- అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన: మంత్రి శ్రీధర్ బాబు
- మంథని నియోజకవర్గం అడవి సోమన్‌పల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన
పెద్దపల్లి, మంథని, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని అడవి సోమన్‌పల్లిలో శుక్రవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల స్థలంలో రూ.300 కోట్లతో ఈ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నూతన విద్యా విధానంలో విద్యార్థులకు బోధన చేయనున్నట్టు వెల్లడించారు. 2026లో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, అడ్మిషన్స్ జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సరస్వతి నిలయంగా మారనుందన్నారు. అలాగే, వచ్చే నెల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం కానుందని ఆయన తెలిపారు.
పేదలకు నాణ్యమైన విద్య అందిస్తం:ఎంపీ వంశీకృష్ణ
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యాహక్కు చట్టం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు విద్యనందిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి హైదరాబాద్‌లో అంబేద్కర్ విద్యా సంస్థను నెలకొల్పి ఎంతో మందికి ఉచితంగా విద్యనందిస్తున్నారని తెలిపారు. నిరుపేదలకు సబ్సిడీ కింద ఏటా 5,000 మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్నట్టు చెప్పారు. విద్యతోనే పిల్లల భవిష్యత్ బాగుంటుందని చెప్పారు. పేదలకు మంచి విద్యను అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు అభినందనలు తెలిపారు. గతంలో గీత కార్మికులు తాటిచెట్ల మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయారని, వారి రక్షణార్థం కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కిట్లను అందిస్తోందని వెల్లడించారు.