భారత్, రష్యా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయి. అయితే, మారిన అంతర్జాతీయ పరిణామాలు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ప్రపంచ వేదికపై రష్యాని ఏకాకిని చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా, ఇండియాల గత సమావేశం 2021లో ఢిల్లీలో జరిగింది. తదుపరి సమావేశాలు ఇరుదేశాల అగ్రనాయకుల మధ్య జరగలేదు.
రష్యా, ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా ఆ సమావేశాలు జరగలేదు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం, ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ మృతి , యూకేలో ప్రభుత్వ మార్పు ఇలాంటి సందర్భంలో ఇరు దేశ నాయకుల సమావేశానికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ భేటీలో ముఖ్యంగా ఇరుదేశ నాయకులు రక్షణ, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడి , ఇంధన సహకారం తదితర విషయాలలో ద్వైపాక్షిక అంశాలు చర్చించారు.
రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు
విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల తాను రచించిన వై భారత్ మేటర్స్ అనే పుస్తకంలో ప్రపంచంలో జరిగిన అనేక మార్పులలో స్థిరమైనది భారత్, రష్యా సంబంధాలు అని పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం నుంచి రష్యా, భారతదేశం బలమైన సంబంధాలు కలిగి ఉంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్ పైకి రష్యా బలగాలను పంపిన నుంచి పాశ్చాత్య దేశాల నుంచి రష్యాపై ఆంక్షలు పెరిగాయి.
కానీ, భారత్ మాత్రం ఆంక్షలను ఖాతరు చేయకుండా తమ వాణిజ్య సంబంధాలను కొనసాగించింది. రష్యా నుంచి చమురు దిగుమతి భారీగా పెరిగింది. దీంతో మన వాణిజ్యం దాదాపు 65 బిలియన్ డాలర్లు దాటింది. తద్వారా భారత్, రష్యాతో మిత్ర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీనితో భారతదేశానికి వాణిజ్యపరంగా ఎంతో మేలు జరిగింది. ఇది మన విదేశీ మారకద్రవ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఐక్యరాజ్యసమితిలో కూడా రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ విషయంలో దూరంగా ఉండి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం శాంతి చర్చలతో పరిష్కారం కావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి భారత్ దౌత్య చతురతను ప్రదర్శించింది.
భారత రక్షణ రంగానికి రష్యా సహకారం
రష్యా ఎగుమతుల విలువ 65 బిలియన్ డాలర్లు ఉండగా, భారత ఎగుమతుల విలువ మాత్రం నాలుగు బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ తన వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్ రంగాలలో ఉత్పత్తిని ఇంకా పెంపొందించడానికి ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారతదేశానికి రష్యా చిరకాల మిత్రదేశంగా తోడ్పాటు అందిస్తోంది.
ఇందులో భాగంగా కీలకమైన ఎస్400 బాంబర్లు ఎగుమతితోపాటు శాస్త్ర సాంకేతిక మార్పిడికి రష్యా అంగీకరించింది. కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి రష్యా తన శాస్త్ర సాంకేతికతను భారత్కు అందించింది. సిప్రి నివేదిక ప్రకారం 2009 నుంచి 2013 వరకు భారత ఉత్పత్తులలో 76% రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అది ఇప్పుడు 2019 నుంచి 23 వరకు 36% కి చేరింది. రక్షణ విభాగాన్ని వివిధ దేశాల అత్యాధునిక ఆయుధాలతో పటిష్టం చేయాలని అనుకుంటుండమే దీనికి ప్రధాన కారణం.
ఐక్యరాజ్యసమితిలో భారత్కు రష్యా బాసట
భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ, మారుతున్న ప్రపంచ ముఖచిత్రం , రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాను ఒంటరి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత రష్యా పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. శక్తి, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఆరోగ్యం, విద్య, సంస్కృతి, పర్యాటకం రంగాల్లో భారత్, రష్యా మైత్రి ఇలాగే కొనసాగాలి. ఐక్యరాజ్య సమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం రష్యా బాసటగా నిలవాలి.
- అల్లం విజయేందర్