలో నానబెట్టాలి. తర్వాత రోజు నీటిని వంపేసి రాగులను మెత్తగా రుబ్బాలి. బాగా మెత్తగా అయ్యాక ఆ మిశ్రమాన్ని గట్టిగా పిండుకుంటే పాలు వస్తాయి. తర్వాత కొన్ని నీళ్లు చేర్చి మళ్లీ పిండిని రుబ్బి పాలు తీసుకోవాలి. ఇలా దాదాపు అరకప్పు పాలు తీసుకోవాలి. ఇపుడు పాన్ వేడి చేసి... పాలతో పాటు గసగసాలు తప్ప మిగిలిన పదార్థాలన్నీ తీసుకుని అడుగు అంటకుండా చిన్న మంటపై ఉంచి కలుపుతూ ఉంటే కాసేపటికి దగ్గరగా అవుతుంది. మిశ్రమం బాగా దగ్గరగా అయి చేతికి అంటుకోకుండా ఉన్నప్పుడు దింపేసి నూనె రాసిన పళ్లెంలోకి మార్చాలి. చల్లా రాక పైన గసగసాలు చల్లి నచ్చిన షేపు లోకల్ చేయాలి. ఈ స్వీట్ కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. పిల్లలు ఇష్టంగా ఉంటారు.
రాగిఖీర్ తయారీకి కావలసినవి
- రాగిపిండి :1 1/2 టేబుల్ స్పూన్
- నెయ్యి: 1 టేబుల్ స్పూన్
- వేడి పాలు: ఒకటిన్నర కప్పు
- చక్కర పావు కప్పు
- జీడిపప్పు: 5 లేదా 6
- బాదం: 3 లేదా 3
- కుంకుమ పువ్వు: కొంచెం
- దాల్చిన చెక్క పొడి: కొంచెం
తయారీ విధానం: గిన్నెలో పాలు పోసి చిక్కబడే వరకు మరిగించి పక్కన పెట్టాలి. తర్వాత మందంగా ఉండే
పాన్ తీసుకొని అందులో నెయ్యి వేడి చేయాలి. తర్వాత రాగిపిండి వేసి ముద్దలు కట్టకుండా దాదాపు 30 నిమిషాలు వేగించాలి. తర్వాత ముందుగా మరిగించుకున్న పాలు (రెండు టేబుల్ స్పూను) అందులో కలుపుతూ చిక్కని మిశ్రమంలా చేయాలి, తర్వాత చక్కెరతో పాటు జీడిపప్పు, పిస్తా, బాదం పప్పులు వేసుకొని కలపాలి. చివరిగా దాల్చిన చెక్క పొడి, కుంకుమ పువ్వు వేసి, మూడు నిమిషాలు స్టౌపై మరిగిస్తే రాగి ఖీర్ రెడీ..
రాగి వంటకాలు తినడం వలన ఉపయోగాలు
- రాగుల్లో పీచుపదార్థం అధిక శాతంలో ఉంటుంది. రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి. రాగి జావనీ డైట్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు. శరీరంలో సత్తువ పెంచుతుంది రాగిజావ. ప్రతి రోజూ రాగి డైట్ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు.
- రాగులంటే క్యాల్షియం ఖజానాగా చెప్పవచ్చు. ఈ ధాన్యం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజూ రాగి సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు.
- బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రక్తంలో షుగర్, లెవల్స్ కూడా రాగులు కంట్రోల్ చేస్తాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో రాగులది ప్రధాన పాత్ర. రాగుల వల్ల జుట్టు బాగా పెరుగుతుంది..
- రాగుల్లోని అమైనో ఆమ్లాల వల్ల శరీరంలోని కోప్యు పదార్థాలు కరిగిపోతాయి. ముఖ్యంగా శరీరానికి హానిచేసే చెడు కొలెస్ట్రాల్‌ను రాగులు పోగొడతాయి. హైపర్ టెన్షన్ .. బ్లడ్ ప్రెషర్ ను ఇవి చక్కగా నియంత్రిస్తాయి.
- ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా ట్రిప్టోఫాన్, అమైనో యాసిడ్స్ వల్ల ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రేన్ తలనొప్పి లాంటివి దరి చేరవు. దీని వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది.
- క్యాల్షియంతో పాటు ఐరన్, నియాసిన్, థయామిన్, రైబోప్లేవిన్ తో పాటు ముఖ్య మైన అమైనోయాసిడ్స్ ఉంటాయి. అందుకే రాగులతో చేసిన ఆహారం తినటం వల్ల కండరాలు గట్టిగా ఉంటాయి.
- రాగుల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. తద్వారా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది.
- వేసవి కాలంలో చలువ చేసే రాగిమాల్ట్ మిగతాకాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వయస్సుతో పాటు వచ్చే సమస్యలు... త్వరగా వృద్ధాప్యం రాకుండా చూసుకోవచ్చు.
- ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల బాగా, త్వరగా ఎత్తు పెరుగుతారు. యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్యంగా ఉండటానికి రాగులు సమర్థంగా పనిచేస్తాయి.
–వెలుగు, లైఫ్–