సమ్మెను ప్రతిసారీ అణిచేసిన్రు

హక్కుల పేరుతో జరిపిన సమ్మెలను సర్కార్లు సహించవు. 1983, 1986ల్లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్టీవోల సమ్మెను ఎన్టీఆర్​ ప్రభుత్వం డీల్​ చేసిన తీరు.  ఆ తర్వాత 2003లో తమిళనాడులో ఉద్యోగుల్ని జయలలిత ఒక కలం పోటుతో ఇంటికి పంపించడం దీనికి సాక్ష్యాలు. ఈ మూడు సందర్భాల్లోనూ ఎన్టీఆర్​, జయ ప్రభుత్వాలు ‘ఎస్మా’ని బయటకు తీశాయి. ఇది చాలా బలమైన యాక్ట్​. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి చర్యల్నీ ఈ యాక్ట్​ సపోర్ట్​ చేయదు. సమ్మెలకు సుప్రీంకోర్టు సాయం కూడా ఉండదు.

సమ్మె ద్వారా తమ హక్కుల్ని సాధించుకోవచ్చని కార్మికులు, ఉద్యోగులు, టీచర్లు అనుకుంటారు. కానీ, హక్కుల సాధనకోసం ప్రజల్ని ఇబ్బందిపెట్టే స్ట్రయిక్​ల్ని అణచేయడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు భావిస్తాయి. 1983లో తెలుగు నేలమీద ఇట్లాగే జరిగింది. కార్మికుల ప్రతినిధిగా ఖాకీ డ్రెస్​ వేసుకుని ప్రచారం చేసి 1983లో పదవిలోకి వచ్చిన ఎన్​.టి.రామారావు… ఆ తర్వాత వేసిన మొదటి వేటు ఆయా వర్గాల మీదనే!  మొదట ఉద్యోగుల రిటైర్మెంట్​ ఏజ్​ని 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించేశారు. వరుసగా తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వేతనాలందుకునేవారిని ఇంటికి సాగనంపేవే! దాంతో ఎన్టీఆర్​ని ‘రద్దుల సామ్రాట్​’గా ప్రతిపక్షాలు విమర్శించేవి.

ఎన్టీఆర్​ అధికారానికొచ్చిన ఆరునెలలకే ఉద్యోగులు మొదటిసారి 1983 జూలై16న సమ్మెకు దిగారు. 19 రోజులపాటు సమ్మె చేసి ఆగస్టు 4వ తేదీన విరమించారు. ఈ 19 రోజుల్లోనే జిల్లా ఎంప్లాయిమెంట్​ ఎక్సేంజీల్లో రిజిస్టరయిన నిరుద్యోగులను డైలీ కాంట్రాక్ట్​ పద్ధతిలో అపాయింట్​ చేసుకోవడానికి ఎన్టీఆర్​ గవర్నమెంట్​ రెడీ అయిపోయింది. మరోపక్కన హైకోర్టుకూడా సమ్మెకు దిగిన ఉద్యోగులకు మూడో వంతు (35 శాతం) జీతమే ఇవ్వమని ఆదేశాలిచ్చింది. దీంతో తెగేవరకు లాగకుండా ప్రభుత్వం, ఎన్జీవోలు సర్దుబాటు చేసుకున్నారు.

