రౌడీ షీటర్లపై పటిష్ట నిఘా : ​సత్యనారాయణ

నిజామాబాద్, వెలుగు: పోలీసు రికార్డులకెక్కిన రౌడీషీటర్ల ప్రతీ కదలికను ఇక నుంచి క్షుణ్నంగా గమనిస్తామని జిల్లా పోలీస్​కమిషనర్​ సత్యనారాయణ వెల్లడించారు. వారు రోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎందుకోసం కలుస్తున్నారనే డాటా సేకరిస్తామన్నారు. రౌడీ షీటర్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన సందర్భంలో సంబంధిత స్టేషన్​లో తప్పక చెప్పాలన్నారు. 

బుధవారం జిల్లాలోని రౌడీ షీటర్లకు ఆయన తన ఆఫీస్​ ప్రాంగణంలో కౌన్సిలింగ్​ ఇచ్చారు. సత్పవర్తన కలిగి ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకాలపాలతో కొత్తగా కేసులు నమోదు చేసే పరిస్థితి కల్పించొద్దన్నారు. గడిచిన మూడేండ్ల కాలంలో శాంతికి భంగం కలిగించిన వారిని గుర్తిస్తున్నామని, వారిపై రౌడీ షీట్​ఓపెన్​ చేస్తామన్నారు. 

సోషల్​మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. డీసీపీ జయరామ్, అడిషనల్​ డీసీపీ గిరిరాజు, ఏసీపీలు ఎం.కిరణ్​కుమార్, జగదీశ్​చందర్, కెఎం.కిరణ్​కుమార్, స్పెషల్​బ్రాంచ్​ సీఐ శ్రీశైలం తదితరులు ఉన్నారు.