వనపర్తి, వెలుగు: బడి ఈడు పిల్లలను పనికి పంపిస్తే వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆపరేషన్ స్మైల్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుకోవాల్సిన చిన్నారులు కూలీలుగా మారడం సరైంది కాదన్నారు.
హోటళ్లు, ఫ్యాక్టరీలు, పత్తి చేన్లలో పని చేస్తున్నట్లు గమనిస్తే యజమానులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని ఆదేశించారు. అనంతరం ఆపరేషన్ స్మైల్ వాల్ పోస్టర్లను రిలీజ్ చేశారు.
అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఏఎస్పీ రామదాసు తేజావత్, ఆర్డీవో పద్మావతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి- రామ మహేశ్వర రెడ్డి, డీపీవో సురేశ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అలివేలమ్మ పాల్గొన్నారు.