53 రోజుల పాటు ఎన్జీవోల సమ్మె

నాదెండ్ల ఎపిసోడ్​ ముగిశాక, రెండోసారి అధికారానికొచ్చిన ఎన్టీఆర్​… రద్దుల జోలికి వెళ్లకుండా వ్యవస్థల్ని నీరుగార్చే పనికి దిగారు. నేరుగా తాను చర్యలు తీసుకోకుండా జనంలో ఆయా వ్యవస్థలపై వ్యతిరేకత వచ్చేలా చూసుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే… 1986లో నాన్​–గెజిటెడ్​ ఆఫీసర్లు (ఎన్జీవోలు) సమ్మెకు దిగారు. ఇది ఆంధ్రప్రదేశ్​ చరిత్రలోనే కాదు, యావత్తు దేశంలోనే సంచలనం కలిగించిన స్ట్రయిక్​. ఏకంగా 53 రోజులపాటు సాగింది. ఉద్యోగులు, కార్మిక సంఘాలు మొత్తం 88 ఏకమై పోరాట సమితిగా ఏర్పడి సమ్మెకు దిగాయి. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 4.45 లక్షల మంది సమ్మెలో పాల్గొనడంతో గవర్నమెంట్​ ఆఫీసులన్నీ స్తంభించిపోయాయి. ఎన్టీఆర్​ ప్రభుత్వం ఆరు శాఖల్ని అత్యవసర సర్వీసులుగా ప్రకటించి, ఎస్మా కింద సమ్మెలో పాల్గొన్నవాళ్లందరినీ గైర్హాజరుగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​ సివిల్​ సర్వీసెస్​ కాండక్ట్​ రూల్స్​లోని 4వ నిబంధన ప్రకారం సమ్మె చేయడానికి వీల్లేదని, సమ్మెకు దిగినవాళ్లను బర్తరఫ్​ చేస్తామని చెప్పింది. చివరకు నవంబర్​ అయిదున ఆరంభమైన స్ట్రయిక్​… డిసెంబర్​ 27న ‘నెగెషియేటెడ్​ సెటిల్మెంట్​’తో ముగిసింది.  స్ట్రయిక్​ పీరియడ్​లో జీతం కూడా ఇవ్వకుండా ఎన్టీఆర్​ ప్రభుత్వం సతాయించింది. సర్వీసు బ్రేక్​ చేస్తామని బెదిరించింది. చివరకు స్పెషల్​ క్యాజువల్​ లీవ్​గా పరిగణించి జీతం చెల్లించింది. ఆ తర్వాత మరలా రాష్ట్రంలో ఎన్జీవోలు స్ట్రయిక్​ చేసిన సందర్భాలు లేవు.

లక్షా 76 వేల మందిని తొలగించిన జయ

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా, 2003లో ఉద్యోగులు సమ్మెకు దిగారు. సుమారు 300 సంఘాలకు చెందిన 10 లక్షల 20 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు దీనిలో పాల్గొన్నారు. కొన్ని సర్వీసులు ఎమర్జెన్సీ కేటగిరీ కిందకు తెచ్చి తమిళనాడు ఎసెన్షియల్​ సర్వీసెస్​ మెయింటెనెన్స్​ యాక్ట్​ (టెస్మా) ప్రయోగిస్తామని జయ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆర్డినెన్స్​ కింద లక్షా 76 వేల మందిని తొలగించింది కూడా. సుప్రీం కోర్టుకు ఉద్యోగులు వెళ్లగా, అక్కడ చుక్కెదురైంది. ‘ప్రజలను ఇబ్బందులు పాలుచేసేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాల్ని స్తంభింపజేయడానికి ఏ ఒక్క ఆర్గనైజేషన్​ లేదా పొలిటికల్​ పార్టీలకు హక్కు లేదు. ఆఖరికి ట్రేడ్​ యూనియన్లయినాగానీ ప్రభుత్వం నుంచి తమకు కావలసిన ప్రయోజనాలను అడిగే హక్కున్నప్పటికీ సమ్మె చేసే హక్కు లేదు’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ ఎం.బి.షా, జస్టిస్​ ఏ.ఆర్​.లక్ష్మణన్​ల బెంచ్​ స్పష్టం చేసింది. సమ్మె సమయంలో టెస్మా యాక్ట్​ కింద తీసేసినవాళ్ల విషయంలో ఉదారంగా వ్యవహరించాలని జయ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది.

