
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఏడాది పొడవునా టూరిజం ఉండాలని..పర్యాటక రంగంతో ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాఖండ్ వంటి సుందరమైన పర్వత రాష్ట్రంలో ఆఫ్ సీజన్ అనేది ఉండకూడదని ఆకాంక్షించారు. ఉత్తరకాశి జిల్లాలోని గంగాదేవి శీతాకాల నివాసంగా ప్రసిద్ధి చెందిన ముఖ్వా గ్రామంలో మోదీ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం హర్సిల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ..."టూరిస్టులు మార్చి, జూన్ మధ్య మాత్రమే ఉత్తరాఖండ్‌ను సందర్శిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్‌కు పర్యాటకుల సంఖ్య తగ్గుతున్నది. దాంతో ఇక్కడి హోటళ్లు, హోమ్‌స్టేలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఉత్తరాఖండ్‌లో శీతాకాలంలోనూ పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శీతాకాలంలో ఇక్కడ ట్రెక్కింగ్, స్కీయింగ్ వంటివి నిర్వహిస్తే ఫలితం ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఉత్తరాఖండ్ లో సూర్యరశ్మి కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
ఉత్తరాఖండ్ సాంప్రదాయ నృత్యం, సంగీతం, వంటకాలు, వేడి నీటి బుగ్గలు వంటివి ప్రదర్శించవచ్చు. అందువల్ల ఉత్తరాఖండ్‌లో టూరిజం అన్ని సీజన్లలో ఉండాలి. ఆఫ్-సీజన్ ఉండకూడదు. దీని వల్ల ఏడాది పొడవునా ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. శీతాకాలంలోనూ ఉత్తరాఖండ్‌లో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా కార్పొరేట్ రంగాలు కూడా ప్లాన్ చేయాలి" అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకాన్ని 'ఘమ్ తాపో టూరిజం'గా అభివర్ణించారు. కాగా..మోదీ ముఖ్వా దేవి ఆలయంలో 'గంగా హారతి' నిర్వహించారు. ఆపై హర్సిల్ వ్యాలీలో ట్రెక్, బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.