- ప్రజలకు నాణ్యమైన ఫుడ్అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నం: మంత్రి దామోదర
- ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: ప్రజలకు నాణ్యమైన ఫుడ్ అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత పదేండ్లలో పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభా సంఖ్యకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఆ మేరకు ఆఫీసర్లను నియమిస్తున్నామని వివరించారు.
సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ దవాఖాన్లలో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సెక్రటేరియట్‌లో మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ టీమ్ లీడర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాచారం ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఆధునీకరించడంతో పాటు వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ కు కొత్తగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను మంజూరు చేశామని తెలిపారు.
అలాగే, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొస్తున్నామని, నెల రోజుల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం కలెక్టరేట్లలో స్పెషల్ సెల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఫుడ్‌సేఫ్టీలో హైదరాబాద్ దేశంలోనే చిట్ట చివరన ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై మంత్రి ఆరా తీశారు. కొంత మంది పనిగట్టుకుని 2022 నాటి డేటాతో ఇప్పుడు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. అలాగే, జిల్లాల్లో మెడిసిన్ సప్లై మేనేజ్‌మెంట్‌కు డిప్యూటీ డీఎంహెచ్‌వోలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలని మంత్రి ఆదేశించారు.