షరతులతో మళ్లీ ఉద్యోగాల్లోకి…

దాంతో, సమ్మె కాలంలో దురుసుగా ప్రవర్తించి క్రిమినల్​ కేసుల్లో ఇరుక్కున్నవాళ్లు మినహా మిగతావాళ్లను షరతులపై జయలలిత ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.  సమ్మెకు దిగినందుకు క్షమాపణ చెబుతూ, భవిష్యత్తులో స్ట్రయిక్​ జోలికి వెళ్లబోమని అండర్​టేకింగ్​ ఇవ్వడంతో టెస్మా కింద ఉద్యోగం పోగొట్టుకున్నవాళ్లకు మళ్లీ జాబ్​ లభించింది.

ఈ పరిణామాలన్నీ ఉద్యోగుల్లోనూ, కార్మికుల్లోనూ, టీచర్లలోనూ ఒకరకమైన భయాన్ని పుట్టించాయి. న్యాయబద్ధమైన డిమాండ్లనుసైతం ప్రభుత్వాలతో నెగోషియేటెడ్​ సెటిల్మెంట్​ ద్వారా సాధించుకోవలసిన పరిస్థితిని కల్పించాయి.

ప్రజలకు ప్రతినిధిని

ఆరు లక్షల గవర్నమెంట్​ ఉద్యోగుల వెల్ఫేర్​ మాత్రమే కాదు, నేను ఆరుకోట్ల ప్రజల సంక్షేమం కూడా చూడాలి. నేను ప్రజలకు ప్రతినిధిని. దాతను కాను. చెమటోడ్చి పన్నులు కడుతున్న ప్రజలను అడగండి. వాళ్లు సరేనంటే మీరు కోరిన కోర్కెలన్నీ తీరుస్తా.

                                                                                                                                    ‑ ఎన్.​టి.రామారావు, 1983 జూలై 2న

డాక్టర్​గా చెబుతున్నా…

డాక్టర్​ మర్రి చెన్నారెడ్డి హయాంలో, 1978 చివరలో, అసిస్టెంట్​ సివిల్​ సర్జన్లు స్టయిక్​ చేశారు. వాళ్లకు మద్దతుగా జూనియర్​ డాక్టర్లుకూడా సమ్మెకు దిగారు. అత్యవసర సర్వీసులు మినహా ఇతర సేవలన్నీ నిలిచిపోయాయి. వాళ్లకోసం సివిల్​ సర్జన్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి దగ్గరకు వెళ్లారు. ‘మీరు సీఎంగా కాకుండా ఒక డాక్టరుగా ఆలోచించండి. అసిస్టెంట్​ సర్జన్లు,  జూడాలు లేకుండా ఆసుప్రతుల్లో సేవలు చాలా కష్టం. మేము డ్యూటీలో ఉన్నా లాభం లేదు’ అన్నారు. దానికి చెన్నారెడ్డి… ‘నేను డాక్టర్​ని కాబట్టే చెబుతున్నాను. ప్రభుత్వ డాక్టర్లు సమ్మెలో ఉన్నంత మాత్రాన మెడికల్​ సర్వీసు ఆగిపోదు. రోగులు మీకోసం ఆగరు. మీకు ఆల్టర్నేటివ్​గా బయట వైద్యం అందించడానికి చాలా ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. మీ సమ్మెవల్ల వాళ్లంతా బాగుపడుతున్నారు. మరికొన్నాళ్లు స్ట్రయిక్​ కొనసాగిస్తే మీపైన ప్రజలకు నమ్మకం పోతుంది. కాబట్టి, సమ్మె మానేసి డ్యూటీలో చేరండి. నన్ను నమ్మండి. మీ సమస్యలు పరిష్కరిస్తాను’ అన్నారు. డిమాండ్లు సాధించకుండానే డాక్టర్ల సమ్మె ముగించాల్సి వచ్చింది.  చెన్నారెడ్డి మెడికల్​ అండ్​ హెల్త్​ విషయంలో చాలా లిబరల్​గా బడ్జెట్​ కేటాయించేవారని, ఎవరైనా స్ట్రయిక్​కి దిగితే మాత్రం కఠినంగా ఉండేవారని ఆయన వ్యవహరశైలి తెలిసినవాళ్లు  చెబుతారు.