ములకలపల్లి, వెలుగు: ఆరు రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో భాగంగా శనివారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద ఆశావర్కర్లు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బా ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. మా కడుపులు కాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆశావర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కీసరి జయ, నల్లి సుజాత పాల్గొన్నారు.
అశ్వారావుపేట: భయపడుతూ పాలనను చేయటం కష్టమని ముందస్తు అరెస్టులు చేస్తూ ప్రతిపక్షాల నోర్లు నొక్కితే సమస్యలు పరిష్కారం అవుతాయా అని అంగన్‌వాడీ జిల్లా నాయకురాలు కర్నాటి రాధ విమర్శించారు. శనివారం అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్ వద్ద సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్స్ రాస్తారోకో నిర్వహించి కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు.