ప్రతిపక్షాల మేలు కోసమేనా రైతు ఉద్యమం సాగదీత!

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 100 రోజులకు పైగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన కొన్ని రైతు సంఘాలు నడిపిస్తున్న ఈ ఉద్యమంతో రైతులకు మంచి జరుగుతుందా? లేక ప్రభుత్వ వ్యతిరేక వర్గాలకు మేలు జరుగుతుందా? అనే విషయాన్ని ఒక్కసారి బేరీజు వేసుకుంటేనే వాస్తవాలు తెలుస్తాయి. ఏ దేశంలోనైనా పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం, దేశ భద్రత, రక్షణ అంశాలకు తూట్లు పొడవడం వంటి పనులకు పూనుకుంటే ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, దేశహితాన్ని కోరే మేధావులు ఆ చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిందే. పాలకులను గద్దె దించాల్సిందే. కానీ మోడీ సర్కారు వచ్చిన తర్వాత ఆ రకమైన ఆరోపణలు ఎప్పుడూ రాలేదు. ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవం మరింత పెరిగింది. బ్రిటిష్ కాలం నుంచి అమలులో ఉండి, కాలం చెల్లిన అనేక చట్టాలను మారుస్తూ సంస్కరణలు తెస్తున్న మోడీ ప్రభుత్వం దేశంలోని రైతులకు మంచి జరగాలని మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. కానీ ప్రతిపక్షాలు వీటిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. కేవలం రెండు రాష్ట్రాల్లోని కొన్ని సంఘాల నేతలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉద్యమాన్ని దేశంలో రైతులెవ్వరూ పట్టించుకోకపోయినా సాగదీత ద్వారా ఏదో ఉందని నమ్మించి ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నాయి.

దేశానికి అన్నం పెట్టే రైతు ఎప్పటికీ ఒకరి కింద నలిగిపోవాల్సిందే అన్నట్టుగా ప్రతిపక్షాల తీరు సాగుతోంది. తాము పండించే పంటకు మార్కెట్ శక్తులు ధరను నిర్ణయించి, దోచుకునే వ్యవస్థ ఎప్పటికీ ఉండాలన్న వాదన చేస్తున్నాయి. గత ప్రభుత్వాల పాలనలో పండించిన పంటలకు  గిట్టుబాటు ధర లేక, సాగు పెట్టుబడులకు చేసిన  అప్పులు తీర్చలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయాన్ని మర్చిపోతున్నాయి. రైతన్నకు సరైన గిట్టుబాటు ధర దక్కే వీలు, మార్కెట్‌‌లో మంచి ధర ఎక్కడ దొరికితే అక్కడ అమ్ముకునే వీలు కల్పిస్తూ మోడీ సర్కారు చట్టం తెస్తే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

రెచ్చగొట్టి వాడుకోవడమేనా?

ప్రకృతిని నమ్ముకుని జీవించే రైతులు తమకు మేలు జరుగుతుందంటే  ఆశపడతారు. ఆనందిస్తారు. అలా కాక తమకు తెలియని కొత్త విషయాన్ని చూపెట్టి, మీకు నష్టం తప్పదంటూ భయపెడితే ఆందోళనకు దిగుతారు. ఇప్పుడు రైతు ఉద్యమం పేరుతో జరుగుతున్న తంతు ఇదే. కొత్త అగ్రి చట్టాల గురించి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు బలం ఉన్న రాష్ట్రాల్లో లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేసి రైతులను రోడ్డెక్కించారు. ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి నిరసనలు చేయిస్తూ రిపబ్లిక్‌‌ డే నాడు ఢిల్లీఎర్రకోట పరిసరాల్లో ఉద్యమ నాయకులు, వారి మాటలు నమ్మి వచ్చిన రైతులు సృష్టించిన హింసాత్మక సంఘటనల వెనుక రాజకీయ పక్షాల పాత్ర లేదని ఎవరైనా చెప్పగలరా? ఏ ఉద్యమమైనా ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. అలా జరిగితేనే ఉద్యమ ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి. కానీ హింసకు దిగితే ఏ ఫలితమూ ఉండదన్న విషయం ఉద్యమ నాయకత్వాలు గుర్తించాలి. మరోవైపు ఇటీవల స్తబ్ధుగా ఉందనుకున్న ఉద్యమంలో.. ఇప్పుడు పుదుచ్చేరి, మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ నిరసనల అగ్గి రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. మళ్లీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం 40 వేల మంది మహిళా రైతులతో ఆందోళన నిర్వహించడం ఈ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది.

కార్పొరేట్లను బూచీగా చూపి..

కొత్త రైతు చట్టాలతో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది. నోరు తెరిస్తే అదానీ, అంబానీలకు రైతుల భూములను అప్పగించేందుకు సిద్ధమైందని, మోడీ సర్కారు కార్పొరేట్ శక్తులకు దాసోహమైందని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్, వామపక్షాల నాయకులు రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. చట్టంలో ఉన్న కాంట్రాక్ట్ ఫార్మింగ్ ప్రకారం రైతులకే భూమిపై పూర్తి హక్కు ఉంటుందన్న విషయాన్ని కనీసం అర్థం చేసుకోకుండా రైతులను వారి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ట్రై చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం రైతుల కష్టాలను అర్థం చేసుకున్నది కాబట్టే వ్యవసాయ ఖర్చుల కోసం సంవత్సరానికి ప్రతి రైతుకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఈ మాత్రం సహాయం కూడా  గత ప్రభుత్వాలు చేయలేదనేది వాస్తవం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా పెట్టుబడి భారం తగ్గించడంతో పాటు, పంటను మార్కెట్ ధరకు ఏ మాత్రం తగ్గకుండా అమ్ముకునే వీలు కల్పిస్తోంది. రైతుల సంక్షేమం కోసం తెచ్చిన చట్టాలను వక్రీకరించడం కన్నా దుర్మార్గం మరొకటి లేదని ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలి.

