వాలంతరీని బలోపేతం చేస్తం

వాలంతరీని బలోపేతం చేస్తం

ఇరిగేషన్, అగ్రి ఆఫీసర్లు ఇక్కడే శిక్షణ ఇప్పిస్తం: మంత్రి ఉత్తమ్
మంత్రి సీతక్కతో కలసి కార్యాలయ సందర్శన

హైదరాబాద్, వెలుగు: వాటర్ అండ్ ల్యాండ్ మానేజ్​మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్(వాలంతరీ)ని బలోపేతం చేసి పునర్వైభవం తీసుకొస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సంస్థ ప్రధాన కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ఇరిగేషన్ అధికారులకు వాలంతరీలోనే శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. గురువారం మంత్రి సీతక్కతో కలిసి ఆయన వాలంతరీని సందర్శించారు. 

కొత్తగా నియామకమైన ఏఈఈలు శిక్షణ పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ నెల 14న వారికి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను ఉత్తమ్ పరిశీలించారు. ఇంజనీర్లు, వ్యవసాయ అధికారులకు స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లను వెంటనే డిజైన్ చేయాలని వాలంతరీ అధికారులను ఉత్తమ్ ఆదేశించారు. 

వారికే కాకుండా రైతులు, గ్రామీణ యువతకు ఇందులో శిక్షణ ఇస్తే బాగుంటుందని అన్నారు. నేషనల్ వాటర్ మిషన్, గంగా శుద్ధి, గ్రౌండ్ వాటర్ రీచార్జ్ వంటి వాటిపై పనిచేస్తున్నట్టు వాలంతరీ అధికారులు మంత్రులకు తెలిపారు. రైతులు, సైంటిస్టులకు శిక్షణ ఇచ్చేందుకు గాను సెంటర్ ఫర్ నేచురల్ ఫార్మింగ్​ను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.