తుంగతుర్తి, మోత్కూర్, వెలుగు : తిరుమలగిరి మండలంలోని బికేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మందుల సామెల్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలో క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం అనుమతితో మాత్రమే ఇసుకను తీసుకెళ్లాలని సూచించారు.
దొంగతనంగా రాత్రి వేళలో ఎవరైనా ఇసుక తీసుకెళ్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టిన విద్యుత్ స్తంభాల తొలగింపు, కొత్త స్తంభాల ఏర్పాటు పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్ల విస్తరణలో పోతున్న ఇండ్లతో పాటు 102 స్తంభాల తొలగింపు పనులను మార్చి 10 వరకు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం ఆక్రమణకు గురైన కూరగాయల మార్కెట్ స్థలాన్ని కాపాడాలని, మోత్కూరును రెవెన్యూ డివిజన్ చేయాలని అఖిలపక్షం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.