న్యూయార్క్: ఐక్య రాజ్యసమితి వేదికగా తాలిబాన్ల వాకాల్తా అందుకుని మాట్లాడారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. అఫ్గానిస్థాన్ ప్రజల క్షేమం కోసం తాలిబాన్లకు ప్రపంచ దేశాలన్నీ మద్దతుగా నిలవాలని ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. అఫ్గాన్‌లో ఏర్పాటైన తాలిబాన్ సర్కారు సుస్థిరంగా నడిచేలా బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని కోరారు. తాలిబాన్ హస్తగతమైన అఫ్గాన్ విషయంలో ఇప్పుడు ప్రపంచం ఎదుట ఉన్నది రెండే ఆప్షన్లని, ఒకటి ఆ దేశాన్ని పట్టించుకోకుండా వదిలేయడం, రెండు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని సుస్థిరపరచడం అని చెప్పారాయన. అయితే అఫ్గాన్‌ను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు వదిలేస్తే అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతారని, వచ్చే ఏడాది కల్లా అక్కడి ప్రజల్లో 90 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోతారని యూఎన్ అంచనా వేసిందని ఇమ్రాన్ గుర్తు చేశారు. ఇది అతి పెద్ద సంక్షోభానికి దారి తీస్తుందని, దీని వల్ల కలిగే పరిణామాలతో అఫ్గాన్ పొరుగు దేశాలతో పాటు ప్రపంచంలో ఇతర దేశాలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.
ఉగ్రవాదులకు స్వర్గధామం కాకుండా అడ్డుకోవాలి
రాజకీయంగా అస్థిరత వల్ల ఆ దేశం మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకైనా తాలిబాన్ సర్కారును ప్రపంచ దేశాలు గుర్తించి, అండగా నిలవాలని, లేదంటే 20 ఏండ్ల పాటు అమెరికా బలగాలు అక్కడి ఉండి ప్రయోజనం లేకుండా పోతుందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. తాలిబాన్లు సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పోత్సాహించాలని, మానవ హక్కులను పరిరక్షిస్తూ పాలించేలా తోడ్పడాలని, ఈ దిశగా ప్రపంచ దేశాలు అందించాల్సిన సహకారంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సహాయం కావాల్సిన సమయంలో ఆలస్యం చేయకుండా మానవతా దృక్పథంతో తక్షణం ఆదుకోవాలని సూచించారు. ఐక్య రాజ్యసమితి సెక్రెటరీ జనరల్ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని, అయితే ప్రపంచ దేశాలు కూడా అదే బాటలో నడిచేలా చేయాలని ఇమ్రాన్ కోరారు. అఫ్గాన్‌లో ఈ రోజు ఏర్పడిన అస్థిర పరిస్థితులకు అమెరికా, యూరోపియన్ నేతలు కూడా కొంత మేర కారణమని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరోపించారు. 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమెరికా చేసిన పోరాటంలో తమ దేశం కూడా భాగమైందని, ఈ ప్రయత్నంలో అఫ్గాన్ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొన్నది పాకిస్థాన్ అని ఈ వేదిక నుంచి అందరికీ తెలియజేయాలనుకుంటున్నానని చెప్పారు.
మరిన్ని వార్తల కోసం..
బుద్ధి మార్చుకోని పాక్.. తిప్పికొట్టిన భారత్
బెల్టు షాపులపై దాడులు చేస్తాం: కాంగ్రెస్
మద్యం మత్తులో దంపతుల గొడవ.. చిన్నారి మృతి