మన రైతులపై వారికేం అవగాహన ఉందని?

మన దేశానికి సంబంధించిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగే రైతు ఉద్యమానికి కెనడాకు చెందిన పొయెటిక్ ఫౌండేషన్ (ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ) మద్దతు ప్రకటించడం, స్వీడన్ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్, పాప్ సింగర్ రిహన్నా వంటి వారు సపోర్ట్‌‌గా ట్వీట్లు చేయడం లాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదు. సోషల్ మీడియా ఇన్‌‌ఫ్లుయెన్సియర్లుగా చెప్పుకునే వీరితో ట్వీట్లు చేయించడం ద్వారా ప్రపంచవ్యాప్త మద్దతు అని చెప్పుకోవడం వెనుక రాజకీయ పక్షాల ప్రమేయం లేదని చెప్పగలరా? అసలు వారికి మన రైతులు, ఇక్కడి సాగు పద్ధతులు, రైతుల సమస్యలపై ఏం అవగాహన ఉండి, వారు ఈ పని చేశారని భావించాలి. వారి మద్దతు కోసం ఏ రాజకీయ పక్షాల ప్రోద్బలం లేదంటే నమ్మడం కష్టమే.

చట్టంలో లోపాలపై చర్చకు రాకపోవడమేంది?

కొత్తగా తెచ్చిన చట్టాలపై రైతులకు ఉన్న అభ్యంతరాలను చెబితే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం అనేక సార్లు ప్రకటించింది. నేరుగా కేంద్రమే కొన్ని ప్రతిపాదనలను రైతు సంఘాల ముందు ఉంచింది. పోనీ ఆ చట్టాల్లో ఉన్న లోపాలేంటన్నది వారే ప్రస్తావిస్తే, వాటిపైనా వివరణ ఇచ్చి, లోతుగా చర్చించడానికి అభ్యంతరం లేదని మోడీ సర్కారు స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులతో కమిటీని కూడా వేసింది.  పలు దఫాలుగా ఉద్యమ నాయకులు చర్చలకు వచ్చారు కూడా. కనీస మద్దతు ధర అంశంపై కేంద్రం హామీ ఇచ్చినా పదే పదే దాన్నే అటు తిప్పి ఇటు తిప్పి చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఏ ఒక్క సందర్భంలోనూ కొత్త చట్టాల్లో ఈ లోపాలు ఉన్నాయి, వీటిపై సమాధానం కావాలని కోరింది లేదు. చట్టాలను భేషరతుగా ఉపసంహరించుకోవాల్సిందే అని పట్టుబట్టారు. ఇక్కడే ఎవరికైనా అనుమానం వస్తుంది. నిజంగా రైతుల మేలు కోసం ఈ ఉద్యమం జరుగుతుంటే లోపాలపై చర్చించడానికి అభ్యంతరమేంటి? వెనుక ఎవరి ప్రోద్బలమో ఉండి, వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ఉద్యమ నాయకత్వం పని చేస్తోందన్న అనుమానాలు వస్తున్నాయి.

 ఇప్పుడే ఎందుకు ఊపందుకుంటున్నట్టు? 

రైతు ఉద్యమంపై సుప్రీం కోర్టు స్పందించి, కమిటీ వేసి పరిష్కారానికి సహకరించాలని ఇటు ప్రభుత్వానికి, అటు రైతు ఉద్యమ నాయకులకు సూచించింది. వాస్తవానికి పార్లమెంటు తీసుకున్న నిర్ణయాల్లో కోర్టుల జోక్యాన్ని ప్రభుత్వాలు ఒప్పుకోవు. కానీ ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాల వల్ల రైతుల్లో నెలకొన్న అనుమానాలను తొలగించి, వారికి మంచి చేసేందుకు తాము సుప్రీం కోర్టు కమిటీని ఆహ్వానిస్తున్నామని కేంద్రం చెప్పింది. అయితే రైతుల సంఘాల నాయకులు మాత్రం చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మరో మాట వినబోమని తెగేసి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్ల పాటు తాత్కాలికంగా చట్టాలను వెనక్కి తీసుకుంటామని, ఈ లోపు చట్టాలపై ఉన్న అనుమానాలను తీర్చేందుకు సిద్దమని చెప్పినా కదలి రాలేదు. ఈ మొండిపట్టును చూసి కొన్ని రైతు సంఘాలు ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లిపోయాయి కూడా. ఉద్యమం ఆగిందా అనుకుంటున్న సమయంలో మళ్లీ రకరకాల నిరసనల పేరుతో అగ్గి రాజేస్తున్నారు. రైతు ఉద్యమ నేత తికాయత్ ఉద్యమ కార్యాచరణ అంటూ మళ్లీ ప్రకటనలు చేస్తున్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 40 వేల మందితో ఢిల్లీ, పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో నిరసనలు తెలిపారు. ఇవన్నీ ఇప్పుడే ఊపందుకోవడానికి పుదుచ్చేరి సహా మరో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మేలు చేసే ఆలోచన ఉందా? అందుకే ఈ సాగదీతలా అన్న అనుమానం కలుగుతోంది. 

- ఉల్లి బాల రంగయ్య, పొలిటికల్ ఎనలిస్ట్